ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో వైసీపీ చేరే అవకాశాలు ఉన్నట్టు సోషల్ మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అలాగే వైసీపీ కి మూడు క్యాబినెట్ బెర్తులు ఇస్తామని బీజేపీ అగ్రనేతలు ఆఫర్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ నిజంగా బీజేపీ అలాంటి ఆఫర్ ఇస్తే ఏపీ సీఎం జగన్ అంగీకరిస్తారా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ అంశంపై తర్జని పలువురు వైసీపీ కార్యకర్తలు .. నేతలు .. విశ్లేషకులతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించింది.
———–
జగన్ వ్యవహార శైలి తెలిసినవారు … దగ్గరగా ఆయనను గమనించే వారు అలాంటి ప్రతిపాదన వచ్చినా జగన్ అంత సుముఖత చూపరని అంటున్నారు. మోడీ క్యాబినెట్ లో చేరినందువల్ల జగన్ కి అదనంగా ఒరిగేదేమి ఉండదని చెబుతున్నారు . ఇప్పటికే జగన్ మోడీ ల మధ్య మంచి సంబంధాలున్నాయి. జగన్ రాష్ట్రానికి కావాల్సిన నిధులు విడుదల చేయించుకుంటున్నారు. ఢిల్లీలో వివిధ పనులకోసం , మంత్రుల ను కలిసేందుకు , లాబీయింగ్ చేసేందుకు విజయ సాయి రెడ్డి , మిదున్ రెడ్డిలు ఎలాగూ ఉన్నారు. కొత్తగా మినిస్టర్ పదవులు వచ్చినా వారు స్వేచ్ఛగా మోడీ కి తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోలేరు. కీలక పదవుల్లో ఉన్న అమిత్ షా,రాజనాథ్ సింగ్ , నిర్మలా సీతారామన్ వంటి వారే మోదీకి చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకునే సాహసం చేయరు.
ఇక మంత్రి పదవి లేకపోయినా చక్రం తిప్పే సామర్ధ్యం ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వారు ఉన్నపుడు జగన్ పార్టీకి మంత్రి పదవులెందుకు ?అనే మాటలు కూడా పార్టీ సర్కిల్స్ లో వినబడుతున్నాయి. గతం లో టీడీపీ నేతలు మోడీ క్యాబినెట్లో చేరినప్పటికీ సాధించింది ఏమిలేదు. ఇక లోక సభలో, రాజ్య సభలో కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా వాటికి జగన్ పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఆ బిల్లులు పాస్ అవడానికి సహకరిస్తున్నారు. ఇటీవల వ్యవసాయ బిల్లుపై విపక్షాలు విరుచుకుపడితే వైసీపీ సభ్యులు ఏమి మాట్లాడలేదు. బిల్లుకు అనుకూలంగానే ఓటు వేశారు. తెరాస వ్యతిరేకించినా వైసీపీ స్పందించలేదు. కేసీఆర్ బహిరంగంగానే విమర్శించారు. జగన్ ఏమి మాట్లాడలేదు.
అంతకు ముందు సమాచారహక్కు చట్ట సవరణ బిల్లు సమయం లో కూడా అదే వైఖరి. తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ సంఘటనపై పలు పార్టీలు స్పందించినా జగన్ ఏం మాట్లాడలేదు. జాతీయ పార్టీ నేత చంద్రబాబు కూడా స్పందించలేదు. అది వేరే విషయం. కొంతమంది వైసీపీ కార్యకర్తలు కాంగ్రెస్ కి సానుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు.
ఇక కొన్నాళ్ళ క్రితం మోడీ చెబితే అంబానీ మిత్రుడు పరిమళ్ ధీరజ్ లాల్ నత్వాని కి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. భవిష్యత్ లో మోడీ పీఎం అయినా కాకపోయినా లాబీయింగ్ కి అంబానీ పనికొస్తారనే వ్యూహంతో జగన్ ఆ రోజు అలాంటి నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం నూరు శాతం సేఫ్ జోన్ లో ఉన్న వైసీపీ రెండు మూడు పదవుల కోసం క్యాబినెట్ లో చేరితే జగన్ కి వచ్చే ఇబ్బందులు కూడా ఉన్నాయి. చంద్రబాబు ముందు ప్రత్యేక హోదా సంగతి తెరపైకి తెస్తారు. ఎన్నికలకు ముందు ప్రత్యేకహోదా సాధిస్తామని అన్నారు కదా … ఇపుడు తేల్చండి అంటారు.దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితి. మోడీ ప్రభుత్వం ఇంకా మూడేళ్ళ కు పైగా అధికారంలో ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వ చర్యలకు కూడా జవాబు దారీ కావాల్సి ఉంటుంది.
కాగా చంద్రబాబు ను మోడీ అక్కున చేర్చుకుంటారని భయం కూడా జగన్ కి లేదు. బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే స్థితిలో లేరు.
కాబట్టి మోడీ క్యాబినెట్ లో చేరాల్సిన అవసరం ఎటు నుంచి చూసినా కనిపించడంలేదని విశ్లేషకులు అంటున్నారు.
జగన్ విజ్ఞతతో బీజేపీ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించడమే మంచిదని చెబుతున్నారు .ఇపుడున్న పరిస్థితుల్లో మోడీకి కూడా ఎవరి మద్దతు అవసరం లేదు. కొన్ని పార్టీలు ఎన్డీయే లో నుంచి వెళ్లినప్పటికీ కాంగ్రెస్ బలహీనంగా ఉన్నంతవరకుమోడీ బలంగా ఉన్నట్టే. అలాగే జగన్ కూడా పాలనా పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తే మరింత బలపడతారు.
కాగా కొంతమంది వైసీపీ హార్డ్ కోర్ కార్యకర్తలైతే మోడీ క్యాబినెట్లో చేరడం need of the hour .. అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కొన్ని పరిణామాలను కంట్రోల్ చేయాలంటే వైసీపీ బీజేపీ ఆఫర్ ను అంగీకరించక తప్పదు అంటున్నారు. క్యాబినెట్ లో చేరితే స్పెషల్ స్టేటస్ కాకపోయినా అలాంటి దే రాష్ట్రానికి ఉపయోగపడే స్కీం ను జగన్ సాధించే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి. బీజేపీ పట్ల ప్రస్తుతం ముస్లిం ఓటర్లు వ్యతిరేకత తో లేరు కాబట్టి వైసీపీ కున్న ఓటు బ్యాంకుపై ఆ ప్రభావం ఉండబోదని చెబుతున్నారు.
ఇంకొంతమంది పీఎం మోడీ ” కొన్ని ” హామీలు ఇస్తే జగన్ పార్టీ క్యాబినెట్ లో చేరే అవకాశాలున్నాయని అభిప్రాయ పడ్డారు.
ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తాయి . జాతీయ పార్టీలు దేశం గురించి పార్టీ గురించి ఆలోచిస్తాయే కానీ ఒక రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించవు.
———- KNMURTHY