అయ్యారే ..ఇపుడు ఏమి చేయవలె ??

Sharing is Caring...

సరదాగా నవ్వుకునేందుకు … 

(వైట్‌హౌస్ లోని ఒక చీకటి గది.. ట్రంప్ అద్దం ముందు నిలబడి, కిరీటం లేని రాజులా తల పట్టుకుని, ఎన్టీఆర్ లా గంభీరంగా, అదే సమయంలో ఏడుపు గొంతుతో పలవరిస్తున్నారు..)

ట్రంప్: అయ్యారే  మా అజేయమైన ఎఫ్-35 విమానము.. ఇరాన్ గాలిలో పేలి నేలమట్టమగుటయా? వేల కోట్ల డాలర్లు.. కుబేరుడి ఖజానాను సైతం వెక్కిరించే నా అమెరికా సంపద.. ఇలా …..ఎంతటి అవమానం! ఎంతటి పరాభవం!!

అందరూ నవ్వుచున్నారు.. ఆ పుతిన్ తన వోడ్కా గ్లాసులో నా పరువును కలిపి తాగుచున్నాడు! ఆ జిన్‌పింగ్ తన గ్రీన్ టీ సిప్పుల మధ్య నా టెక్నాలజీని వెక్కిరించుచున్నాడు! వారే కాదు.. నాటో (NATO) దేశాల నేతలు.. నా కష్టకాలంలో ‘మేము రాము.. మాకు సంబంధం లేదు’ అని ముఖం చాటేయుటయా? ‘అమెరికా ఫస్ట్’ అన్న నా నినాదము నేడు ‘అమెరికా వరస్ట్’ అని లోకమంతా ఘోషించుటయా?

(బయట అమెరికన్ల నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి: “మాకు శాంతి కావాలి.. గ్యాస్ ధరలు తగ్గాలి.. యుద్ధం వద్దు..”)

ట్రంప్: (కిటికీ వైపు చూస్తూ) వినబడుచున్నవి.. నా సొంత ప్రజల హాహాకారాలు నా చెవులను తుత్తునియలు చేయుచున్నవి! నేను యుద్ధ వీరుడననుకుంటే.. వీరు నన్ను ‘వార్ రూమ్’ లో బంధించి వీధుల పాలు చేయుచున్నారు.

బిబీ (నెతన్యాహు)..! నీవు నన్ను నమ్మించి నట్టేట ముంచావు! నీ గ్యాస్ ఫీల్డ్స్ దాడుల వల్ల ఇక్కడ నా గ్యాస్ స్టౌలు వెలగడం లేదు! ఏది దారి? ఏది విముక్తి?

నా యుద్ధ విమానము కూలినది.. నా అహంకారము నేలకూలినది.. లోకమంతా ఏకమై నన్ను వేలెత్తి చూపుతుంటే.. ఈ డొనాల్డ్ ట్రంప్.. ఈ అపర కుబేరుడు.. నేడు ఒంటరివాడై, అందరి వెక్కిరింతలకు గురై.. ఇలా తల పట్టుకుని విలపించవలసి వచ్చెనా?

హతవిధీ! ఎంతటి విచిత్రము.. ఎంతటి విషాదము!!” ఈ యుద్ధ విమానాల పరిజ్ఞానాన్ని పసిగట్టేందుకే కదా రష్యా ,చైనా లు భారీగా సొమ్ము వెచ్చిస్తున్నాయి. ఆ ఇరాన్ వాడు ఎంతటి మొండి వాడో కదా ? తగ్గేదేలా అంటూ మరింత రెచ్చగొడుతున్నాడు ? ఇరాన్ బలాన్ని తక్కువగా అంచనా వేశామా ?అదే జరిగినట్టుంది. ఇపుడు ఏమి చేయవలె ??

(ట్రంప్ తన రెండు చేతులతో తల పట్టుకుని సోఫాలో కుప్పకూలిపోయారు.. పక్కనే ఉన్న ఫోన్ లో ట్విట్టర్ నోటిఫికేషన్లు ‘ట్రంప్ ఫెయిల్డ్’ అని మోగుతూనే ఉన్నాయి..)

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!