రాముడేమన్నాడోయ్ ? ….. అందాల రాముడు సినిమాలో పాట అది. 70 దశకంలో పెద్ద హిట్ సాంగ్ అది. ఆ సినిమాలో పాటలన్నీ హిట్టే. సినిమా మాత్రం హిట్ కాలేదు. బాపు రమణ ల సొంత సినిమా అది. జనాలకు ఎందుకో నచ్చలేదు. అలా అని సినిమా ఛండాలం అని చెప్పలేం. అలాంటి సినిమాలు .. కథలు బాపు రమణల సారథ్యంలో రావు కదా. గోదావరి నదిపై లాంచీల్లోనే 80 శాతం సినిమా నడుస్తుంది.
అక్కినేని నాగేశ్వర రావు హీరో గా నటించిన ఈ సినిమా 1973 లో విడుదల అయింది. భూగోళం మీద ఉన్న వివిధ క్యారెక్టర్లను ఒక చోట చేర్చి ఒక కొత్త తరహా ప్రయోగం చేశారు. అయితే ఆ ప్రయోగం ప్రేక్షకులకు నచ్చలేదు. అపుడు బాపు రమణలు తమపై తామే జోకులేసుకున్నారు. సరదాగా నవ్వుకున్నారు. అవి కూడా జనంలోకి వచ్చాయి. అందాల రాముడు సినిమా ఫస్ట్ రిలీజ్‌లో అనుకున్నట్లుగా ఆడకపోతే డబ్బు ఖర్చు పెట్టి ఇలాంటి జోకులతో ప్రచారం చేసుకున్నారని కూడా జనం అనుకున్నారు.
అంకె పెద్దగా కనపడాలి అని రాష్ట్రంలో ఆడిన అన్ని ఆటలను కలిపి పెద్ద అంకె వేసి ‘సంయుక్త ప్రదర్శన’ అని క్లెయిమ్ చేసి ఒక కార్టూన్ వేశారు బాపు. దాని కిందే జోకు – టీచరు పడవల వేగంపై ప్రశ్న వేస్తే విద్యార్థి చెబుతాడు.అసలు పడవలు కదలటమే లేవండి అంటూ. ఆ కార్టూన్ అప్పట్లో బాగా క్లిక్ అయింది.
అందాలరాముడు సినిమాలో కథంతా రెండు లాంచీల చుట్టూ తిరుగుతుంది. ఒకటి మధ్యతరగతి వారి జనతా బోటు, మరొకటి డబ్బున్నవాళ్ల రాజహంస. ఈ రెండింట్లో ఉన్న వారి మధ్య జరిగే పేచీలు, ప్రేమలే కథాంశం. ఇందులో తీతా పాత్ర బాగా పాపులర్ అయింది. తీతా అంటే తీసేసిన తాసిల్దార్ అని. అల్లు రామలింగయ్య ఆపాత్రలో జీవించాడు. ఓ ఫైవుందా అంటూ వెంటబడే రాజబాబు పాత్ర కూడా బాగా క్లిక్ అయింది. ఇంకా సొసైటీ లో మనకు నిత్యం కనబడే పాత్రలన్నీ సినిమాలో ఉన్నాయి.
హీరోయిన్ గా లత నటించింది. అప్పట్లో ఆమె అందాల తార. రాముడి జోడీ గా ఆమాత్రం అందగత్తె ఉండాలి కదా. ఆ ఇద్దరి కాంబినేషన్ కూడా చూడ ముచ్చటగా ఉంటుంది. ఇక ప్రముఖ నటుడు నాగభూషణం సంగతి చెప్పనక్కర్లేదు.రావు గోపాలరావు బాపు రమణల టీమ్ లో చేరకముందు నాగభూషణం కీలక పాత్రలు చేసేవాడు. అన్నట్టు నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి గాంచిన నూతన్ ప్రసాద్ మొదటి సినిమా ఇదే. ఇంకా సాక్షి రంగారావు .. రావికొండలరావు.. సూర్య కాంతం వంటి నటులు తమదైన శైలిలో అలరిస్తారు.
ముళ్ళపూడి వారి సంభాషణలు సందర్భానుసారంగా పేలుతాయి. గోదావరి అందాలను వి.ఎస్.ఆర్.స్వామి అద్భుతంగా తెరపై కెక్కించారు. అప్పట్లో ప్రముఖ కెమెరామన్ ఇషాన్ ఆర్య ను తీసుకోవాలి అనుకుని .. మళ్ళీ బడ్జెట్ పెరుగుతుందని స్వామితో సినిమా చేయించుకున్నారు.బాపు రమణలు కష్టపడి తీసిన ఈ సినిమా ఆర్ధికంగా పెద్ద విజయం సాధించలేదు. సినిమాలో పాటలు వినసొంపుగా ఉంటాయి.
‘ఎదగడానికి ఎందుకురా తొందరా ఎదరా బ్రతుకంతా చిందరవందర ‘ …. ‘కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా మెరిసే గోదారిలో విరబూసిన’ … ‘ మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ మము’…. ‘మెరిసిపోయే ఎన్నెలాయె పరుపులాంటి తిన్నెలాయె’…. ‘పలుకే బంగారమాయెరా అందాల రామ’ …. ‘రాముడేమన్నాడోయి సీతా రాముడేమన్నాడోయి’…. ‘సమూహ భొజనంబు సంతోషమైన విందు అంతస్తులన్ని’…… ‘అబ్బోసి చిన్నమ్మా ఆనాటి ముచ్చటలు’ వంటి పాటలకు మహదేవన్ మంచి బాణీలు అందించారు.బాలమురళీ .. సుశీల రామకృష్ణలు ఈ పాటలు పాడారు. ఈ సినిమా యు ట్యూబ్ లో ఉంది. ఆసక్తి గలవారు చూడొచ్చు.
————KNM