ఏమిటి ఈ ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ ?

Sharing is Caring...

“ఆపరేషన్ బ్లూ స్టార్” ………..  దీని గురించి దేశంలో చాలామందికి తెలియదు. ఇది ఒక సైనిక చర్య. 80 వ దశకంలో సిక్కు ఉగ్రవాదులను ఏరివేసేందుకు  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వేసిన ఒక వ్యూహాత్మక పధకం. నాడు ఇందిర నిర్ణయం కారణంగా చివరకు ఆమె కూడా అంగరక్షకుల తూటాలకు బలయ్యారు.

దీనికంటే ముందు ఖలిస్థాన్ ఉద్యమం గురించి చెప్పుకోవాలి. ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కావాలని సిక్కులు 70 దశకం నుంచే ఉద్యమం మొదలు పెట్టారు. అహింసా మార్గంలో కాకుండా ఆ ఉద్యమం హింసను ఆశ్రయించడంతో  ఇందిరా గాంధీ  ఉక్కుపాదం తో అణిచివేసింది. పంజాబ్ లో శాంతి భద్రతల పరిరక్షణకు  ఈ బ్లూ స్టార్ ఆపరేషన్ ను సైన్యానికి అప్పగించింది. అతి చాకచక్యంగా  దీన్ని అమలు చేయించింది. ఆర్మీ చీఫ్ జనరల్ వైద్య ఈ ఆపరేషన్ కి సారధ్యం వహించారు. 

అప్పట్లో ఉద్యమ నాయకుడిగా ఉన్న జర్నైల్ సింగ్ భింద్రన్వాలె సిక్కు యువత పై తీవ్ర ప్రభావం చూపారు. వారిని ఆకట్టుకుని ఉద్యమం వైపు మళ్లించారు. ఖలిస్థాన్ మద్దతుదారులతో అమృత్ సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ ను ఆక్రమించారు. అక్కడ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించారు.

స్వాతంత్య్ర పోరాటంలో సిక్కులు ప్రధాన పాత్ర పోషించారు. అందుకు వారిని గౌరవిస్తూ  కొన్ని ప్రత్యేక హక్కులను ప్రభుత్వం కల్పించింది. అందులో ఒకటి కరవాలం పట్టుకుని ఎక్కడైనా తిరిగే హక్కు. రెండోది ఇతరులు గోల్డెన్ టెంపుల్ లోకి ప్రవేశించకుండా నిషేధం.ఈ రెండు అంశాలను అడ్డం పెట్టుకుని ఉగ్రవాదులు చెలరేగిపోయారు. అసలు మొదట్లో ఖలిస్థాన్ నినాదాన్ని రాజకీయ నినాదం గా భావించారు. తర్వాత పాకిస్థాన్ చొరవ తో ఉద్యమం దారి తప్పింది. 

పరోక్షంగా అమెరికా కూడా మద్దతు ఇచ్చిందనే విమర్శలు లేకపోలేదు. పాకిస్తాన్ ఖలిస్థాన్ ఉద్యమ కారులకు శిక్షణ ఇచ్చి ఆయుధాలు కూడా అందజేసింది. ఇక ఉగ్రవాదులు  ప్రభుత్వం కల్పించిన హక్కులను  అడ్డుగా పెట్టుకుని  జనాలను చంపి వెళ్లి స్వర్ణ దేవాలయంలో దాక్కునే వారు. పోలీసులు వారిని వెంబడిస్తూ వెళ్లినప్పటికీ ఆలయం ప్రవేశం నిషిద్ధం కాబట్టి వెనుదిరిగేవారు.

నాలుగైదేళ్ళ పాటు ఉగ్రవాదులు తమ చర్యలతో పంజాబును అట్టుడికించారు. భింద్రన్వాలే ఆలయం లోపల ఉండి ఈ తతంగమంతా నిర్వహించేవారు. ప్రభుత్వం ఓర్పు నశించి చివరికి ఆపరేషన్ బ్లూ స్టార్ కి ప్లాన్ చేసింది. జూన్ 1 .. 1984 న మొదలై దాదాపు పదిరోజులు కొనసాగింది. మీడియా కి ఈ విషయం తెలిసి స్వర్ణ దేవాలయం వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా జర్నలిస్టులను మిలటరీ బస్సుల్లో  ఎక్కించి హర్యానా సరిహద్దులో వదిలేశారు.

వేరే రాష్ట్ర జర్నలిస్టులను రాష్ట్రంలోని రానివ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.  రవాణా వ్యవస్థ ఆగిపోయింది. తర్వాత రోజుల్లో ప్రభుత్వం అలా వ్యవహరించడంపై  తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కానీ ఇందిర వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  అప్పట్లో ఇందిరా గాంధీ ధైర్యం చేసి ఆ నిర్ణయం తీసుకొని ఉండకపోతే ఖలిస్థాన్ ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయి దమనకాండకు పాల్పడేవారు.

బ్లూ స్టార్ ఆపరేషన్ కు ప్రతీకారంగా ఉగ్రవాదులు  సరిగ్గా నాలుగు నెలల తర్వాత పకడ్బందీగా ప్లాన్ వేసి ప్రధాని ఇందిరను 1984 అక్టోబర్ 31 న హతమార్చారు. ఆమె అంగరక్షకు లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ ఇద్దరు  సిక్కు మతానికి చెందిన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లే. ఆ ఇద్దరినీ మిగతా సిబ్బంది స్పాట్ లోనే కాల్చేశారు. 

ఇంటెలిజెన్స్ ఈ ఘటనలో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవాలి. ప్రధాని భద్రతా వ్యవస్థ లో లోపాలకు ఈ ఘటన అద్దం పట్టింది. బ్లూ స్టార్ ఆపరేషన్ తర్వాత భద్రతా సిబ్బంది లో ఎవరు ఎలాంటి వారో ? వారి కదలికల పై  ఇంటెలిజెన్స్ కన్నేసి ఉంచి తగు సూచనలు ఇందిరకు ఇవ్వాల్సింది.

ఇక ఇందిరా గాంధీ హత్య తర్వాత దేశమంతటా సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. కొన్ని రోజులపాటు మారణహోమం కొనసాగింది. మొత్తం 3 వేలమంది సిక్కులు బలైపోయారని అంటారు. అందులో ఎందరో అమాయకులు కూడా ఉన్నారు. మరీ దారుణంగా వెంటాడి సిక్కు మహిళలను , పురుషులను కూడా ఊచకోత కోశారు.  

కాంగ్రెస్ కార్యకర్తలు ఈ అల్లర్లలో కీలక పాత్ర పోషించారని అభియోగాలున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చాలారోజులు పట్టింది. 1986 లో జనరల్ వైద్యను కూడా సిక్కు ఉగ్రవాదులు హతమార్చారు . ఈ ఘటనల ఆధారంగా   ఇందూ సర్కార్ , అము, 31 అక్టోబర్ వంటి  సినిమాలు కూడా వచ్చాయి. 

———- KNMURTHY

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!