ఈ “గేట్ వే ఆఫ్ హెల్” కథేమిటి ?

Sharing is Caring...

Gateway of Hell……………………………………

ఈ ఫొటోలో కనిపించే అగ్నిగుండాన్ని గేట్ వే అఫ్ హెల్ అంటారు. గత యాభై ఏళ్లుగా అది మండుతూనే ఉంది. తుర్క్‌మెనిస్తాన్ దేశ రాజధాని అష్గాబాత్‌కు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరకుమ్ ఎడారిలో ఈ అగ్నిగుండం ఉంది. 1971లో సోవియట్ శాస్త్రవేత్తలు ఇక్కడ డ్రిల్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పెద్ద బిలం ఏర్పడిందని అంటారు.

ఈ బిలం వెడల్పు 69 మీటర్లు ..30 మీటర్ల లోతులో ఉందని అంచనా.1971లో సోవియట్ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు కరకుమ్ ఎడారిలో చమురు కోసం డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున సహజవాయువు పాకెట్‌ను తాకడంతో భూమి క్రుంగి పోయి ఈ బిలం ఏర్పడింది.

ఈ సహజ వాయువు పాకెట్‌లో మీథేన్ ఉంది. ఆ మీథేన్ వాతావరణంలోకి లీక్ కాకుండా ఆపడానికి శాస్త్రవేత్తలు దానిని నిప్పుతో వెలిగించారు.బిలంలో ఉన్న వాయువు కొన్ని వారాల్లోనే కాలిపోతుందని భావించారు.అప్పట్లో శాస్త్రవేత్తలు బిలం లో ఉన్న గ్యాస్ మొత్తాన్ని తప్పుగా అంచనా వేశారు. ఫలితంగా ఐదు దశాబ్దాలుగా బిలం లో మంటలు ఆరలేదు.

అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ప్రకారం “తుర్క్‌మెనిస్తాన్ ఐదు కాస్పియన్ సముద్ర తీర దేశాలలో ఒకటి, ఇక్కడ పెద్ద పరిమాణంలో చమురు.. సహజ వాయువు నిల్వలు ఉన్నాయి.కాగా 1960వ దశకంలో ఈ బిలం ఏర్పడిందని, అయితే 1980 వరకు మంటలు కనిపించలేదని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. సోవియట్ పాలనలో చమురు.. గ్యాస్ చాలా ఖరీదైన వస్తువులు కాబట్టి తవ్వకాల విషయం రహస్య సమాచారంగా మిగిలిపోయిందని అంటారు.

ఈ క్రేటర్ ఇపుడు ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారింది. సంవత్సరానికి 6,000 మంది పర్యాటకులు ఇక్కడ కొచ్చి ఈ అగ్నిగుండాన్ని చూసి వెళుతుంటారు. 2018 లో ఆ దేశ అధ్యక్షుడు గుర్బాంగులీ బెర్డి ముఖమెడోవ్ దీని పేరును అధికారికంగా “షైనింగ్ ఆఫ్ కరకుమ్” గా మార్చారు.

2013లో నేషనల్ జియోగ్రాఫిక్ నిధులు సమకూర్చిన యాత్రలో కెనడియన్ సాహసికుడు జార్జ్ కౌరౌనిస్ ఈ బిలంలోకి లోపలికి వెళ్లిన మొదటి వ్యక్తి గా చరిత్ర కెక్కారు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం మీథేన్ బయటకు వెలువడితే వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఫలితంగా మనుష్యులు చనిపోతారు.
అందుకే బెర్నిముఖమెడోవ్ మంటలను ఆర్పేందుకు నిపుణులతో సంప్రదిస్తున్నారు. అంతకుముందు కూడా ఈ మంటలు ఆర్పేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ అవేవి విజయవంతం కాలేదు. ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, తుర్క్మెనిస్తాన్ 2019లో 63.2 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది.

రష్యా, చైనా, ఇరాన్‌లను దాటి పాశ్చాత్య దేశాలకు అమ్మకాలను విస్తరించేందుకు ఆ దేశం రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఉత్పత్తిని మూడు రెట్లు పెంచాలని నిర్ణయించింది. తుర్క్‌మెనిస్తాన్ మీథేన్ లీకేజీలకు కేంద్రంగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం 2019లో అత్యంత తీవ్రమైన 50 మీథేన్ గ్యాస్ లీకేజీలు సముద్ర తీరంలో జరిగాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!