ఆపరేషన్ కాక్టస్ కథ ఏమిటి ?

Sharing is Caring...

సుదర్శన్ . టి  ………………….. Operation Cactus……………………  

1980, 83 లో మాల్దీవుల మౌమూన్ అబ్దుల్ గయ్యూం ప్రభుత్వాన్ని దించడానికి రెండు కుట్రలు జరిగాయి కానీ ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. మళ్లీ 1988లో ఒక వ్యాపారవేత్త అబ్దుల్లా లుతూఫీ, పూర్వ అధ్యక్షుడు ఇబ్రహీ నాసిర్ తో కలిసి ప్రభుత్వాన్ని కూల్చి అధికారం హస్తగతం చేసుకోవడానికి మళ్లీ కుట్ర పన్నారు.

ఈసారి శ్రీలంక PLOTE (People’s Liberation Organisation of Tamil Eelam) కు చెందిన 80 మంది సాయుధ వేర్పాటువాదులు ఓ బొట్ హైజాక్ చేసి నవంబర్ 3న మాల్దీవుల రాజధాని మాలే చేరుకున్నారు. కొన్ని గంటల్లోనే మాల్దీవుల విమానాశ్రయం, పోర్టులు, టీవీ, రేడియో స్టేషన్లు తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. వారిలో కొందరు ప్రెసిడెంట్ భవనం వైపు వెళ్లారు. 

చావు తధ్యం అని గ్రహించిన అధ్యక్షుడు అబ్దుల్ గయ్యోం రక్షించమని వివిధ దేశాలకు, ఐక్యరాజ్య సమితికి సందేశం పంపారు. ఇందులో తలదూర్చడానికి ఏ దేశమూ ముందుకు రాలేదు. మరోసారి మాలే నుండి SOS మెసేజ్ రావడంతో అధికారులు ఈ విషయాన్ని ప్రధాని రాజీవ్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు.

రాజీవ్ గాంధీ వెంటనే ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. త్రివిధ దళాల అధిపతులు, వారి డిప్యూటీలు, డిఫెన్స్ సెక్రెటరీ, డిల్లీలో హాలిడే గడపడానికి వచ్చిన మాల్దీవుల రాయబారి మొదలగువారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అవసరమైతే అంతర్జాతీయ మిషన్ మీద వెళ్ళడానికి తయారుగా ఉండాలని ఆగ్రా ఎయిర్ బేస్ లోని పారా బ్రిగేడ్ కు ఉత్థర్వులు అందాయి. అలాంటి సందేశమే నౌకాదళానికి వెళ్ళింది.

రెండు గంటలు సాగిన సమావేశంలో ఇక వేరే ఏ దేశాలు మాల్దీవుల విషయంలో తలదూర్చడానికి దైర్యం చేయడం లేదు అని తెలిసి రాజీవ్ గాంధీ ఈ మిషన్ కు అనుమతి ఇచ్చారు.వైమానిక దళం నుండి గ్రూప్ కెప్టెన్ అశోక్ గోయల్, ఆర్మీ నుండి, తర్వాత జనరల్ అయిన వి.పి.మల్లిక్ గార్లు వెంటనే ఆగ్రా చేరుకుని ఆ సాయంత్రమే IL-76 హైస్పీడ్ మిలటరీ విమానంలో 3000 కిమీల దూరంలో ఉన్న మాల్దీవులకు చేరాలని నిర్ణయించారు.

5.45pm, IL-76 ఆగ్రా బేస్ నుండి గాల్లోకి లేచింది. 8.45PM, విమానం త్రివేండ్రం మీదుగా 37,000 అడుగుల ఎత్తున వెళుతున్నప్పుడు హెడ్ క్వార్టర్స్ నుండి ఫైనల్ అప్రూవల్ అందింది. ఇక వెనుతిరిగే ప్రసక్తే లేదు. సరిగ్గా 9.50pm IL-76 మాల్దీవుల హలూలే విమానాశ్రయ సిబ్బందికి సిగ్నల్ పంపారు. విమానాశ్రయ అధికారులు రన్వే లైట్లు 2 సెకన్ల పాటు ఆన్ చేసి ఆఫ్ చేశారు. మీకు మా స్వాగతం అనడానికి ఇది సంకేతం.

IL-76 సిబ్బంది  ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. విమానం దిగడానికి అనుమతి లభించదు ప్యారచూట్ల ద్వారా దిగి పోరాడాలి అనుకున్నారు. విమానం 200 అడుగుల ఎత్తు ఉన్నపుడు రన్వే లైట్లు పూర్తిగా వెలిగాయి. వేర్పాటువాదులు చేసిన అతిపెద్ద తప్పు…  హాలూలే విమానాశ్రయాన్ని అక్రమించుకోక పోవడం. విమానం ల్యాండ్ అయ్యింది…  అంతటా నిశబ్దం…  పైలట్ విమానం లైట్లు ఆఫ్ చేసి ఇంజిన్లు ఆన్ లో ఉంచారు. కార్గో డోర్ తెరిచారు.

సైనికులు రన్వే మీదకు దూకారు. 20 నిముషాల్లో విమానాశ్రయం మొత్తం మన సైనికులు తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. ఇక్కడి నుండి సముద్రంలో 500 మీటర్లు వెళితే అధ్యక్షుని భవనం చేరుకోవచ్చు. సైనికులు సివిల్ బోట్లలో అధ్యక్ష భవనం వైపు వెళ్ళడం ప్రారంభించారు.

కట్ చేస్తే…వేర్పాటువాదులు ఓ పెద్ద పడవలో కొంత మంది మాల్దీవ్ అధికారులను బందీలుగా తీసుకుని శ్రీలంక వైపు పారిపోయారు.. పాపం వారికి కాకలు తీరిన పాకిస్థాన్ నేవీని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఇండియన్ నేవీ గురించి తెలీదు. మరుసటిరోజు ఈ పడవను ఇండియన్ నేవీ యుద్ద నౌకలు INS Godavari, INS Betwaa లు సముద్రం మధ్యలో గుర్తించి చుట్టుముట్టాయి. వేర్పాటువాదులు, బందీలతో సహా సరెండర్ అయ్యారు.

9.50కి హాలూలేలో ల్యాండ్ అయిన భారత సైనికులు మొదట అధ్యక్ష భవనాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మాలే మొత్తం విస్తరించి నగరాన్ని అంచెలంచెలుగా తమ అదుపులోకి తెచ్చుకున్నారు. పొద్దున 3.30 కి అధ్యక్షుడు అబ్దుల్ గయ్యూంను గుర్తించి రక్షించారు. 3.45 కు గయ్యూం రాజీవ్ గాంధీకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.

మాల్దీవులు ఎప్పటికీ భారత్ కు ఋణపడి వుంటుందని అన్నారు. మరుసటిరోజు రోనాల్డ్ రీగన్ ఫోన్ చేసి భారత్ పాత్రను కొనియాడారు..పొరుగుదేశాల్లో శాంతిని నెలకొల్పడంలో భారత్ ముఖ్యపాత్ర పోషించడం ఇది రెండవసారి. లక్ష మంది పాకిస్థాన్ సైనికులను సరెండర్ చేయించి ఈస్ట్ పాకిస్థాన్ లో బంగ్లాదేశ్ స్థాపించి సుస్థిరత సాధించింది. ఇప్పుడు మాల్దీవులు వేర్పాటువాదుల హస్తగతం కాకుండా కాపాడి మాల్దీవుల్లో శాంతి నెలకొల్పారు.

 

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. రామ్మోహన్ February 24, 2024
error: Content is protected !!