ఈ ఘోస్ట్ ఆర్మీ కథేమిటి ??

Sharing is Caring...

ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పెద్దగా ప్రతిఘటన లేకుండా తాలిబాన్లకు లొంగిపోవడంతో అమెరికా దిమ్మెర పోయింది. అలా ఎలా జరిగిందని కూపీ లాగితే అఫ్ఘానీ సైనిక కమాండర్లు దొంగ లెక్కలు రాసి తమను మోసం చేశారని తెలుసుకుని షాక్ తిన్నది.

అసలు సైనికులు లేకుండానే పేరోల్స్ అన్ని బోగస్ పేర్లతో నింపేసి .. ఆ సొమ్మును స్వాహా చేశారని కనుగొన్నది. అమెరికా ఉనికిలో లేని సిబ్బందికి (ఘోస్ట్ ఆర్మీ) జీతాల కోసం సంవత్సరానికి $ 300 మిలియన్లకు పైగా ఖర్చుచేసింది. దీన్నిబట్టి ఎంత సొమ్ము అవినీతి అధికారులు మింగేసారో ఊహించుకోవచ్చు. 

యుఎస్ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. “ఇరవై సంవత్సరాల ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు” అనే శీర్షికతో రూపొందించిన 140 పేజీల నివేదిక లో ఆఫ్ఘన్ సైనిక అధికారుల లీలల గురించి పేర్కొన్నది. ఆఫ్ఘన్ సైన్యం లోని  ఉన్నతాధికారులు వాస్తవంగా లేని బలాన్ని చూపించి నిధులను మింగేశారని ఆ నివేదిక చెబుతోంది. 

వాస్తవానికి 2016-17 లోనే సైనికాధికారుల అవినీతిని అమెరికా గమనించింది. అపుడు కూడా ఆడిటింగ్ జరిగింది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కంబైన్డ్ సెక్యూరిటీ ట్రాన్సిషన్ కమాండ్-ఆఫ్ఘనిస్తాన్ (CSTC-A) ద్వారా ఆఫ్ఘన్ దళాల శిక్షణ .. సామగ్రిని పర్యవేక్షించింది. 

ఆఫ్ఘన్ జాతీయ సైన్యం …  ఆఫ్ఘన్ జాతీయ పోలీసుల సంఖ్యను ధృవీకరించడానికి ప్రయత్నించగా ఉన్నతాధికారులు సిబ్బందిని పూర్తిగా చూపించలేకపోయారు. వాస్తవాలకు పే రోల్ లెక్కలకు ఎక్కడ పొంతన కుదరలేదు. ఇవన్నీ గమనించి అమెరికా దశల వారీగా సైన్యాన్ని ఉపసంహరించుకుంది.

ఫిబ్రవరి 2020 లో అమెరికా సైనిక దళాల పూర్తి నిష్క్రమణ కోసం యుఎస్ షెడ్యూల్‌ను రూపొందించింది. 2021 వేసవిలో ఆఫ్ఘనిస్తాన్ నుండి తన బలగాలను ఉపసంహరించుకోవడం ప్రారంభించగానే …  ప్రతిఘటించాల్సిన ఆఫ్ఘన్ భద్రతా దళాలు సైలెంట్ అయిపోయాయి. కొందరు ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయారు. కొందరు తాలిబన్లకు లొంగిపోయారు. 

యుఎస్ రక్షణ శాఖ నివేదిక ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌లో మొత్తం సైనిక వ్యయం (అక్టోబర్ 2001 నుండి సెప్టెంబర్ 2019 వరకు) $ 778 బిలియన్లకు పైగా అయింది. నిధులు ఇచ్చిన అమెరికా సరైన పర్యవేక్షణ చేయకపోవడం ..కొంతమంది ఆఫ్ఘన్ అధికారుల అవినీతి.. మోసం, దోపిడీ.. బంధుప్రీతి కారణంగా ఎంతో సొమ్ము వృధా అయింది. ఇందులో ఆఫ్ఘన్ ప్రభుత్వం వైఫల్యం కూడా ఉంది.

————-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!