This period is favorable for pilgrimages
పుష్య బహుళ పాడ్యమి జనవరి 14 వ తేదీ మంగళవారం (ఈ రోజే) సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అయింది. సంక్రాంతి వేళ మొదలైన ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఆరు నెలలపాటు కొనసాగుతుంది.
సూర్యుడి గమనం దక్షిణం నుంచి ఉత్తరానికి మారే కాలమే ఉత్తరాయణం.ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు. దక్షిణాయనం కూడా పుణ్యప్రదమే. అయితే ఉత్తరాయణం విశిష్టత ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెప్పిన మాట. మనిషిని ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది అనువైన కాలం.
పుణ్యస్నానాలకు ఈ మాఘమాసం ప్రముఖమైనది.ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి ప్రారంభించి నదీ స్నానాలు చేస్తారు. హిందువులు వీటిని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. మాఘ మాసంలో పుణ్యనదిలో స్నానం చేస్తే విశేష ఫలితం దక్కుతుందని నమ్ముతారు. నదీ స్నానం చేయడానికి కుదరని హిందువులు తమ ఇంట్లోనే భగవంతుడి నామాన్ని స్మరిస్తూ స్నానం చేసినా తీర్థ స్నాన ఫలితం దక్కుతుందని పెద్దలు అంటారు.
పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఉత్తరాయణం ముఖ్యమైందని ఆగమాలు చెబుతున్నాయి. ఆలయాల్లో దేవతామూర్తులను ప్రతిష్ఠ చేయటానికి ఈ సమయం యోగ్యమైంది.యంత్రాల ద్వారా దేవతాశక్తిని ఆలయంలో నిక్షిప్తం చేయటానికి ఈ కాలంలో జరిగే గ్రహ సంచారం ఎంతో అనుకూలంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఉత్తరాయణం రాకతో వాతావరణంలో మార్పులు మొదలవుతాయి. చలి మెల్లగా మెల్లగా తగ్గుముఖం పట్టి ,వెచ్చదనం పెరుగుతుంది. క్రమంగా సమశీతోష్ణస్థితి నెలకొంటుంది.ఇన్ని ప్రత్యేకతలు ఉన్నఉత్తరాయణ పుణ్యకాలం సమస్త మానవాళికి పుణ్యప్రదమని హిందువులు భావిస్తారు.
ఈ ఉత్తరాయణంలో సూర్యుడి ని ఉపాసన చేయాలని మహర్షులు చెప్పారు. ఈ కాలంలో సూర్యుణ్ని నారాయణుడిగా, శోభను, శక్తిని ప్రసాదించే ఆయన మహిమను ‘లక్ష్మి’గా భావించి ఆరాధించాలని సూచించారు. ఉత్తరాయణంలో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.
ఈ కాలంలోవాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.పుణ్యక్షేత్రాలకు వెళ్లాలన్నా..తీర్థయాత్రలు చేయాలన్నా కాలం అనుకూలంగా ఉంటుంది.ఉత్తరాయణ కాలంలో స్వర్గద్వారాలు తెరచి ఉంటాయి.పితృ కార్యాలకూ ఈ కాలం విశేషమైనది.
ఉత్తరాయణంలో మరణించిన వారికి పరమపదం కలుగుతుందని హిందువులు నమ్ముతారు.అలాగే ఉత్తరాయణం దేవతలకూ, పితృ దేవతలకూ సంతుష్టిని చేకూర్చే కార్యాలు చేపట్టవచ్చు. ఈ ఉత్తరాయణం జూలై 15 వరకు ఉంటుంది.