The Rameshwaram Cafe…………..
ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయంటే ఎంతదూరమైనా వెతుక్కుంటూ ఆ హోటల్ కు వెళతారు. తమకు నచ్చిన ఫుడ్ ఐటెం తిని వస్తారు ముఖ్యం గా దక్షిణాది వారు. అలా వెతుక్కుంటూ వెళ్లే హోటల్స్ లో రామేశ్వరం కేఫ్ ఒకటి.
ఈ మధ్యకాలంలో బెంగళూరు లోని రామేశ్వరం కేఫ్ బాగా పాపులర్ అయింది. రోడ్డు పక్కన ఉండే ఈ చిన్న హోటల్. ఎప్పుడు చూసినా జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది.ఇంత చిన్నహోటల్ ఆదాయం నెలకి నాలుగున్నర కోట్లు అంటే నమ్మబుద్ధి కాదు కానీ అది నిజమే.
రద్దీ వలన కొన్నిసార్లు క్యూలో గంటలకొద్దీ నిల్చోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కేవలం ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరీ, మైసూర్ బోండా వంటివే ఇక్కడ దొరుకుతాయి. అయితే వాటి టేస్ట్ సూపర్ .. అందుకే జనాలు ఎక్కువగా ఇక్కడికొస్తుంటారు. రోజుకి ఏడు వేల మందికిపైగా ఇక్కడ కొచ్చి టిఫిన్ చేస్తుంటారు.
శుచి .. రుచి రామేశ్వరం కేఫ్ ప్రత్యేకత. 2021లో ఈ హోటల్‌ను దివ్య, రాఘవేంద్రరావు దంపతులు ప్రారంభించారు.. వాళ్లకి అబ్దుల్ కలాం దైవంతో సమానం. అందుకే హోటల్‌కు కలాం పుట్టి పెరిగిన ‘రామేశ్వరం’ పేరును ఎంచుకుని ‘రామేశ్వరం కేఫ్’ గా నామకరణం చేశారు. రుచిలోనూ, నాణ్యతలోనూ రాజీ పడకూడదని ఫ్రిజ్ కూడా వాడరు.
ఇడ్లీ- దోశ పిండి- చట్నీ లాంటి వాటిని ప్రతి అరగంటకో సారి రుబ్బే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ హోటల్‌లో ప్లాస్టిక్ వాడకం కనిపించదు. స్టీల్ ప్లేట్స్ వాడతారు. పండుగ, ప్రత్యేక సందర్భాల్లో సౌత్ ఇండియా స్పెషల్ ప్రసాదాలను వడ్డిస్తారు.
ఈ ప్రసాదాల కోసం జనాలు పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. ప్రతిరోజూ జాతీయగీతం ఆలపించాకే సిబ్బంది వంటగదిలో అడుగుపెడతారు. రుచీ, శుచీ పాటిస్తామని ప్రమాణం చేశాకే పనులు మొదలుపెడతారు. ఇలాంటి దృశ్యాలు వేరే చోట మనకు కనిపించవు.
దివ్య రాఘవేంద్రరావు ల గురించి చెప్పుకోవాలంటే …. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివ్య సీఏ పూర్తి చేసి ఆడిటర్‌గా స్థిరపడింది. కొన్నాళ్లకు అహ్మదాబాద్ ఐఐఎంలో పీజీ చేయడానికి వెళ్లింది. అక్కడ ఒక ప్రొఫెసర్… మెక్‌డోనాల్డ్స్, స్టార్‌బక్స్, కేఎఫ్‌సీ విజయగాథలు చెబుతూ ‘ఇండియన్స్ వేస్ట్.. ఇలాంటి ఇంటర్నేషనల్ ఫుడ్‌చైన్‌ను ఒక్కదాన్నీ సృష్టించలేకపోయారు’ అన్నాడు.
ఆ మాటలు దివ్యను హర్ట్ చేశాయి. ఆ నిమిషంలోనే దక్షిణ భారత వంటకాలతో ఓ బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగింది. సరిగ్గా అదే సమయంలో ఇతర స్నేహితుల ద్వారా రాఘవ పరిచయం అయ్యాడు నిరుపేద కుటుంబానికి చెందిన రాఘవకు ఫుడ్ బిజినెస్ అంటే ఆసక్తి. మెకానికల్ ఇంజినీరింగ్ చదివినా అనుభవం కోసమని హోటళ్లలో కప్పులు కడగడం నుంచి కూరగాయలు కోయడం వరకూ చిన్నాచితకా పనులు చేశాడు.
అక్కడే కౌంటర్ బాయ్‌గా, క్యాషియర్‌గా, మేనేజర్‌గానూ కొన్నాళ్లు పనిచేశాడు. కొంతకాలం తర్వాత స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన ఫుడ్ కోర్ట్ నడిపి నష్టపోయాడు. ఈక్రమంలోనే దివ్య ,రాఘవలు తమ అభిప్రాయాలను ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. హోటల్ వ్యాపారం ప్రారంభించారు. అది సక్సెస్ కావడంతో వ్యాపారంలోనే కాదు జీవితంలోను భాగస్వాములయ్యారు. అదండీ’ రామేశ్వరం కేఫ్’కథ.