తీన్మార్ మల్లన్న దారెటు ?

Sharing is Caring...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయపార్టీలకు దడ పుట్టించిన తీన్మార్ మల్లన్న కొన్ని పార్టీలకు ఆశాకిరణం లా మారారు. ప్రధాన పార్టీలు తమతో చేతులు కలపాలని మల్లన్నను ఆహ్వానిస్తున్నాయి. అయితే మల్లన్న ఏ పార్టీ కి హామీ ఇవ్వలేదు. అలా వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన “తీన్మార్ మల్లన్న టీమ్” పేరిట సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్ కు రాష్ట్ర,జిల్లా,,మండల,గ్రామ స్థాయిలో కమిటీలు వేస్తున్నారు. ప్రధానంగా ఈ టీమ్ అధికార పార్టీ వైఫల్యాలపై పోరాడుతుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచారం చేస్తుంది. జనంలోకి వెళ్లి ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పిస్తుంది. ఇప్పుడైతే మల్లన్న ఏమి చెప్పడం లేదు కానీ ఇదే టీమ్ భవిష్యత్ లో రాజకీయ పార్టీగా మారే అవకాశాలు లేకపోలేదు.
అలాగే మల్లన్న మరో పెద్ద టాస్క్ చేపట్టారు. తెలంగాణా వ్యాప్తంగా 6 వేల కిలోమీటర్ల పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కూడా ఆయన మూడు జిల్లాల్లో ఒక పాదయాత్ర చేశారు. ఓటర్లను నేరుగా కలసి వారి సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పదునైన విమర్శలు గుప్పించారు. నాటి అనుభవం మల్లన్నకు సుదీర్ఘ పాదయాత్రలో ఉపయోగపడుతుంది. తొలుత నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తాను లేదా తమ అభ్యర్థి బరిలోకి దిగుతామన్న మల్లన్న ఆ ఆలోచన విరమించుకున్నారు. అయితే సాగర్ ఉపఎన్నికలో ప్రచారం మాత్రం చేస్తామంటున్నారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా అధికార పార్టీ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు.

ఉపఎన్నికలో పోటీ చేస్తే ఒక పొలిటికల్ పార్టీ 100 కోట్లు ఖర్చు చేస్తామంటూ మల్లన్నకు మంచి ఆఫర్ ఇచ్చిందట. అయితే తాను ఆ ఆఫర్ ను తిరస్కరించినట్టు చెబుతున్నారు. 101 కోట్లు ఇస్తాం మీరే మా టీమ్ లో మీ పార్టీని విలీనం చేయండి అంటూ రివర్స్ ఆఫర్ ఇచ్చామని మల్లన్న అంటున్నారు. ఆ ఆఫర్ ఇచ్చిన పార్టీ మనిషి నుంచి సమాధానం లేదట. ఇక షర్మిల పార్టీ లో చేరుతున్నట్టు ప్రచారంలో ఉన్న వార్తలను మల్లన్న తోసిపుచ్చారు. ఏ పార్టీలో చేరేది లేదని చెబుతున్నారు. 
జర్నలిస్ట్ అయిన మల్లన్న 2015 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి 13 వేల కు పైగా ఓట్లు సంపాదించారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత మొన్నటి ఎమ్మెల్సీ బరిలోకి దిగి 12 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.కానీ లక్ష ఓట్లు సంపాదించి రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణా ఉద్యమనేత కోదండరాం ను వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోయారు. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తనదైన శైలిలో మల్లన్న ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు. ఈ శైలి బాగా జనాలకు కనెక్ట్ అయింది. కొద్దీ రోజుల్లోనే మల్లన్న పాపులారిటీ పెరిగిపోయింది. ప్రశ్నించేవాడు ఒకడు వచ్చాడని యువతరం మల్లన్నకు మద్దతు పలుకుతోంది. 

—————K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!