శివగామి ఏం చేస్తున్నారో ?

Sharing is Caring...

From glamorous roles to powerful roles …………………..

గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా పవర్ ఫుల్ పాత్రలకి పెట్టింది పేరు నటి రమ్యకృష్ణ.కెరీర్ ప్రారంభ దశలో ఆమె ఎన్నో ఫెయిల్యూర్స్ చవి చూసారు. ఒక దశలో ఆమెను ఐరన్ లెగ్ అని కూడా అన్నారు. సినిమాల్లో బుక్ చేసి కూడా కొందరు నిర్మాతలు రిజెక్ట్ చేశారు. ప్రారంభ దశ సినిమాలేవీ ఆమె కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడలేదు.

ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్ డైరెక్ట్ చేసిన సూత్రధారులు (1989) చిత్రం లో సీతాలు పాత్రలో నటించి ఆమె మంచి పేరు సంపాదించారు. అందులో ‘జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా’ పాట రమ్య కృష్ణకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. విశ్వనాధ్ ఆమెను ఒక కొత్త యాంగిల్ లో చూపారు. రమ్య లో కూడా ఒక నటి ఉందని పరిశ్రమ గుర్తించింది. అయితే వెంటనే సరైన అవకాశాలు రాలేదు.

ఆ సమయంలోనే డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు తీసిన అల్లుడుగారు (1992 ) చిత్రం ఆమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లో  ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ విజయవంతమైనవే..  రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి.

ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇకవెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మొదట్లో తనని రిజెక్ట్ చేసినవాళ్లే ఆ తర్వాత రమ్యకృష్ణ కాల్షిట్ల కోసం క్యూ కట్టారు. ఇదంతా తనకు రాఘవేంద్రరావు వల్లే అని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని  సౌందర్యలహరి ప్రోగ్రామ్లో  రమ్య కృష్ణ చెప్పుకొచ్చారు.

1992 నుంచి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది.మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

కేవలం హీరోయిన్ గానే కాకుండా నెగటివ్ షేడ్ క్యారెక్టర్ కూడా అదరగొట్టింది. రజనీకాంత్, సౌందర్య జంటగా నటించిన ‘నరసింహ’ సినిమాలో నీలాంబరి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమా రమ్యకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

చాలాకాలం పాటు కథానాయికగా నటించిన రమ్యకృష్ణ యంగ్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం  అత్తగా, తల్లిగా నటిస్తోంది. దాదాపు 30 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతోంది  .. ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి రమ్యకృష్ణ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

బాహుబలి మూవీలో శివగామి రోల్ అయితే ఆమెను పాన్-ఇండియా స్టార్‌గా మార్చేసింది. ఆ రోల్ తర్వాత క్రేజ్ చాలా పెరిగిపోయింది. నటనతో ప్రయోగాలు చేయడానికి ఆమె ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అందుకే కెరీర్ గ్రాఫ్ ఎప్పుడూ అప్ ట్రెండ్‌లోనే ఉంటుంది.తన భర్త కృష్ణ వంశీ తీసిన ‘రంగ మార్తాండ’ లో మంచి పాత్రలో నటించారు. అయితే అంత పేరు రాలేదు.

రమ్య కృష్ణ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం పెర్ఫార్మన్స్ కి అవకాశం ఉన్న విభిన్నమైన క్యారెక్టర్ల ను  ఆమె ఎంచుకుంటున్నారు. స్వతహాగా మంచి నృత్యకారిణి అయిన రమ్యకృష్ణ.. న్యూయార్క్, డల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ లోనూ రమ్య కృష్ణ  సత్తా చూపించింది.  తంగం, రాజకుమారి, వంశం, శక్తి, కలసం, వెబ్ సిరీస్ ‘క్వీన్‌’లలో నటించారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా ‘క్వీన్’ తీశారు. దీనికి మంచి ఆదరణ లభించింది. వంశం’ అనే సీరియల్‌ నాలుగు సంవత్సరాల పాటు నడిచి 1,000 ఎపిసొడ్స్ కంప్లీట్ చేసుకుంది.

ఇప్పటికీ రమ్యకృష్ణ  చాలా బిజీగా ఉంది. కొన్నిప్రాజెక్ట్‌లు ఆమె చేతిలో ఉన్నాయి.మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి ‘వృషభ’ అనే మూవీలో నటిస్తోంది. అలాగే, తమిళంలో ‘బబ్లి గమ్’ అనే చిత్రంలో ఒక ముఖ్య పాత్ర చేస్తోంది. ఈ రెండూ షూటింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. 
  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!