మీనా ఏం చేస్తున్నారో ?

Sharing is Caring...

Second innings ……………….

‘ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు…. వేసే పూల బాణం పూసే గాలి గంధం’ …ఈ పాట వినగానే నటి మీనా గుర్తుకొస్తారు.  1992లో తెలుగు ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్న’చంటి ‘సినిమా ఎప్పటికి మరచి పోలేని సినిమా..

ఆ సినిమాలో నలుగురు క్రూరులైన అన్నలు ఉన్న చెల్లిగా..అమాయకుడైన చంటిని ప్రేమించిన అమ్మాయిగా ప్రేక్షకుల హృదయాలను కదిలించి,ఆదరణ పొందిన యువ కథానాయిక మీనా .. తరువాత ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఉర్రూత లూగించింది.

దాదాపు అందరు పెద్ద హీరోలతో విజయవంతమైన సినిమాల్లో నటించిన మీనా .. ఆ తరం ప్రేక్షకులనుండి ఈ తరం ప్రేక్షకుల వరకూ అందరికీ పరిచయస్తురాలు ..అన్నితరహా పాత్రలు చేసిన మీనా అటు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి సౌత్ ఇండియా నటిగా పేరు గాంచారు.

మీనా 1975 సెప్టెంబర్ 16న మద్రాసులో పుట్టారు. తండ్రి పేరు దొరై రాజ్ ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. తల్లి పేరు రాజ మల్లిక ఈమె కూడా సినిమాల్లో నటించారు. 

తల్లి రాజ మల్లికకు  సినిమాల్లో పరిచయం ఉండటంతో ముద్దుగా బొద్దుగా ఉన్న మీనా చిన్న తనం నుండే సినిమాల్లో నటించేది.

బాల నటిగా దాదాపు 45 సినిమాల్లో నటించింది.మీనా చెన్నైలోని విద్యోదయ పాఠశాల నుండి ఎనిమిదవ తరగతి పూర్తి చేసింది. ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలి దశలోనే మెట్రిక్యులేషన్‌కు ముందే చదువును ఆపేయాల్సి వచ్చింది.

అయితే మీనా ప్రైవేట్ గా చదివి 10వ తరగతి పాసైంది. తరువాత 2006లో ఓపెన్ యూనివర్శిటీ ద్వారా మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. మీనాకు చిన్నతనం నుండే భరత నాట్యంలో అభినివేశం ఉంది.

ఆమె బాలనటిగా తొలుత శివాజీ గణేషన్‌ నటించిన ‘నేంజంగల్‌’ అనే తమిళ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు.తరువాత రజనీ కాంత్‌, కమల్‌ హాసన్ ల సినిమాల్లో నటించారు.పెద్దయ్యాక వారి సరసన కథానాయికగా  కూడా నటించారు.

తెలుగులో మీనా చిరంజీవితో ‘ముఠా మేస్త్రీ’ , ‘స్నేహం కొసం’,’శ్రీ మంజునాధ’,బాలయ్యతో ‘ముద్దుల మొగుడు’, ‘బొబ్బిలి సింహం’,  నాగర్జునతో ‘ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం’,’అల్లరి అల్లుడు’, మోహన్ బాబుతో కలసి ‘అల్లరి మొగుడు’, రాజశేఖర్‌ తో ‘అంగరక్షకుడు’, ‘మొరటోడు నా మొగుడు’, వెంకటేష్‌ తో ‘అబ్బాయి గారు’, ‘సుందరకాండ’, ‘చంటి’, ‘దృశ్యం‘ వంటి సినిమాలు చేశారు. దాదాపుగా అన్ని హిట్ సినిమాలే.  

అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్‌ లో  నటించిన ‘సీతారామయ్య గారి మనవరాలు ‘సినిమా మీనాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా 1991 లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్‌ పెనోరమా విభాగంలో ప్రదర్శితమైంది. ఈ సినిమాలోని నటనకు గాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డు అందుకున్నారు.చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా నటిగా మీనాకు తెలుగులో చాలా మంచి పేరు గుర్తింపు ఉన్నాయి.

తెలుగు సినిమాల్లో రోజా.. మీనాలకు పోటీ ఉండేది. గ్లామర్‌ పాత్రలు చేద్దామని మీనా కు ఉన్నప్పటికీ ఆమెకు పెద్దగా అలాంటి పాత్రలు  రాలేదు.. తమిళ్‌ నుండి తెలుగులోకి అనువాద చిత్రంగా వచ్చిన ‘ముత్తు’ సినిమాలో రజనీ కాంత్‌తో కలిసి చేసిన ‘థిల్లానా థిల్లానా నా కసి కళ్ల కూనా ‘ అనే పాట తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మరచి పోలేని పాటగా మిగిలి పోయింది..ఈ సినిమా జపాన్‌ లో విడుదలై అక్కడ ఘనవిజయాన్ని సాధించింది. దాంతో రజనీకాంత్‌ తో పాటు మీనాకు కూడా అక్కడ అభిమానులు ఉన్నారు.

1991 నుండి 2000 వరకు మీనా  దక్షిణాది సినిమాల్లోని దాదాపు అందరి అగ్ర కథానాయకులతో కలిసి నటించింది.పెళ్ళికి ముందే పరిచయమైన విద్యాసాగర్‌ అనే సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ ను  2009 లో పెళ్ళి చేసుకుంది. వీరికి నైనికా అనే కుమార్తె ఉంది.

ఆ తరువాత కొంత కాలం సినిమాలు చేయడం మానేసారు..కొంత విరామం తరువాత మీనా మళయాళం లో మోహన్ లాల్‌ సరసన ‘దృశ్యం’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించి అదే పేరుతో తెలుగులో వెంకటేష్‌ కథానాయకుడిగా రూపొందింది. మళయాలం లో చేసిన పాత్రనే తెలుగులో కూడా మీనానే  చేసింది.

కొంత గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మీనా కొన్నిసినిమాలు చేస్తున్న తరుణంలోనే  2022 లో భర్త విద్యాసాగర్‌ అనారోగ్యంతో మరణించారు. అదొక షాక్ ఆమెకు ..కొంచెం కోలుకోగానే  మీనా మళ్ళీ పెళ్ళి చేసుకుందనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారాన్ని మీనా ఖండించారు. ఆ పుకార్లు అవాస్తవమని, తాను మళ్ళీ పెళ్లి చేసుకోవడం లేదని మీనా స్పష్టం చేశారు.

నటి మీనా ప్రస్తుతం రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చారని సమాచారం. మీనా రాజకీయాల్లోకి ప్రవేశించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.. ఇటీవల ఉపరాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీ లోకి చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికారికంగా అయితే మీనా ప్రకటించలేదు. ప్రచారాన్ని కూడా ఖండించిన దాఖలాలు లేవు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!