లక్షల కోట్లు ఖర్చు పెట్టి సాధించిందేమిటి ?

Sharing is Caring...

Govardhan Gande ………………………………………..

“ఉగ్ర”భూతాల సృష్టికర్త అమెరికా అనే సంగతి అంతర్జాతీయ మీడియాకు తెలుసు. ప్రపంచ దేశాల నాయకత్వాలకూ తెలుసు. కానీ ఎవరూ ప్రశ్నించరు. ఎవరికీ అంత ధైర్యం లేదు. అంత సాహసం చేయలేరు. ఎందుకంటే.. ఎవరి అవసరాలు వారివి. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవరి పరిమితులు వారివి. ఎవరి భయాలు వారివి.అన్నిటి కంటే “పెద్దన్న” (అమెరికా) అంటే అమితమైన  భయం. ఎలాంటి ఒత్తిడులు పెడుతుందో, ఎలాంటి ఆంక్షలు విధిస్తుందో, దిగుమతులను కట్టడి చేస్తుందో, అంతర్యుద్దాన్ని సృష్టిస్తోందో, అనే భయాలు, ఒత్తిడులు మధ్య బడుగు, పేద,వర్ధమాన దేశాల నాయకత్వాలు నోరు మెదపడం లేదు.

ఇక మీడియా సంగతికి వస్తే.. మెజారిటీ మీడియా సంస్థలు అమెరికా, యూరోప్ దేశాల ఆర్థిక,విదేశీ విధానాలను శాసించే బహుళ జాతి కంపెనీ (Multi National Company) ల గుప్పిట్లో బందీలై పోయాయి. అందుకే ఈ నిజం ప్రపంచానికి బోధపడదు. దీనంతటికీ అగ్ర దేశాల (అమెరికా,యూరోప్) ప్రపంచాధిపత్య దాహం కారణమని కొందరు బుద్ధిజీవులు చెప్పినా విశ్వసించరు.

వందల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వనరులను స్వాధీనం చేసుకునేందుకు,ఆక్రమించేందుకు ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎన్ని కోట్ల మంది అమాయకులు అన్యాయంగా, అర్ధాంతరంగా మృత్యువాత పడ్డారో ప్రపంచ చరిత్ర చెబుతున్నది. కానీ దీని వెనక ఉన్నది “అగ్ర” దేశాల ఆధిపత్య దాహమే. రెండు ప్రపంచ యుద్ధాలకు కారణాలు కూడా ఈ ఆధిపత్యమే అని అందరికీ తెలుసు.

తరువాత వనరుల ఆక్రమణకు అమెరికా తన వ్యూహాలను మార్చివేసింది. సులువైన గూఢచర్య మార్గాన్ని ఎంచుకున్నది. తాను ఆక్రమించదలచుకున్న దేశంలోకి తన నిఘావ్యవస్థ లోని సీఐఏ తోడేళ్లను పంపి రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టించడం, తద్వారా ఆ దేశ నాయకత్వాన్ని లొంగదీసుకోవడం అలా ఆ దేశ వనరుల దోపిడీని మొదలుపెట్టింది.

అలా లొంగి పోని దేశాల్లో ఉగ్రవాదాన్ని సృష్టించడం మొదలెట్టింది. అలాంటి క్రీడనే అఫ్ఘనిస్తాన్ లో ఆడి చేతులు కాల్చుకున్నది. సరిగ్గా 20 ఏళ్ల (9/11) క్రితం ఆ ఉగ్రమూకే భస్మాసుర హస్తంలా ఆల్ ఖాయిదా రూపంలో ప్రపంచ వాణిజ్య కేంద్రం,అమెరికా రక్షణ శాఖ కేంద్రం Pentagon పై దాడి చేశాయి. దీంతో కక్ష గట్టిన అమెరికా అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించింది.20 ఏళ్ళ పాటు ఆ దేశం పై లక్ష వైమానిక దాడులు చేసింది.50 వేల మంది అమాయక ఆఫ్ఘానీ పౌరులను అన్యాయంగా చంపి వేసింది.ఇందుకు గాను కోటీ 70 లక్షల కోట్లు ఖర్చు చేసింది.కానీ ఏమీ సాధించలేకపోయింది.

తట్టా, బుట్టా సర్దుకొని,తోక ముడుచుకొని అఫ్ఘనిస్తాన్ ను ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఫలితంగా అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఇది ఎన్ని దేశాలను, ఎన్ని రకాలుగా చుట్టుకుంటుందో మరి.
(WTC పై దాడి కి 20 ఏళ్ళు నిండాయి)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!