శశికళ శపథం నెరేవేరేనా ? మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది. 2017 లో శశికళ కర్ణాటక జైలుకు వెళ్లే ముందు తన నెచ్చెలి జయ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించింది. ఆ సందర్భంగానే మూడు మార్లు చేతితో సమాధిపై చరిచి శపథం పూనింది. ఆ సమయంలో శశికళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఆమె ముఖ కవళికలు చెప్పకనే చెప్పాయి . అందరూ టీవీల్లో కూడా చూసారు. మూడు మార్లు చేతితో సమాధిపై ఆలా చరిస్తే వారి ఆచారం ప్రకారం అది శపథం పూనినట్టు అని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆమె శపథం ఎవరిపై ? ఎందుకు అనేది ఎవరికి తెలీదు. శశికళ కూడా బయటకు చెప్పలేదు.
అయితే అప్పటి తాత్కాలిక సీఎం పన్నీర్ సెల్వం మరికొందరు బీజేపీ నేతలపై ఆమె గుర్రుగా ఉన్నారని … కుట్ర చేసి జైలుకు పంపారని పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకున్నారు. చిన్నమ్మ జైలుకెళ్లాక కథ మొత్తం మారిపోయింది. శశికళ కల చెదిరిపోయింది. అన్నా డీఎంకే పార్టీ ఏకంగా శశినే బహిష్కరించింది. దీంతో చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ “అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం “అనే పార్టీ పెట్టారు. చీలిపోయిన పన్నీర్ పళని వర్గాలను కలిపి ప్రభుత్వం కూలిపోకుండా బీజేపీ తెర వెనుక నుంచి చక్రం తిప్పింది. పాపం జైలు నుంచి శశికళ కబురు పంపినా ఆమె పలకరించినవాళ్లు లేరు. దినకరన్ కూడా మొదట్లో ఒకటి రెండు సార్లు వెళ్లి తర్వాత దూరంగా ఉండిపోయాడు. గడచిన నాలుగేళ్ళ కాలంలో చిన్నమ్మ జైలుకే పరిమితమైంది . బెయిల్ కూడా రాలేదు. ఈ లోగా జరగాల్సినవన్ని జరిగిపోయాయి.
జైలునుంచి చక్రం తిప్పుదామని శశికళ కన్న కలలు కరిగిపోయాయి.జయ ఆస్తులు మిగులుతాయి అనుకుంటే అవి దీపకు వెళ్లాయి . ఇటు పార్టీ పోయింది. మరో పక్క కట్టుకున్న భర్త పోయాడు . మేనల్లుడు మాట వినడం లేదు.పాపం చిన్నమ్మకు షాకులపై షాకులు తగిలాయి. ఇంకొకరైతే ఇన్ని షాకులకు గుండె ఆగి పోయేవారు. కొంచెం గుండె దిటవు చేసుకుని జైలు నుంచి విడుదల అయ్యాక వచ్చే మేలో జరగనున్న ఎన్నికల్లో చక్రం తిప్పుదామని ప్లాన్ చేసుకుంటే … మళ్ళీ మరో మెగా షాక్. శశికళ కు చెందిన 1600 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది. ఇంకా చెన్నై శివార్లలో ఉన్న భూములు , మరికొన్ని ఆస్తులపై కూడా ఐటీ శాఖ దృష్టి పెట్టింది. జయ ఇంటి ఎదురుగా ఉన్న స్థలంలో శశి బంధువులు నిర్మిస్తున్న భవన నిర్మాణం పై కూడా అధికారులు కన్నేశారు. ఇది 300 కోట్ల విలువైన స్థలం . ఇది శశి బినామీ ఆస్తిగా భావిస్తున్నారు.
ప్రస్తుతం పరప్పన అగ్రహారం జైలులో ఉన్న శశి విడుదలైన వెంటనే ఈ భవనం నుంచే రాజకీయాలు మొదలెట్టాలని లెక్కలు వేసుకుంది. అయితే ఇపుడు ఆస్తులు సీజ్ చేసి , జప్తు చేసాక ఏం చేయాలా అని జైల్లో కూర్చొని మథనపడుతోంది. మొత్తం మీద జైలులో కూర్చొని వేసుకున్న వ్యూహాలు అన్ని ఐటీ అటాచ్మెంట్ తో అటకెక్కాయి . చేతిలో డబ్బులు లేనిదే చిన్నమ్మను లెక్క చేసేదెవరు ? రాజకీయాలు ఎలానడుపుతుంది? అన్ని జవాబుల్లేని ప్రశ్నలే. ఆ మధ్య ఆగస్టు 14 న చిన్నమ్మ రిలీజ్ అవుతున్నదని పుకార్లు వచ్చాయి. కానీ కాలేదు. ఆర్టీఐ ద్వారా అందిన సమాచారం ప్రకారం 2017 ఫిబ్రవరి 15 న శశికళ జైలుకెళ్లారు. కోర్టు విధించిన జరిమానా కడితే 2021 జనవరి 27 న విడుదల అవుతారు. జరిమానా చెల్లించకపోతే ఫిబ్రవరి 27 న విడుదల అవుతారని జైలు అధికారులు సమాచారం ఇచ్చారు.ఈ నాలుగేళ్లలో సెలవులు, మంచి ప్రవర్తన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని శిక్ష లో 129 రోజుల మినహాయింపు వచ్చింది.
————- KNM