‘A’ సర్టిఫికెట్ సినిమాల్లో కావాలని నటిస్తారా?

Sharing is Caring...

Sai Vamshi ……………………..

తమిళ నటి విచిత్ర…25 కి పైగా చిత్రాలలో నటించారు ..ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.  
“నా జీవితంలో ఓ పెద్ద అనుభవం ఉంది. నేను సినిమాల్లో నటిస్తూనే చదువుకున్నాను. 1994-95లో బీఏ సైకాలజీ చేశాను. ఫస్టియర్ పూర్తి చేసి మరో మూడు రోజుల్లో సెకండియర్ పరీక్షలు జరగబోతున్నాయి. ఆ సమయంలో ఓ మలయాళం సినిమా ఆఫర్ వచ్చింది.

నేను మలయాళం సినిమాలు చేయను. మలయాళం మీద నాకు పెద్ద ఆసక్తి లేదు. కొన్ని గెస్ట్ అప్పీరియెన్స్ పాత్రలు మాత్రం చేశాను.ఒక మలయాళం సినిమా ఆఫర్ వచ్చింది. మలయాళ సినిమాలంటే నాకు భయం. ఎందుకంటే, గ్లామర్ నటులతో మలయాళ సినిమా వ్యవహారాలు వేరేలా ఉంటాయి. ఆ టైంలో షకీలా సినిమాలు మలయాళంలో చాలా పాపులర్ అవుతున్నాయి.

అందుకే నాకు చాలా భయం. అందుకని కథ చెప్పమని అడిగాను. ఎవరు డైరెక్టర్, ఎవరు ప్రొడ్యూసర్ అని అడిగాను.అప్పుడు ఆ డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేశాడు. ‘మమ్ముట్టి సార్‌ని పెట్టి సినిమాలు తీశాను. నేను మిమ్మల్ని తప్పుగా చూపిస్తానా? నాకు డిగ్నిటీ, డీసెన్సీ లేదా’ అని అన్నాడు. కథ ఏంటని అడిగినప్పుడు, ‘మీరు మెయిన్ హీరోయిన్. సినిమాలో మరో జంట ఉంటుంది.

వాళ్లు లవ్ చేసుకుంటారు. వాళ్లకే పాటలు, గ్లామర్ సీన్లు ఉంటాయి. మీకేమీ ఉండవు’ అన్నారు. మరి ఈ పాత్రకు నేనెందుకు అని అడిగాను. ‘ఇది గ్లామర్‌గా ఉండే టీచర్ పాత్ర. ఈ పాత్రకు మీరు సూట్ అవుతారు. సినిమాలో చివరిదాకా ఉంటారు’ అన్నాడు.

‘సినిమాలో ఎలాంటి రివీలింగ్ సీన్స్ నేను చేయను. జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పాను. అలాగే నాకు పరీక్షలున్నాయని చెప్పాను. ‘అయ్యో! ఇంత మంచి ఆఫర్ మిస్ చేసుకోకండి. మీ జీవితంలో ఇదొక పెద్ద విషయం. ఇది వదులుకుంటే మీరు చాలా నష్టపోతారు. పరీక్షలన్నీ తర్వాత, ముందు ఈ సినిమా చేయండి’ అన్నాడు.

ఐదు రోజులే పరీక్షలు, ఇప్పుడు మిస్సయితే మళ్లీ వచ్చే ఏడాది బ్యాక్‌లాగ్స్ రాసుకోవాలని చెప్పినా వినలేదు. ఆ సినిమా షూటింగ్‌కు వెళ్లాం. మంచి పాత్ర. చేశాను, వచ్చాను.  నేను నా పరీక్షలు రాయలేకపోయాను. ఆ తర్వాత సంవత్సరమే రాయాల్సి వచ్చింది. రెండు నెలలు గడిచిపోయాయి. ఈ టైంలో మళ్లీ అదే మలయాళ సినిమా కంపెనీ వాళ్లు వచ్చారు.

‘మేడమ్! ముఖ్యమైన నాలుగైదు సీన్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అవి షూట్ చేయాలి’ అన్నారు. మొత్తం పూర్తి చేశామే, ఇంకేంటి అన్నాను. ‘చాలా ముఖ్యమైన సీన్లు కొన్ని మిస్ చేశాం’ అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు డైరెక్టర్ వచ్చి, ‘ఏమ్మా! నీకు నమ్మకం లేదా? ఇవి చాలా ముఖ్యమైన సీన్లు. డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు. ఏమీ చేయలేం’ అన్నాడు.

మమ్ముట్టిని పెట్టి సినిమా చేసిన డైరెక్టర్, మంచివాడిలాగే ఉన్నాడనుకొని అక్కడికి వెళ్లాక, ఒక స్నానం చేసే సీన్, ఒక రేప్ సీన్.. అలా మూడు, నాలుగు సీన్లు చేయాలని అన్నారు. నేను ఏం చేయాలి? చెప్పండి. ఒక సినిమా కమిట్ అయ్యి, పూర్తి చేశాం. తర్వాత వచ్చి, ఇంకో మూడు సీన్లు చేసి తీరాలి, ఇవి ఉంటేనే సినిమా విడుదలవుతుంది అంటారు. వాళ్ల సినిమా బిజినెస్ కావడం కోసం నన్ను బలిపశువును చేయాలని వాళ్ల ఉద్దేశం.

అప్పటికీ నేను చెప్పాను, ‘ఎందుకు సార్ ఈ సీన్స్? కావాలని ఇరికించకండి. వద్దు’ అన్నాను. ‘లేదు మేడమ్. ఏమాత్రం అసభ్యంగా లేకుండా నేను తీస్తాను. సినిమాలో మొత్తం మీరు ఉంటారు. ఒక సీన్ మాత్రం ఇలా ఉంటుంది’ అన్నాడు డైరెక్టర్. ఒక నటి ఇంతకంటే ఏం వాదించగలదు? సరే అని ఆ సీన్లు పూర్తి చేశాను.

ఆ తర్వాత ఆ సినిమా పోస్టర్ మీద ‘ఏ’ సర్టిఫికెట్ వేసి, పక్కనే రేప్ సీన్ పోస్టర్ వేస్తే మీకెలా ఉంటుంది? నాకు కడుపు మండిపోయింది.నేను పరీక్షలు రాసి ఉంటే కనీసం ఆ సంవత్సరం నా చదువు పూర్తయ్యేది. నన్ను కన్విన్స్ చేసి, అంత ఇరిటేట్ చేసి, టార్చర్ చేశారు. మీరు నటించకపోతే మేము దివాలా తీస్తాం, లేకపోతే ఈ సినిమా రిలీజ్ చేయలేం అని బలవంతపెడితే, సరే అని వెళ్లి నటిస్తే అది నాకే ఇబ్బందికరంగా మారింది.

అది ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా అవుతుందని మనం ఊహిస్తామా? డబ్బు అడిగేటప్పుడు తెలియలేదు, నటించేటప్పుడు తెలియలేదు. కథ చెప్పేటప్పుడు తెలియలేదు. మమ్ముట్టిని పెట్టి సినిమా చేసిన డైరెక్టర్ అన్నాడు. మంచి ప్రతిభ ఉంది, కెరీర్ ఉంది అని నమ్మేకదా మనం పనిచేస్తాం. కానీ మనల్ని దాటి వాళ్లు కొన్ని పనులు చేస్తారు.”

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!