Ravi Vanarasi …………..
ప్రస్తుత భారతీయ సంగీత ప్రపంచంలో ఒక పేరు మారుమోగుతోంది, అది అరిజిత్ సింగ్.అతని గళం కేవలం స్వరాల సమాహారం కాదు, అది వినే ప్రతి హృదయాన్ని తాకే ఒక ఉద్వేగాల ప్రవాహం. ప్రేమ, బాధ, ఆనందం… ఏ భావాన్నైనా తన పాటతో మన కళ్ళ ముందు నిలబెట్టే అద్భుతమైన శక్తి అరిజిత్‌ది.
సాంకేతికంగా చెప్పాలంటే, అరిజిత్ సింగ్ గాత్రం లోతు, విస్తృతి, వ్యక్తీకరణ సామర్థ్యం అతన్ని సమకాలీన గాయకులలో అగ్రస్థానంలో నిలబెట్టాయి.భారతీయ సినీ సంగీతానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత అతనికే దక్కుతుంది.అరిజిత్ సింగ్ కి వాయిస్ మాడ్యులేషన్ పై అద్భుతమైన నియంత్రణ ఉంది.
స్వరానికి తగినట్టు గాత్రంలో అప్ అండ్ డౌన్స్ చూపుతారు. విభిన్న భావోద్వేగాలను అద్భుతంగా పలికిస్తారు. భారతీయ సంగీతంలో ప్రస్తుతం అరిజిత్ సింగ్ ఒక యువ తార. ఆయన పాట కేవలం శ్రోతలను చేరుకోవడం కాదు, వారి హృదయాలను కదిలిస్తుంది. ఆయన బహుముఖ ప్రజ్ఞ ఎంతో మంది ప్రముఖ సంగీత దర్శకులను, గాయకులను కూడా ఆశ్చర్యపరిచింది.
ఈ గాయకుడి స్వర విన్యాసం, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రముఖులెందరో మెచ్చుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ ఏమన్నారంటే … అరిజిత్ సింగ్ కేవలం ఒక మంచి గాయకుడిగా మాత్రమే కాకుండా, అంతకుమించి తెలివైన సంగీతకారుడిగా, బుద్ధిమంతుడైన సంగీతకారుడిగా అభివర్ణించారు.
పాట తాలూకు మూడ్‌ను అర్థం చేసుకోవడం, ఏ స్థాయి లో పాడాలి అనే పరిజ్ఞానం ఉండటం చాలా ముఖ్యం. అరిజిత్ లో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఆయన తెలివైన నిర్ణయాలు, కొత్త ప్రయోగాలు చేయాలనే తపనతోనే ప్రతి పాట ఒక మాస్టర్‌పీస్ గా మారుతుంది.
విశాల్-శేఖర్ ద్వయంలో ఒకరైన విశాల్ దద్లానీ అరిజిత్ వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తాయి. ఒక స్టార్ సింగర్ అయ్యి కూడా, సంగీత దర్శకుడితో కలిసి పనిచేసేటప్పుడు, ఇది నా పాట, ఇది మీ ట్యూన్ అనే విభేదం లేకుండా, ఆ పాట విజయవంతం కావడానికి సలహాలు స్వీకరించే సహృదయత అరిజిత్‌లో ఉంది.
గొప్ప దర్శకుడు, కళాత్మక చిత్రాల సృష్టికర్త సంజయ్ లీలా భన్సాలీ “అరిజిత్ సింగ్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి” అంటారు. భన్సాలీ సినిమాలలో ప్రతి సన్నివేశం, ప్రతి పాట ఒక అద్భుతమే.అరిజిత్ గాత్రంలో ఉన్న భావోద్వేగం, క్లిష్టమైన ట్యూన్స్‌ను కూడా సులభంగా పలికే ఆయన సామర్థ్యం, భన్సాలీ లాంటి దర్శకుడి కళాత్మక దృష్టికి సరిగ్గా సరిపోయేది. అందుకే ‘లాల్ ఇష్క్’ వంటి క్లాసిక్ పాటలు ఆయన సినిమాల నుండి వచ్చాయి.
దేశంలో అగ్రశ్రేణి గాయనిగా వెలుగొందుతున్న శ్రేయా ఘోషల్ అరిజిత్‌ను ప్రశంసిస్తూ, ఆయన బహుముఖ ప్రజ్ఞ కల వాడని వ్యాఖ్యానించారు.ఒక గాయనిగా, అరిజిత్‌తో ఎన్నో అద్భుతమైన డ్యూయెట్‌లు పాడిన అనుభవం శ్రేయా ఘోషల్ కి ఉంది. ఇరువురి గొంతులలోని భావోద్వేగాలు కలిసినప్పుడు అది శ్రోతలకు ఒక మధురానుభూతిని ఇస్తుంది.
అరిజిత్ రొమాంటిక్ పాటలైనా, విషాద గీతాలైనా, పెప్పీ నంబర్లైనా… దేనినైనా పాడుతూ, ఆ పాట డిమాండ్ ఏమిటో సరిగ్గా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా తన గొంతును మలుచుకోగలరు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహాదేవన్ మాట్లాడుతూ, “అతను అరిజిత్ సింగ్‌గా మారకముందే నాకు తెలుసు. అతను విద్యావంతుడైన సంగీతకారుడు, సరిగమలను అర్థం చేసుకుంటాడు’ అని చెప్పుకొచ్చారు.
లెజెండరీ గాయకుడు సురేష్ వాడ్కర్ అరిజిత్‌ను “ఈ తరం గొప్ప గాయకులలో ఒకరిగా” ప్రశంసించారు. సురేష్ వాడ్కర్ ఎన్నో దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో ఉన్నారు, ఎంతో మంది గొప్ప గాయకులను చూశారు. చివరిగా, మధుర గాయకుడు సోనూ నిగమ్ మాటలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
ఆయన తనను తాను 10కి 6 రేట్ ఇచ్చుకుంటూ, అరిజిత్‌కు మాత్రం 10కి 7 రేట్ ఇచ్చారు! అంటే తన కంటే అరిజిత్ ఒక మెట్టు ఎక్కువ అని అంగీకరించారు.ఈ తరం గాయకుడిని తనకంటే గొప్పగా రేట్ చేయడం అనేది అరిజిత్ అసాధారణ ప్రతిభకు తిరుగులేని నిదర్శనం.
ఇక వ్యక్తిగత వివరాలలో కెళ్తే ……. అరిజిత్ సింగ్ ఏప్రిల్ 25, 1987న పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జన్మించారు. 2013 లో విడుదలైన ఆషికి 2చిత్రం లోని “తుమ్ హి హో” పాట ద్వారా పాపులర్ అయ్యారు. ఆయన కెరీర్ 2005లో ఫేమ్ గురుకుల్వంటి రియాలిటీ షోలతో ప్రారంభమైంది.
తొలినాళ్ల లో తన కెరీర్‌ను సంగీత ప్రోగ్రామర్‌గా ప్రారంభించాడు, ప్రీతమ్ చక్రవర్తి,శంకర్-ఎహ్సాన్-లాయ్ వంటి స్వరకర్తలకు సహాయం చేశాడు, తర్వాత గాయకుడిగా మారారు. రొమాంటిక్, సూఫీ , శాస్త్రీయ సంగీతంతో సహా వివిధ శైలులలో, బహుళ భారతీయ భాషలలో పాటలు పాడారు.
ఆయన పాటల్లో “చన్నా మేరేయా,” “ఫిర్ భీ తుమ్కో చాహుంగా,” “ఏ దిల్ హై ముష్కిల్ వంటి పాపులర్ సాంగ్స్ ఎన్నోఉన్నాయి. అరిజిత్ సింగ్ తండ్రి పంజాబీ, తల్లి బెంగాలీ ..సంగీత కుటుంబం నుండి వచ్చాడు.
అరిజిత్ సింగ్ తన మొదట రియాలిటీ షోలో సహ పోటీదారు కోయల్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు.కానీ ఆ వివాహం విడాకులతో ముగిసింది. తరువాత తన చిన్ననాటి స్నేహితురాలు కోయల్ రాయ్‌ను 2014లో వివాహం చేసుకున్నారు.

