ఎన్నికల బరిలోకి వీరప్పన్ కుమార్తె !!

Sharing is Caring...

Will Voters give her a chance?……………….

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. విద్యా రాణి వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె మొదట బీజేపీలో చేరారు. తమిళనాడు రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీని వీడి, సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి (NTK) పార్టీలో చేరారు.

నాటి లోకసభ ఎన్నికల్లో ఆమె తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుండి NTK అభ్యర్థిగా పోటీ చేశారు. సుమారు 1.07 లక్షల ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. నాలుగో స్థానం లో నిలిచారు. తన తండ్రి చేసిన పనులతో సంబంధం లేకుండా, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెబుతుంటారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం పోరాడతానని మీడియా ముందు కూడా చాలా సార్లు చెప్పారు. 

వీరప్పన్ భార్య ముత్తులక్ష్మికి ఇద్దరు కుమార్తెలు – విద్యా రాణి పెద్ద కుమార్తె కాగా,  ప్రభావతి చిన్న కుమార్తె. ఇప్పుడు మెట్టూరు అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా ఆమె ఎంపికయ్యారు. NTK సమన్వయకర్త సీమాన్, అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన తొలి విడత అభ్యర్థుల్లోవిద్యా రాణి కి అవకాశం కల్పించారు.

విద్యా రాణి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించారు. సాధారణ ప్రజల గొంతుకగా అసెంబ్లీలో ప్రజాసమస్యలను వినిపిస్తానని అంటున్నారు. తన ఎన్నికల ప్రచారం కోసం ఆమె ప్రజల నుండి ఆర్థిక సాయాన్ని కూడా కోరుతున్నారు.

ఇక వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి గతంలో రాజకీయాల్లోకి వచ్చారు. 2006 లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. ముత్తులక్ష్మి ప్రస్తుతం తన కుమార్తె విద్య రాణి వెన్నంటి ఉండి, ఆమె గెలుపు కోసం ప్రచారంలో సహకరిస్తున్నారు. వీరప్పన్ పట్ల సానుభూతి ఉన్న గిరిజన ఓటర్లను ఆకట్టుకోవడానికి విద్యా రాణి ప్రయత్నిస్తున్నారు.

మెట్టూరు ప్రాంతం వీరప్పన్ ప్రభావం ఉన్న ప్రాంతం కావడంతో విద్యా రాణికి అక్కడ మంచి ఆదరణ లభిస్తోంది. తన తండ్రి ఇమేజ్‌ను కాకుండా, తన న్యాయవాద వృత్తి,  సేవా దృక్పథాన్ని విద్యారాణి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

గతఎన్నికల్లో ఎస్. సదాశివం PMK (పట్టాళి మక్కల్ కట్చి) పార్టీ తరపున కేవలం 656 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.  డీఎంకే అభ్యర్థి 96,399 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా .. ఇక్కడ NTK అభ్యర్థి కి 9,109 ఓట్లు వచ్చాయి.మెట్టూరు అసెంబ్లీ సెగ్మెంట్ ధర్మపురి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.

మెట్టూరు డ్యామ్ ఈ నియోజకవర్గంలోనే ఉండటంతో సాగునీరు,  హైడ్రో-పాలిటిక్స్ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి.థర్మల్ పవర్ ప్లాంట్లు, సిమెంట్, కెమికల్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కీలకమైన ఎన్నికల అంశాలు. ముఖ్యంగా వన్నియార్ సామాజిక వర్గం, SC ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గతంలో PMK, AIADMK ,DMK పార్టీల మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు సాగింది. సారి ఎలా ఉంటుందో చూడాలి. 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!