Bharadwaja Rangavajhala …………………………………..
1989 లో నేను ఓ బస్సు బర్నింగ్ కేసులో అరెస్ట్ అయ్యాను … ఇన్స్ డెంట్ జరిగింది గన్నవరం స్టేషన్ పరిధిలో … కనుక గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉంచారు.గన్నవరం స్టేషన్ లాకప్పు గన్నవరం సబ్ జైలు లాకప్పులతో కల్సి ఉంటుంది. భోజనం కూడా అక్కడ నుంచే ఈ లాకప్పుకు కూడా ట్రాన్స్ ఫర్ అయ్యేది. అంటే జ్యుడీషియల్ కస్టడీ లో ఉన్న వారి భోజనమే … స్టేషన్ లాకప్పు వారికీ పెట్టేవారన్నమాట.
సబ్ జైలు లో ఉండే ఐదారుగురు ప్రిజనర్స్ కీ ఓ ముసలాయన వంట చేసేవాడు. చాలా రుచిగా వండేవాడు. నన్ను అప్పుడప్పుడూ … గన్నవరం పోలీస్ క్వార్డర్స్ లో కూడా ఉంచేవారు. కారణం మా వాళ్లెవరైనా సెర్చ్ వారెంట్ వేస్తారేమో అనే అనుమానం చొప్పునే. ఇలా నడుస్తూండగా … ఓ రోజు ఈ రిమాండు ముసలాయన … కోర్టు వాయిదాకు వెళ్లి వచ్చాడు. ఆ రోజు ఆయన జడ్జిమెంటు. ఏమైంది అని అడిగా లాకప్ లోంచే .. కొట్టేశారు. వెళ్లిపోతున్నా … అన్నారు.
అవునూ కేసేంటి? అని అడిగా క్యూరియాసిటీతో … కుప్పలు తగలెట్టాననే అనుమానంతో కేసు పెట్టారు. అన్నాడు.
ఏ ఊరు ?
కోమటిగుంట …
మా ఊర్లో ఓ పాతికెకరాల ఆసామీ ఉంటాడు … ఆయన పొలంలో కోతలకు వెళ్లాం .. కూలి ఇచ్చేప్పుడు కొంత కోసి ఇచ్చాడు. నేను ఏ ఒక్క రోజూ పని మానలేదుగానీ నాగాలున్నాయని కోసేశాడు. దీని మీద గొడవ అయ్యింది. వాళ్ల పెద్దబ్బాయి నన్ను కొట్టాడు కూడా … ఆ రాత్రే వాళ్ల పొలొంలో కుప్పలు తగలబడ్డాయి.
నాకే పాపం తెలియదు. ఆ ముందు రోజు జరిగిన గొడవ కారణంగా నన్ను అరెస్ట్ చేశారు. అంటే ఆయన రిపోర్టు ఇచ్చాడనుకోండి … అప్పట్నించీ ఇక్కడే ఇలా లాకప్పులో ఉండిపోయా … అన్నాడు. అదేంటి బెయిల్ పెట్టుకోలేదా? అని అడిగాన్నేను.
లేదు … నాకెవరూ లేరు … మా అమ్మా నాన్నా చిన్నప్పుడే పోయారు. మా అన్నా నేనూ … ఉండేవాళ్లం. నాకు పెళ్లి కాలేదు … చేసుకోలేదు … మా అన్నకు పెళ్లైంది. పిల్లలున్నారు. అయితే మా అన్న పిల్లలు నన్ను పట్టించుకుంటే … ఊళ్లో పెద్దమనిషితో గొడవ వస్తుందని దూరంగా ఉండిపోయారు. నాకు బయట ఉన్నా లోపలున్నా ఒకటే కనుక ఇక్కడే వంట చేసి నలుగురికి పెడుతూ … మూడున్నరేళ్ల నుంచీ ఇక్కడే ఉండిపో్యా … అన్నాడు.
మూడున్నరేళ్లుగా రిమాండులో ఉన్నావా? అని అడుగుతూ కేసు కొట్టేశారా లేక రిమాండ్ సరిపెట్టారా? అని అడిగా …
కో్ర్టు కానిస్టేబుల్ వచ్చాడు … కొట్టేయడమా పాడా … ఏడాదిన్నర శిక్ష పడింది … ఈ పెద్దమనిషికేమో మూడున్నరేళ్ల రిమాండు ఉంది … జడ్జిగారు ఏ మాత్రం సిగ్గు పడకుండా రిమాండ్ సెటప్ చేసి రిలీజ్ చేసేయండి అన్నారు.
అవునూ … ఎందుకంత టైమ్ పట్టింది కేసు విచారణకు అన్నాన్నేను.
ఎస్కార్టుల్లేక చాలా వాయిదాలకు వెళ్లలేదు … సారీ మేమే తీసుకెళ్లలేదు. ఇది ఈ జైలు పరిస్థితే కాదు గురూ అన్ని జైళ్లల్లోనూ ఉన్నదే కదా … రాజమండ్రి నుంచీ కూడా ఎస్కార్టులు సరిగా ఉండవు … కనుక ఇది మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించడం లేదు … ఆయనా పెద్దగా ఇబ్బంది పడడం లేదు … అన్నారు ..
ముసలాయన నోరు విప్పాడు .. అవును నేనిప్పుడు ఎక్కడకిపోవాలో అర్దం కావడం లేదు … మా ఊరెల్లలేను … ఇక్కడే వంట చేస్తూంటా ఎప్పట్లాగే అంటేనేమో కోర్టు గుమాస్తా ఒప్పుకోలేదు … ఇక్కడే ఏదో ఒక హోటల్ చూసుకుని పన్లో చేరిపోవాలి అన్నాడు నవ్వుతూ …
ఈ మధ్య స్వతంత్ర టీవీలో అండర్ ట్రైల్ ప్రిజనర్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ ముసలాయన గుర్తొచ్చాడు.
పడిన శిక్ష కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉన్న వారికి నష్టపరిహారం ఇవ్వాలి కదా … అదివ్వరు…
నేను కూడా దాదాపు ఎనిమిది తొమ్మిది కేసుల్లో అరెస్టై దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు రిమాండ్ చేశాను. ఏ ఒక్క కేసులోనూ శిక్ష పడలేదు. అన్నీ కొట్టేశారు.
రాజమండ్రి, వరంగల్ సెంట్రల్ జైళ్లు, విజయవాడ, గన్నవరం, ఏలూరు, బందరు సబ్ జైళ్లు సందర్శించాను …
రాజమండ్రితోనే అత్యధిక అనుబంధం … మూడున్నరేళ్లు అక్కడే గడిపాను కనుక నాకా జైలు అంటే చాలా ఇష్టం …
ఆ విషయం పక్కన పెట్టేస్తే … నా రిమాండుకు ప్రభుత్వం నష్టపరిహారం పైసా ఇవ్వకపోవడం నాకు బాధ కలిగించింది. అయితే వదిలేశారు కదా పోన్లే అనిపించిందనుకోండి.
ఇలా ఎస్కార్టులు రాక కేసు సరిగ్గా నడవక … రిమాండులో మగ్గిపోయి ఉండిపోవడం ఒక ఎత్తైతే …
ఈ మధ్య కోర్టులు బెయిల్ షూరిటీల విషయం చాలా సంక్లిష్టంగా మార్చేయడం కూడా అండర్ ట్రైల్ ప్రిజనర్స్ జైళ్లల్లో మగ్గిపోవడానికి కారణమౌతోంది.మా రోజుల్లో … లక్ష రూపాయల జామీను సమర్పించాలంటే … ఆర్టీసీ తదితర సంస్ధల ఉద్యోగులనో … లేక … పొలం కాయితాలో ఇళ్ల కాయితాలో … పెట్టి తెచ్చుకునేవారు.
ఇప్పుడు సీన్ మారింది … బ్యాంకులో నగదు జమచేసి బాండ్లు తీసుకుని వాటిని సమర్పిస్తేగానీ కోర్టు వారు అంగీకరించడం లేదు.ఇది చాలా కష్టం … ఈ కారణంగా కూడా జైల్లల్లో రిమాండు ఖైదీలు మురిగిపోతున్నారు. ఆన్ లైన్ విచారణ చేస్తామన్నారుగానీ … అది కూడా అన్ని జైళ్లల్లోనూ నడవడం లేదు … అది పరిస్తితి.
ఈ హిందూత్వ వాదులు గృహము తీసి నా మీద కేసు పెడితే ఈ డిపాజిట్టు కట్టాలనే నిబంధన భయం పెడుతోంది సుమీ …
ఏది ఏమైనా కోర్టులూ జైల్లూ మా కాలంలోలా లేవు సుమీ . అందుకే గతకాలమే మేలు వచ్చు కాలముకంటెన్ అన్నారు నన్నయ్యవిశ్వనాధ సత్యనారాయణగారు … అర్ధం చేసుకోరూ .