తాలిబన్ల కు ఊహించని షాక్ !

Sharing is Caring...

Opposition to the Taliban………………………………………తాలిబన్లకు ఊహించని విధంగా వ్యతిరేకత ఎదురవుతోంది. కొన్ని జిల్లాల్లో తిరుగుబాటు దారులు వారిపై దాడులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లను హతమార్చి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడు జిల్లాల్లో తాలిబన్లను నార్తరన్ ఫైటర్లు మట్టుబెట్టారు.ఆ జిల్లాలను తిరిగి తమ చేతుల్లోకి తీసుకున్నట్టు నార్తరన్ ఫైటర్లు ప్రకటించారు.

బఘ్లన్ ప్రావిన్స్‌లోని దిల్ సలాహ్, పుల్-ఈ-హెసర్, బానో జిల్లాలు ప్రస్తుతం తాలిబన్ల నుంచి విముక్తి పొందాయి. అక్కడి తాలిబన్లపై తిరుగుబాటుదారులు మెరుపు దాడి చేయడంతో.. దాదాపు 60 మంది తాలిబన్లు చనిపోయారని ..మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తిరుగుబాటుదారులు ఇతర జిల్లాలపై కూడా పట్టు సాధించేందుకు ముందుకు కదులుతున్నారు. ఈ దాడులకు సంబంధించి అనేక ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ పరిణామాలు తాలిబన్లకు అన్యూహ్యమైన షాక్ అనే చెప్పుకోవాలి. ఇక ఆఫ్ఘనిస్తాన్‌లోని పంజ్‌షీర్ లోయలో తాలిబాన్ వ్యతిరేక శక్తులు ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గ్రూపుపై పోరాడేందుకు గెరిల్లా ఉద్యమం చేయాలని నిర్ణయించాయి. దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయి. ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, తాలిబాన్ వ్యతిరేక పోరాట యోధుడి కుమారుడు అహ్మద్ మసౌద్ నాయకత్వంలో ప్రతిఘటన దళాలు ఇప్పటికే  ఆ పనిలో ఉన్నాయి. తాలిబన్ వ్యతిరేక శక్తులతో మంతనాలు జరుపుతున్నాయి.

వీరు అమెరికా నుంచి ఆయుధాలను కోరుతున్నారు. ఈ మేరకు అమెరికా ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నారు. మొదటి నుంచి పంజ్‌షీర్ లోయ ప్రాంత ప్రజలు తాలిబన్లకు వ్యతిరేకమే. అయితే వీరి వద్ద కానీ నార్తరన్ ఫైటర్ల వద్ద కానీ పెద్ద సంఖ్యలో ఆయుధాలు లేవు. అపార ఆయుధ సంపత్తి కలిగిన తాలిబన్లు వీరితో పోరాటానికి దిగితే ఇబ్బందే. 

ఆఫ్ఘన్ లో మొత్తం 34 ప్రావిన్సెస్ ఉన్నాయి. ఒక్కో ప్రావిన్స్ లో 15 జిల్లాలు ఉంటాయి. ఈ లెక్కన చూస్తే తిరుగుబాటు దారులు పెద్ద పోరాటమే చేయాలి. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ పై  పట్టు పెంచుకునేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ప్రకటించారు. మిగతా దేశాలు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నాయి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!