ఉక్రెయిన్ యుద్ధం .. లాభసాటి వ్యాపారం గా మారిందా ?

Sharing is Caring...

War vs Business………………………………………

ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఆస్తి నష్టం ,ప్రాణనష్టం భారీగా ఉన్న మాట వాస్తవమే.  కానీ అదే సమయంలో ఆయుధాలు సరఫరా చేసే కంపెనీలు లాభాలు గడిస్తున్నాయి. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి.

ప్రపంచంలోని అతి పెద్ద ఆయుధ తయారీ సంస్థ Lockheed Martin Corp తో పాటు టాప్ సెవెన్ కంపెనీలు అమెరికావే. అమెరికా, యూరప్ ల్లోని ఆయుధ కంపెనీలు చాలావరకు ప్రైవేట్ సంస్థలే. ఐదేళ్లుగా పెద్దగా వ్యాపారం సాగక అవన్నీ  సతమతమవుతున్నాయి.  ఉక్రెయిన్ యుద్ధం పుణ్యామా అని ఈ సంస్థలు లాభాల బాట పట్టాయి. వాటి షేర్ల ధరలు కూడా బాగా పెరిగాయి.  

అమెరికాతో సహా నాటో దేశాలు ఉక్రెయిన్ కు అందిస్తున్న సాయంలో చాలావరకు ఆయుధాల రూపంలోనే అందుతోంది. ఈ సాయం లో ఉచితం కొంతవరకే. ఆయుధాలకు మాత్రం ఖరీదు కడుతున్నాయి. ఇక పెద్ద ఆయుధ కంపెనీలలో Boeing (US).. Raytheon (US).. BAE Systems (UK)… Northrop Grumman Corp (us )… General Dynamics Corp (us).. Airbus group (Trans-European)  Thales (France) వంటి సంస్థలున్నాయి.

ఇవి గాక ప్రపంచవ్యాప్తంగా మరెన్నో ఆయుధ తయారీ కంపెనీలున్నాయి. ఇక విమాన విధ్వంసక స్ట్రింగర్, ట్యాంకు విధ్వంసక జావలిన్ వంటి ఆయుధాలను తయారు చేస్తున్నది అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్, రేథియాలే. యుద్ధం మొదలవగానే మార్చిలో లాక్ హీడ్ సంస్థ షేరు విలువ ఒక్కసారిగా 16 శాతం పెరిగింది.

రేథియాన్ సంస్థ షేరు విలువ 8 శాతం, యూరప్ లో అతి పెద్ద ఆయుధ కంపెనీ బీఏఈ షేరు విలువ ఏకంగా 26 శాతం పెరిగాయి. అమెరికాకు చెందిన జనరల్ డైనమిక్స్ షేరు 12 శాతం, నార్త్ రోప్ గ్రూమన్ షేరు 22 శాతం పెరిగాయి. ఈ కంపెనీల షేర్లలో మదుపు చేసిన ఇన్వెస్టర్లు కూడా లబ్దిపొందుతున్నారు. ఈ కంపెనీలన్నీ అమెరికా కాంగ్రెస్ సభ్యుల వే కావడం విశేషం. కొంతమందికి ఈ కంపెనీల్లో భారీ వాటాలున్నాయి. 

కనీసం 20 మంది కాంగ్రెస్ సభ్యులకు, లేదా జీవిత భాగస్వాములకు లాక్ హీడ్ మార్టిన్, రేథియాన్ సంస్థల్లో వాటాలున్నాయి. మరికొంతమంది ఆయా కంపెనీలలో మదుపు చేసారు. పెట్టుబడి కూడా పెట్టారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు మార్టోరీ టైలర్ గ్రాన్ ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 22న లాక్ హీడ్ మార్టిన్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారు.

ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం కోసం అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్ లో పెట్టిన ప్రతిపాదనలు  వేగంగా ఆమోదం పొందుతున్నాయి. అడిగిన దాని కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని మీడియా కథనాలు కూడా వస్తున్నాయి.

ఉక్రెయిన్‌కు  అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు 4,000 కోట్ల డాలర్లకు పైగా నిధులిచ్చేందుకు సిద్ధమైంది.ఇందులో చాలావరకు ఆయుధ రూపంలో అందేదే. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఆయుధ కంపెనీలు కాసుల పంట పండించుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ ఇదే విధంగా జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా ఒక్కో ప్యాకేజ్ కింద ఆయుధాలను సరఫరా చేస్తున్నది. 800 మిలియన్ల ప్యాకేజీ కింద ఆయుధ సరఫరా కింది విధంగా ఉంది. ఇలాంటివి మరెన్నో చేసింది.800 స్ట్రింగర్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్;2,000 జావెలిన్, 1,000 తేలికపాటి యాంటీ-ఆర్మర్ ఆయుధాలు, 6,000 AT-4 యాంటీ-ఆర్మర్ సిస్టమ్స్;100 టాక్టికల్ అన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్;100 గ్రెనేడ్ లాంచర్లు, 5,000 రైఫిల్స్, 1,000 పిస్టల్స్, 400 మెషిన్ గన్లు, 400 షాట్‌గన్‌లు;20 మిలియన్ రౌండ్ల చిన్న ఆయుధాల మందుగుండు సామగ్రి, గ్రెనేడ్ లాంచర్, మోర్టార్ రౌండ్లు; బులెట్ ప్రూఫ్ సెట్లు 25,౦౦౦, 25,000 హెల్మెట్లు. ఈ లెక్కన మరెన్నో ఆయుధాలు సరఫరా చేసి ఉండాలి. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!