సంచలనాలకు శ్రీకారం చుట్టిన ఇద్దరు మిత్రులు

Sharing is Caring...

Records and sensations …………………. 

ఈ ఫొటోలో కనిపించే కుర్రాళ్ళు ఇద్దరూ సామాన్యులు కాదు. 19 ఏళ్ల కే వ్యాపార రంగంలో సంచలనాలకు శ్రీకారం చుట్టారు. కేవలం ఏడాది వ్యవధిలోనే ఏకంగా రూ. 7వేల కోట్లకు పైగా విలువైన కంపెనీని సృష్టించి రికార్డు సృష్టించారు.

వెయ్యి కోట్ల సంపద కూడబెట్టి తాజాగా భారత్ లో బిలియనీర్ల క్లబ్ లో చేరిన చిన్నవయసు కుర్రోళ్ళు. విదేశాల్లో చదువుకోవాలని అక్కడే ఉద్యోగం చేసి స్థిరపడాలని చాలామంది కలలు కంటుంటారు. అయితే కైవల్య, అదిత్ లు స్టాన్ఫోలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువును వదిలేసుకొని భారత్ కు తిరిగి వచ్చారు.

బెంగళూరులో జన్మించిన కైవల్య దుబాయ్ కాలేజీలో చదివాడు. గణితం, కంప్యూటర్ సైన్స్ తో పాటు హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో నైపుణ్యముంది. అదిత్ ముంబయిలో పుట్టి పెరిగాడు. దుబాయ్ లో చదివాడు. స్టాన్ఫో కు వెళ్లటానికి ముందే… 17 ఏళ్ల చిన్న వయసులోనే గోపూల్ పేరుతో… విద్యార్థుల కోసం కార్ల పూలింగ్ స్టార్టప్ ఆరంభించాడు.

ఇక చదువు మధ్యలో వదిలేసి వచ్చిన కైవల్య వోహ్రా, అదిత్ పలీచా  జెప్టో పేరిట ఒక కంపెనీని స్థాపించారు. అతి తక్కువ సమయంలో ఇంటికి కిరాణా, ఇతర సామగ్రిని ఈ కంపెనీ అందిస్తుంది. 2020 కరోనా లాక్ డౌన్ సమయంలో ముంబయిలో ఒక  అపార్ట్ మెంట్లో ఉన్న వీరిద్దరూ… చాలామంది సామాన్యుల మాదిరిగానే నిత్యావసర సరకులు దొరక్క ఇబ్బంది పడ్డారు.

సరిగ్గా అదే సమయంలో వచ్చిన ఐడియా తోనే  తొలుత కైవల్య… కిరాణా మార్ట్ పేరుతో ఈ స్టార్టప్ ఆరంభించాడు. తర్వాత అదిత్ అందులో చేరాడు. స్థానిక కిరాణా దుకాణాలతో ఒప్పందం కుదుర్చుకొని… తక్షణమే ఇళ్లకు సామగ్రిని చేర వేయటం మొదలెట్టారు. కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి తొలుత తమపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. ఆ అనుభవాలను  సరిచేసుకుంటూ వెళ్లారు.

2021 ఏప్రిల్ లో ముంబయిలో రూ. 485. 3 కోట్ల ఆరంభ ఫండింగ్ ను ఆకర్షించి కార్యకలాపాలు మొదలు పెట్టిన కంపెనీ ఇప్పుడు పదికి పైగా పట్టణాల్లో సుమారు 1500 మంది సిబ్బందితో విస్తరించి సేవలందిస్తోంది.ఈ కుర్రాళ్ల , చొరవ, ఆలోచన శక్తి, ప్రజల అవసరాలు తీరుస్తున్న వైనాన్ని చూసి ప్రజలు ఆదరించారు.

కంపెనీ మొదలైన కొన్నాళ్ళకు జెప్టో స్టార్టప్ కి మరో రూ. 800 కోట్లు సమకూరాయి. ఈ ఏడాది మేలో రూ. 1617 కోట్లు వచ్చాయి. తద్వారా… కంపెనీ విలువ రూ. 7 వేల కోట్లకు పైగా చేరింది. కిరాణా సామగ్రితో పాటు కాఫీ, టీ, చిరుతిళ్లు లాంటివి కూడా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

“2021 మార్చినాటికి పది నిమిషాల్లో వస్తువులు ఇంటికి చేర్చటం ఆశ్చర్యం కల్గించే ఆలోచన.పైగా… మమ్మల్ని చూసి అంతా అనుమానించారు. మాపై, మా ఆలోచనలపై నమ్మకం కల్గించటం మొదట్లో సవాలుగా మారింది. సమర్థులైన 9 మందిని అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఇన్ఫోసిస్ నుంచి నాయకత్వ స్థానాల్లో తీసుకున్నాం. మిగిలిన జట్టును నిర్మించాం. ఆరునెలల్లో నిల దొక్కుకున్నాం” అంటున్నారు ఈ కుర్రాళ్లు.

అదిత్, కైవల్య తాజాగా… 2022 వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో చేరారు. కైవల్య సంపద రూ.1000 కోట్లు, అదిత్ సంపద రూ.1200 కోట్లు. ముందు ముందు ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయి. యువతకు ఈ ఇద్దరూ స్ఫూర్తి దాయకం అని చెప్పుకోవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!