ఒకే కథతో రెండు సినిమాలు..ఒకటి ఫట్..మరొకటి హిట్ !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi………………….

బాలకృష్ణ సినిమాల్లో నాకు నచ్చిన సినిమా… 1989 జూన్లో వచ్చిన ఈ అశోక చక్రవర్తి . మళయాళంలో సూపర్ హిట్టయిన ఆర్యన్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా. మళయాళంలో మోహన్ లాల్ , హిందీ నటుడు శరత్ సక్సేనా , రమ్యకృష్ణ , శోభన ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ మళయాళ సినిమా హిందీ లోకి కూడా డబ్ అయింది .

1989 జూన్లో ఒకే రోజు రెండు సినిమాలు..ఒకే కధాంశంతో విడదలయ్యాయి . ఒకటి ఈ బాలకృష్ణ ‘అశోక చక్రవర్తి’ అయితే రెండవది వెంకటేష్ నటించిన ‘ధ్రువనక్షత్రం’ . రెండు సినిమాలకు డైలాగ్స్ పరుచూరి బ్రదర్సే వ్రాయడం విశేషం. దురదృష్టవశాత్తు అశోక చక్రవర్తి నిరాశపరిస్తే, ధ్రువనక్షత్రం హిట్టయింది. 

ఆరోజల్లో ఒకే కధాంశం వివాదం పత్రికల కెక్కింది. ‘అశోక చక్రవర్తి’ నిర్మాతలు తాము మూడు లక్షల రూపాయలు ఇచ్చి రైట్స్ కొనుక్కున్నామని తెలియపరిచారు . డైలాగ్స్ రైటర్స్ అయిన పరుచూరి బ్రదర్స్ ‘ధ్రువనక్షత్రం’ నిర్మాతలకు చెప్పకపోవటం సినిమా రంగ నైజం అయి ఉండాలి. అప్పట్లో పరుచూరి బ్రదర్స్ పై విమర్శలు వచ్చాయి. 

 ఇక ఈ అశోక చక్రవర్తి కధకొస్తే ….

సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి నాలుగు వేదాలను ఔపోసన పట్టిన వాడు వేదుల వెంకట అశోక్.గ్రామంలో ఉన్న తన కుటిల మేనమామ , సర్పంచ్ కుట్ర పన్ని అమ్మ వారి నగలను దొంగిలించాడనే నేరం మోపి జైలుకు పంపుతారు. జైలు నుంచి తిరిగొచ్చిన కుమారుడిని తండ్రి సోమయాజులు గృహ బహిష్కరణ చేస్తాడు .

అశోక్ బొంబాయికి చేరి సత్యనారాయణ వద్ద గ్యాంగ్స్టర్ అవుతాడు. కోట్లు సంపాదిస్తాడు.అశోక్ మేనమామ కూతురు భానుప్రియ తండ్రి తెస్తున్న సంబంధాన్ని తప్పించుకోవటానికి బొంబాయి చేరుతుంది..అక్కడ ఓ పోలీస్ ఆఫీసర్ రంగనాధ్ సహాయంతో బావ వద్దకు చేరుతుంది . సత్యనారాయణ ప్రోత్సాహంతో గ్రామానికొచ్చి తన నిర్దోషిత్వాన్ని తండ్రి సమక్షంలో రుజువు చేసుకుని అసలు దుర్మార్గులని అంతం చేయడంతో సినిమా ముగుస్తుంది.

ప్రధమ తాంబూలం బాలకృష్ణకే . ఆయనకు ఇది 47 వ సినిమా. నిలకడగా బాగా చేసాడు . డాన్సుల్లో , ఫైట్లలో , డైలాగ్స్ డెలివరీలో matured గా నటించాడు . తర్వాత స్థానం సత్యనారాయణది.ఆయనకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. బ్రహ్మాండంగా నటించారు .‌ సత్యనారాయణకు ప్రత్యర్థి గ్యాంగ్స్టర్ గా  శరత్ సక్సేనా , అతని అసిస్టెంటుగా మరో హిందీ నటి సువర్ణ ఆనంద్ నటించారు .

కధానాయికగా భానుప్రియ గ్లామర్ స్పేసుని అద్భుతంగా ఫిల్ చేసింది. పాటల్లో అదరగొట్టేసింది. ఇతర ప్రధాన పాత్రల్లో సోమయాజులు , అంజలీదేవి , జ్యోతి , శుభలేఖ సుధాకర్ , పి యల్ నారాయణ , భాగ్యశ్రీ , నర్రా , గొల్లపూడి , తాతినేని రాజేశ్వరి , ఈశ్వరరావు , ప్రదీప్ శక్తి , వంకాయల , రంగనాధ్ , చలపతిరావు తదితరులు నటించారు. 

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ‘ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనం’ అంటూ సాగే పాటకు సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది నృత్య దర్శకులు శివశంకర్ బాలకృష్ణ చేత కూడా చక్కని శాస్త్రీయ నృత్యాన్ని చేయించారు. అభినందనీయులు. పాట చిత్రీకరణ కూడా బాగుంటుంది . మిగిలిన పాటలు ఝనక ఝనక ఝం , సువ్వీ సువ్వీ , అబ్బ రూపమెంత రుచిరా పాటల చిత్రీకరణ బాగుంటుంది .

పాటలన్నీ వేటూరి వారు వ్రాయగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్రలు శ్రావ్యంగా పాడారు . 
ఎస్.ఎస్.రవిచంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమా సింహభాగం షూటింగ్ బొంబాయిలో చేసారు . గేంగ్ వార్ మీద ఫోకస్ కాదు . ఫోకస్ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిపెరిగిన అశోక్ డాన్ కావటం మీద . అందుకు బొంబాయిని ఎంపిక చేసుకోవటం బాగుంది. 

సినిమా యూట్యూబులో ఉంది. ఈ సినిమాలోనే అనుకుంటా . సత్యనారాయణ డైలాగ్ ఒకటి ఉంటుంది . పోతే సైన్యం , వస్తే రాజ్యం . మన రాజకీయ పార్టీల అధినేతలకు , ఆ పార్టీల కోసం తమ జీవితాలను నాశనం చేసుకునే సైన్యానికి బ్రహ్మాండంగా వర్తిస్తుంది . ఇంతకుముందు చూడని బాలకృష్ణ అభిమానులు ట్రై చేయవచ్చు . బాగానే ఉంటుంది .It’s an action cum crime-oriented entertainer .

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!