Govardhan Gande ……………………………………………..
పార్లమెంటు నిర్వహణకు నిమిషానికి అయ్యే ఖర్చు. కొంచెం అటుఇటుగా నిమిషానికి రెండున్నర లక్షలు. దీనిని ఖర్చు అనడం సబబో కాదో అన్న విషయం పక్కన బెడితే….జనం డబ్బు జనంపై జాగ్రత్తగా అంటే వృధాకాకుండా,దుర్వినియోగమవకుండా చూస్తూ ప్రతి పైసా వారి కోసమే వినియోగించేలా చూడవలసిన బాధ్యత పార్లమెంటుదే కదా.
పార్లమెంటుకు ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునేది కూడా అందుకే తమ ప్రతినిధులంతా ఈ పనిని సక్రమంగా,సమర్థంగా నిర్వర్తిస్తారని ఓటరు సహజంగానే ఆశిస్తాడు కదా. అది ఓటర్ హక్కు కూడా కదా. అదే కదా పార్లమెంటరీ ప్రజాస్వామ్య మూల సూత్రం. కానీ ప్రజలు ఆశించిన విధంగా పార్లమెంట్ సమావేశాలు జరగడం లేదు. ప్రజోపకరమయిన బిల్లులపై చర్చలు జరగడం లేదు. ప్రభుత్వం చర్చలకు ససేమిరా అంటోంది. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇందుకు మినహాయింపు కాదు.
అసలే చర్చలే జరగనప్పుడు పార్లమెంట్ జరిగి ప్రయోజనం ఏమిటి ? రాజకీయ క్రీడ కు పార్లమెంట్ వేదికగా మారుతున్నది. ఇందులో ప్రజలకు ఉపయోగ పడేదేమి లేదు. ప్రజల సొమ్ము ఖర్చు కావడం మినహా. వర్షాకాల పార్లమెంటు సమావేశాల తీరును గమనిస్తే ఇది అనవసరమైన ఖర్చు అని ఎవరైనా భావిస్తారు.రెండు రోజుల ముందే సమావేశాలు ముగిసాయి. కాదు ముగించేశారు. ఎందుకలా? ఎజెండాను పూర్తిగా చర్చించిందా? ఎజెండా ముగిసింది కాబట్టి సమావేశాలకు ముగింపు పలికారా?ఏమీ చర్చించలేదు. సర్కారీ బిల్లులన్నీ ఎలాంటి చర్చా లేకుండా ఆమోదం పొందాయి.
దేశంలో అనేక సమస్యలున్నాయి. కోవిడ్ ఓ పెద్ద సమస్య. వ్యవసాయ చట్టాలపై ఎన్నో నెలలుగా జరుగుతున్న రైతాంగ ఆందోళన మరో పెద్ద సమస్య. పెగాసస్ స్పై వేర్ అనేది కూడా అతి కీలక అంశమే. మరి వీటిపై ప్రతిపక్షాలు పట్టుబట్టినా ప్రభుత్వం చర్చకు ముందుకు రాలేదు. మొండి వైఖరి చూపింది. ప్రతిపక్షాలు పెగాసస్ పై పట్టుబట్టడాన్ని,అధికార పక్షం ఆయుధంగా మలచుకున్నది. తనకు అవసరమైన అన్ని బిల్లులను ఎలాంటి చర్చా లేకుండా ఆమోదింప జేసుకొని ఆనందిస్తున్నది.
పెగాసస్ పై ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నది అధికార పక్షం. ప్రతిపక్షం విఫలమై,అధికార పక్షం ఆనందించడానికి నిమిషానికి రెండున్నర లక్షలు వినియోగించడాన్ని ఎలా అర్థం చేసుకుందాం? ప్రజల సొమ్ము దుబారా చేసారు అని అనుకుందామా?ఇలా జనం సొమ్మును దుబారా చేయడానికేనా ఇలాంటి రాజ్యవ్యవస్థను నిర్మించుకున్నది?అందరూ ఆలోచించవలసిన సంగతే కదా ఇది.
మొత్తం మీద లోకసభలో 19 బిల్లులు పాసైనాయి. విపక్షాలు కలసి రావడంతో ఓబీసీ బిల్లుపై మాత్రమే ఉభయ సభల్లో పూర్తి స్థాయి చర్చ జరిగింది. లోకసభ సమావేశాలు 21 గంటలు మాత్రమే జరిగాయి. ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రయివేట్ పరం చేసేందుకు పెట్టిన బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి. చివరికి ఆ బిల్లు కూడా ఆమోదం పొందింది.