తమిళనాడులో (2004) సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. సముద్ర తీరానికి కొన్ని మైళ్ల వరకు అన్ని ఊళ్లు తుడుచు పెట్టుకుపోయాయి. అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. అదే తిరుచెందూర్ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం.
అంతేకాదు ఈ ఆలయం నుంచి సునామీ అలలు రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్లు ప్రత్యక్ష్యంగా చూసిన వారు చెప్పినట్టు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్లు ఆలయంలోని శిలాశాసనాలపై రాసిఉందని చెబుతారు. ఇది దైవ మహిమగా భక్తులు భావిస్తారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన ఆరు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు తమిళనాడు లో ఉన్నాయి. వాటిలో ఇదొకటి. కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాధలు, మహిమలు గురించి ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని ఇక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
సుబ్రహ్మణేశ్వర స్వామికి సంబంధించిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉండగా ఒక క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంది. ఇది ఆరు షణ్ముఖ క్షేత్రాలలో మొదటిది. హిందువులు తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయ చారిత్రక నేపధ్యం, కుమారస్వామి మహిమలు, ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తులను అబ్బురానికి గురి చేస్తాయి.
ముల్లోకాలను ఇబ్బందులకు గురి చేసే తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వారిని వెదుకుతూ.. ఈ క్షేత్రంలో బస చేసి పరమశివుణ్ణి పూజించినట్లు చెబుతారు. కుమారస్వామి తారకాసురున్ని వధించిన తరువాత సూరపద్మం అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోనే ఒక మర్రిచెట్టు రూపంలో దాక్కుంటాడు.
దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రిచెట్టును రెండు ముక్కలు చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. చివరి క్షణాల్లో ఆ అసురుడి కోరిక మేరకు మర్రిచెట్టు రెండు భాగాల నుంచి ఏర్పడిన నెమలిని, కోడిని సుబ్రహ్మణేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తాడు. అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లు చెబుతారు. ఈ ఆలయానికి వేల ఏళ్ళ చరిత్ర ఉంది.
తిరుచెందూర్ లోని సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం ఎంతో శక్తి వంతమైనదిగా చెబుతారు. దీనికి సంబంధించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 1646 – 1648 మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్వాధీనం చేసుకున్నారు. పోర్చుగీసులతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఉన్నారు.
స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. రోజు రోజుకూ పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన మురుగన్ విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకు వెళ్లారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళ్తున్న సమయంలో అనూహ్యంగా పెద్ద తుఫాను రాగా వారంతా నానా ఇబ్బందులు పడ్డారు. భయభ్రాంతులకు గురి అయ్యారు.
ఈ విపత్తు అంతా మురుగన్ విగ్రహం వల్లనే అని భావించి వారు దానిని సముద్రంలో వదిలేసి వెళ్లిపోయారు. తుఫాను ప్రభావం తగ్గిన కొద్దీ రోజులకు వాడ మలయప్పన్ పిళ్లై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెప్పాడు.
సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, దాని అడుగు భాగంలో విగ్రహాన్ని వెదకమని చెప్పి అదృశ్యమయ్యాడు. సముద్రంలో వెదకగా విగ్రహం బయటపడుతుంది. దానిని వెనక్కి తెచ్చి మరలా ఆలయంలోప్రతిష్టించారు. ఈ కథంతా ఆలయంలో పెయింటింగ్ ల రూపంలో భక్తులు తిలకించవచ్చు.
ఈ ఆలయంలోని సుబ్రహ్మణేశ్వరుడి తేజో రూపం భక్తులను ఆకట్టుకుంటుంది. బాలుడి రూపంలో ధాన్య ముద్రలో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహం దేశంలో ఇదొక్కటే కావడం విశేషం. బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యస్వామిగా పూజలు అందుకుంటున్నాడు.
ఇక్కడ స్కంద షష్టి ని పురస్కరించుకుని ఆరు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. శివాలయం, వల్లీ, దేవసేన ఆలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఆలయ కుంభాభిషేకం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.
తిరుచెందూర్ వాతావరణం సంవత్సరం పొడవునా ఒకే మోస్తరుగా వుంటుంది. అక్టోబర్ నుండి మార్చ్ వరకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకూ వర్షాల కారణం గా కొంత అసౌకర్యంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు దేవస్థానం వసతి సదుపాయాలు కల్పించింది.పెద్ద సంఖ్యలో ఏసీ .. నాన్ ఏసీ గదులు, కాటేజీలను నిర్వహిస్తోంది. అన్ని గదులకు ప్రాథమిక సదుపాయాలు ఉంటాయి. యాత్రికులు ముందుగానే గదులు బుక్ చేసుకొవాలి.
తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లాలో ఈ తిరుచెందూర్ ఉంది. తూత్తుక్కుడి నుంచి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మధురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా తమిళనాడు ప్రభుత్వ బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు.
రైలు మార్గం ద్వారా వచ్చే వారు చెన్నై నుంచి తిరునెల్వేలి వరకూ రైలులో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవాలి. విమానంలో వచ్చే వారికి సమీప ఎయిర్ పోర్ట్ ట్యూటికోరిన్… . ఇది 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి ఇక్కడికి 617 కిలోమీటర్లు. చెన్నైలో విమానం దిగే వారు రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.