మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలను విడిచే యోచనలో లేరు. త్వరలో పేట్రియాట్ పేరిట కొత్త పార్టీ పెట్టేందుకు తన సహచరులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికి ఓటమిని అంగీకరించని ట్రంప్ … వెళుతూ వెళుతూ మరల వస్తా అంటూ శ్వేతసౌధం సిబ్బందికి చెప్పి వెళ్లారు. దీన్నిబట్టే ఆయన రాజకీయాలు వదిలే ఆలోచనలో లేరని … తనపై ఉన్న వ్యతిరేకత తగ్గుముఖం పట్టిన దరిమిలా కొత్త పార్టీ ని ప్రకటిస్తారని అమెరికా మీడియా వార్తా కథనాలు వెలువరించింది.
ఇక ‘అధికారాంతమున చూడవలె ఆ అయ్య గారి సౌభాగ్యముల్’ అని ఒక ‘నానుడి’ ఉంది.పదవుల వలన హోదాలవలన, డబ్బువలన వచ్చే కీర్తి, గుర్తింపూ… అవి లేవన్న మరుక్షణం మటు మాయమైపోతాయి. అది తెలియక కొందరు తమ హోదాని గొప్పగా ఊహించుకుని చిత్తమొచ్చిన రీతిలో వ్యవహరిస్తుంటారు. సీటు దిగిన మరునిముష మే అంతవరకూ ఆయనకు భజనచేసి… తమ పనులు, పబ్బం గడుపుకున్నవారు ఇక పట్టించుకోవడం మానేస్తారు. ఈ మాటలు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కరెక్టుగా వర్తిస్తాయి. పదవి నుంచి దూరమైన చివరి రోజున ట్రంప్ ఒంటరిగా మిగిలి పోయారు. కుటుంబసభ్యులు, కొద్దిమంది సహచరులు తప్ప ఆయన వెంట ఎవరూ లేరు.
రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా,కనీస సంప్రదాయాలు పాటించని వ్యక్తిగా , సహచరులకు పిలుపునిచ్చి కాపిటల్ భవనం పై దాడి చేయించిన అప్రజాస్వామ్య వాదిగా ట్రంప్ చరిత్రకెక్కారు. ఏ రాజకీయ అనుభవం లేకున్నా, ప్రభుత్వ పరంగా ఎలాంటి పదవి చేపట్టకున్నా .. రిపబ్లిక్ పార్టీ తరపున పోటీచేసి అధ్యక్షునిగా గెలిచారు. కానీ ఎక్కడా హుందాతనం పాటించని వ్యక్తిగా మిగిలి పోయారు. కొత్త అధ్యక్షుడిని కలసి అభినందనలు కూడా చెప్పలేదు. ప్రమాణ స్వీకారానికి దూరంగా వెళ్లిపోయారు. అసలు చివరి వరకు బైడెన్ గెలుపును గుర్తించని అహంభావాన్ని ప్రదర్శించారు.
ఓటమిని అంగీకరించని ట్రంప్ విధిలేని పరిస్థితుల్లో శ్వేతసౌధం ఖాళీ చేశారు. లేకుంటే బలవంతంగా తెచ్చి బయట పడేస్తారేమో అని భయపడి వైట్ హౌస్ వీడారు. అధ్యక్షుడు మాత్రమే వినియోగించే హెలికాఫ్టర్ లో ఫ్లోరిడా వెళ్లారు. పదవినుంచి దిగిపోయాక అయినా సొంత విమానం లో వెళితే గౌరవంగా ఉండేది.ట్రంప్ తమ పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పుకునేందుకు సొంత పార్టీ కూడా సిగ్గు పడుతోంది. ఆయన చేసిన ఘన కార్యాలకు పార్టీ ఆయనను దూరం గా పెట్టింది. ఈ క్రమంలోనే ట్రంప్ సొంత పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. అమెరికన్ ఓటర్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
—————– KNM