చందమామపైకి ప్రయాణం వాయిదా!

Sharing is Caring...

Artemis 1…………………………………………………..

చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రయోగంలో భాగమే ఆర్టెమిస్‌ ప్రాజెక్టు 1. నాసా ప్రయోగించాలనుకున్న అతి శక్తివంతమైన ఈ రాకెట్‌ ప్రయోగం  ఆగస్టులో జరగాల్సిఉండగా అప్పట్లో సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. సెప్టెంబర్‌లో ఇంధన లీకేజీ కారణంగా వాయిదా పడింది. మూడో సారి ఇయాన్‌ తుపాను మూలంగా వాయిదా పడింది. దీంతో నవంబర్ 12-27 మధ్య ప్రయోగం జరగవచ్చని తెలుస్తోంది. 

50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమాన్ని నాసా చేపట్టింది. గతంలో మాదిరిగా నామమాత్రపు సందర్శనలతో సరిపుచ్చకుండా జాబిలి పై శాశ్వత ఆవాసానికి గల అవకాశాలను పరిశీలించనుంది. అందుకోసం లోతైన పరిశోధనలు చేయనుంది.

ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. చందమామను చుట్టివచ్చే ఈ స్పేస్ షిప్ లో వ్యోమగాములు ఉండరు. తదుపరి ప్రయోగాలు 2,3 మాత్రం మానవ సహితంగా సాగుతాయి.

1960లలో చందమామపైకి మానవ సహిత యాత్రలు నిర్వహించడానికి అమెరికా ‘అపోలో’ ప్రాజెక్టును చేపట్టింది. అయితే  అప్పట్లో  సైన్స్ పరిశోధనల కోసం కాకుండా సోవియట్ యూనియన్ పై పైచేయి సాధించడమే లక్ష్యంగా అమెరికా వీటిని నిర్వహించింది.

జాబిలి పైకి 1969లో మొదలైన మానవ సహిత యాత్రలు 1972లో ముగిశాయి. ఏ యాత్రలోనూ వ్యోమగాములు మూడు రోజులకు మించి చందమామపై గడపలేదు.అయితే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయి. భూకక్ష్యకు వెలుపల లోతైన పరిశోధనలు చేయాలన్న ఆసక్తి శాస్త్రవేత్తలకు పెరిగింది.

చందమామ, అంగారకుడు, ఆ వెలుపలి ఖగోళ వస్తువులపై కాలనీల ఏర్పాటుకు అవకాశాల అన్వేషణకు పరిశోధకులు సిద్ధమవుతున్నారు.ఇందులో భాగంగా వచ్చే పదేళ్లలో చంద్రుడిపై పై దీర్ఘకాల ఆవాసాలను ఏర్పాటు చేయాలని నాసా భావిస్తోంది.

వంతులవారీగా వ్యోమగాములను అక్కడ ఉంచాలని భావిస్తోంది.చంద్రుడి ఉపరితలం నుంచి నీరు, ఇతర వనరులను ఒడిసిపట్టాలనుకుంటోంది. అంతిమంగా అంగారకుడిపై కాలనీలు ఏర్పాటు చేయడానికి ఈ ఫలితాలు దోహదపడతాయని అంచనా వేస్తోంది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!