Pudota Showreelu ……………………………….
మన దేశానికి దక్షిణాన హిందూ మహా సముద్రంలో ఒక చిన్న ద్వీపం. అదే పంబన్ ద్వీపం.ఈ ద్వీపంలోనే రామేశ్వరం దేవాలయం ఉంది.దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టి,పెరిగిన నేలఇది. నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లో ప్రపంచంలోనే ప్రమాదకరమైన రైల్ బ్రిడ్జ్ ప్రయాణాలను చూపిస్తూ అందులో పంబన్ బ్రిడ్జ్ మీదుగా రైలు ప్రయాణించటం చూపించారు. అప్పటినుండి పంబన్ బ్రిడ్జ్ పై రైలు ప్రయాణం చేయాలని కోరిక. ఈ రైలు బ్రిడ్జ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఎపుడో అనుకుంటే ఇన్నాళ్లకు మా ప్రయాణంలో ఈ రైలు ప్రయాణం గూడా చేరింది.
మా బృందమంతా తంజావూరు బృహదీశ్వరాలయం చూసి రాత్రి 11 గంటలకు స్టేషన్ లో తిరుపతి-రామేశ్వరం రైలుఎక్కాము.ఈ రైలు పొద్దున ఏడు,ఏడున్నర కల్లా పంబన్ బ్రిడ్జ్ మీదకు చేరుకుంటుంది.నేనూ మా వాళ్ళందరికీ ఆరున్నరకల్లా లేచి రెడీ అయి కిటికీల దగ్గర కూర్చోండి అని చెప్పాను. సముద్రం మీద కట్టిన బ్రిడ్జ్ మీద రైలు ఎలా పోతుందో చూడొచ్చు అన్నాను. ఇది మన గోదావరి మీద కట్టిన బ్రిడ్జ్ లాంటిది కాదు.ఈ వంతెనకు అటు ఇటు ఎలాంటి రక్షణ గోడలు వుండవు.భారతభూభాగం నుండి హిందూ మహ సముద్రంలో వుండే పంబన్ ద్వీపాన్ని ఈ రైల్ బ్రిడ్జ్ కలుపుతుంది.అలాగే రోడ్ బ్రిడ్జ్ కూడా వుంది.మనకు రైల్లో నుండి కనిపిస్తుంది అని చెప్పాను.ఆరున్నరకల్లా మేము ఎనిమిదిమందిమి లేచి కిటికీల దగ్గర చేరాము.కాసేపటికి రైలు మండపం అనే స్టేషన్ చేరింది.అక్కడినుండి మెల్లిగా పంబన్ వైపు బయలుదేరింది.మాకు దూరంగా, జాలరుల గుడిసెలు,వాళ్ళ పడవలు,సముద్రం కనిపిస్తున్నాయి.కాసేపటిలో రైలు పంబన్ బ్రిడ్జ్ మీదకు చేరింది రైలు. చాలా నెమ్మదిగా కదులుతుంది.సముద్రంలో పెద్ద పెద్ద అలలు,అలల హోరు,చేపలు పట్టే జాలరులు, దూరంగా పెద్దపెద్ద నౌకలు కనిపిస్తున్నాయి. ఇంతలో రైలు నౌకలు వెళ్ళేందుకు వీలుగా బ్రిడ్జ్ రెండుగా చీలిపోయి దారి ఇచ్చే ప్రాంతానికి చేరింది..ఆ ప్రాంతాన్ని చూసాము. అందరిలో ఏదో ఉద్విగ్నత.
ఇంతలో సావిత్రి” ఇప్పుడు పెద్ద తుఫాను వచ్చి ఈ రైలు పడిపోతే ..”అన్నది.వెంటనే లక్ష్మిఅందుకుని ”మీరూరుకోండి. సావిత్రక్కా .. అక్కా నువ్వు చెప్పు ఈ బ్రిడ్జ్ విశేషాలు’అన్నది.మా గ్రూప్ లోని మగవాళ్ళంతా తలుపుల దగ్గర నిలబడి సముద్రాన్ని చూస్తున్నారు.
”నిజమే సావిత్రి అన్నట్లు 1964 డిశెంబర్ 22 న అదే జరిగింది.అప్పుడు భయంకరంగా వచ్చిన తుఫాన్ లో ధనుష్కోటి వెళ్తున్న పాసింజర్ రైలు సముద్రంలో పడి .. కొట్టుకుపోయింది. రైలులోని 115 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. అప్పుడు పడిపోయిన రైల్వే స్టేషన్ మొండిగోడలు ఇప్పటికీ వున్నాయి.రేపు మనం ధనుష్కోటి వెళ్ళినపుడు చూపిస్తాను. ఇప్పుడు అంత భయపడాల్సిన పని లేదు.రైల్వే గాంగ్ మెన్ ఈ ట్రాక్ ను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూస్తుంటారు.సముద్రపు ఉప్పుకు గురైన పట్టాల తుప్పును ఎప్పటికప్పుడు శుభ్రం చేసి రంగు వేస్తుంటారు.2.065 కీ.మీ ఉన్న ఈ ట్రాక్ ని వాళ్ళు తమ కన్నబిడ్డలా చూసుకోబట్టే రోజు రైళ్లు సురక్షితంగా రామేశ్వరం వెళ్ళి రాగలుగుతున్నాయి..సరే లేవండి మనం గూడా తలుపు దగ్గరకు వెళ్ళి చూద్దాం”అన్నాను.
సావిత్రి ‘అమ్మో..నాకు భయం.నేనిక్కడే కూర్చుంటా.మీరు వెళ్ళండి.”అంది..తలుపు దగ్గరకు చేరిన మాకు బ్రిడ్జ్ మీద పోతున్న రైలు… కింద పెద్ద పెద్ద అలలు చేసే ఘోష వినిపిస్తోంది. సముద్రుడు మాలో భావోద్వేగాలను రేకిత్తిస్తున్నాడు.పక్కన రక్షణ గోడలు లేనందున రైలు ధడధడ శబ్దం చేయడం లేదు.రైలు చాలా మెల్లగా వెళ్తుంది.తలుపు దగ్గర నిలబడ్డ మమ్మల్ని చూసి జాలరులు చేతులు వూపుతున్నారు.మేము అంతే హుషారుగా సమాధానం చెప్పాము..దూరంగా రోడ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది.ఈ ఇందిరాగాంధి రోడ్ వంతెన nh-49 ని రామేశ్వరం తో కలుపుతుంది.
సముద్రపు బ్రిడ్జ్ మీద రైలు ప్రయాణం ముగిసింది.ఒక కోరిక తీరింది.రైలు పంబన్ స్టేషన్ లో ఆగింది.చిన్న స్టేషన్.జాలరులు ఎక్కువగా వుండే గ్రామం రైలు భారత భూభాగం మీద నుండి పంబన్ ద్వీపం లో అడుగు పెట్టింది.తిరిగి రైలు కూత వేసి రామేశ్వరం వైపుగా సాగిపోయింది. పావుగంటలో రామేశ్వరం స్టేషన్ వచ్చింది.ఈ పంబన్ బ్రిడ్జి పై రైలు ప్రయాణం ..ఒక అరుదైన అనుభవాన్ని .. అద్భుతమైన జ్ఞాపకాన్ని అందించింది. అవకాశం ఉంటే మీరు అలాంటి అనుభవాలను సొంత చేసుకోండి.
pl. read it also ……… పంబన్ బ్రిడ్జి పై ప్రయాణమంటే..ఒక థ్రిల్లింగ్ అనుభవం !