తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం జరిగిన తవ్వకాలలో రాక్షస గూళ్ళు బయట పడ్డాయి. వేల ఏళ్ళ క్రితం నాటి గిరిజన తెగల సమాధులే ఈ రాక్షస గూళ్ళు అని చరిత్రకారులు నిర్ణయించారు. అయితే ఈ రాక్షస గూళ్ళ మీద పెద్ద గా పరిశోధనలు జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో వీటి ఆనవాళ్లను కూడా పురాతత్వ శాఖ పరిరక్షించలేకపోయింది.
అప్పట్లో మరణి౦చిన వ్యక్తి శరీరాన్ని నేలలో పాతి పెట్టి, మూడు పెద్ద రాళ్ళు తెచ్చి ఆ సమాధిపైన పొయ్యి గూడు ఆకార౦లో నిలిపేవాళ్లు. వీటిని చారిత్రిక పరిభాషలో కైరన్ల౦టారు. డాల్మేన్లు అని కూడా పిలుస్తారు. ఈ సమాధులకు వాడిన రాళ్ళను బట్టే, అవి వాడిన కాలాన్ని పెద్దరాతి యుగ౦ లేదా బృహత్ శిలా యుగమని చెప్పేవాళ్ళు.
మరికొన్ని ప్రాంతాలలో మృతదేహాన్ని పెద్ద కుండలో ఉంచి దాని పై పెద్ద పెద్ద బండరాళ్లు పెట్టేవారు.వాటి చుట్టూ పాదు చేసినట్లు రాళ్లను పేర్చేవారు. ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా సమాధి చేసే వారు. ఈ సమాధులను స్థానిక౦గా రాక్షస గూళ్ళు అని , వీరగూళ్ళు, వీరకల్లులని కూడా పిలిచే వారు.
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం లోని మణికేశ్వరం కొండపై కొన్ని రాక్షస గూళ్ళు బయటపడ్డాయి. ఇవన్నీ గిరిజన తండాల సమాధులు. ఇవి 5 శతాబ్దం నాటివని భావిస్తున్నారు. మణికేశ్వరం కొండపై..గిరిజనులు వాడిన రోలు.. తదనంతరకాలానికి చెందిన ఆయక స్థంబాలుగా పిలిచే వివిధ రకాల రాళ్ళు బయట పడ్డాయి. వీటిపై పురావస్తు శాఖ లోతుగా అధ్యయనం చేయలేదనే విమర్శలున్నాయి.
అలాగే అద్దంకి దగ్గర్లోని ధర్మవరం గ్రామం లోకూడా రాతి సమాధులు.. కుండ పెంకులు, మానవ అస్థిపంజరం అవశేషాలు బయట పడ్డాయి.. ఇవి గాక.. 500 అడుగుల ఎత్తు లో ఉన్న ఏడుకొండల శిల ప్రాంతంలో క్రీస్తు శకం 2 వ శతాబ్దం కాలం నాటి జైన స్థావరాలు బయటపడ్డాయి. చుట్టు పెద్ద రాళ్లతో నిర్మించిన స్థూపాకారపు కట్టడం, ఇటుక నిర్మాణాలు లభించాయి. ఇవన్నీ రెండో శతాబ్దం నాటి దిగంబరులైన యాపనీయ శాఖకు చెందిన జైన సన్యాసుల స్థావరాలని పరిశోధకులు గుర్తించారు.
కాగా బల్లికురవ మండలం కొణిదెనలో క్రీసు శకం 3వ శతాబ్దం కాలం నాటి బౌద్ధ స్థూపాలు బయట పడ్డాయి. ఇక్కడ ఆ కాలం నాటి పెద్ద ఇటుకలు, 42 శాసనాలు లబించాయి. ఈ చారిత్రిక ఆనవాళ్ల గురించి ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. ఈ ప్రాంతంలో గుప్త నిధులు దొరుకుతాయనే అపోహతో అనేక సార్లు దుండగులు త్రవ్వకాలు జరిపారు.
కొన్ని సమాధులను పరిశీలించిన చరిత్రకారులు ఇవి సిధియన్ల సమాధుల మాదిరి ఉన్నాయని అభిప్రాయ పడ్డారు. ఈ సమాధుల్లో దొరికిన కు౦డల మీద గుర్తులు, సి౦ధూ లిపిని పోలి ఉన్నాయని చెప్పారు.వాటిలో దొరికిన రాతి పనిముట్లు కనీస౦ 3,000 ఏళ్ళ నాటివి కావచ్చు అంటున్నారు. సింగరకొండ వద్ద చందవరం సైట్ లో పురాతన బౌద్ధమఠం ఆనవాళ్లు కూడా లభించాయి.
———— KNM
PL.READ IT ALSO ………………. చరిత్ర చెబుతున్న సమాధులు (2)