Titan Tragedy…………………
టైటానిక్ (Titanic) షిప్ శిథిలాలను చూడటానికి వెళ్లిన సాహసికుల ప్రయాణం విషాదాంతమైంది. కొన్ని గంటల్లోనే తిరిగి వస్తామని భావించిన ఆ ప్రయాణికుల కల చెదిరిపోయింది.వేల అడుగుల లోతులోకి వెళ్లిన ఐదుగురు సాహసికులు జలాంతర్గామి విచ్ఛిన్నం కావడంతో ప్రాణాలు కోల్పోయారు.
సముద్ర గర్భంలో సుమారు 13వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శిథిలాలను చూసి వచ్చేందుకు టైటాన్ మినీ జలాంతర్గామికి సుమారు ఏడు గంటలు పడుతుంది. ఓషనేట్ నిర్వాహకులు ఆన్ లైన్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఆదివారం ఉదయం 8 గంటలకు (బ్రిటన్ కాలమాన ప్రకారం) టైటాన్ తన ప్రయాణాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కానీ, కొన్ని కారణాలతో ఆ మధ్యాహ్నం 12 గంటలకు సముద్ర గర్భంలోకి దిగడం ప్రారంభించింది. అలా వెళ్లిన 1.45 గంటల తర్వాత ఉపరితలంపై ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థతో టైటాన్ తన సంబంధాలను కోల్పోయింది. సాయంత్రం 7 గంటల వరకు నీటి ఉపరితలానికి తిరిగి చేరుకోవాల్సి ఉండగా అలా జరగలేదు.
ఈ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తున్న ఉపరితంలపై ఉన్న పోలార్ ప్రిన్స్ నౌక.. టైటాన్ ఆచూకీ లభించడం లేదనే విషయాన్ని రాత్రి 9.30 గంటలకు అమెరికా కోస్ట్ గార్డుకు తెలియజేసింది. దీంతో యూఎస్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది.సోమవారం ఉదయం రంగంలోకి దిగిన అమెరికా, కెనడా విమానాలు, నౌకలతో పాటు ఇతర ప్రైవేటు నౌకలు కూడా రెస్క్యూలో పాల్గొన్నాయి.
మంగళవారం మధ్యాహ్నం.. తాము కూడా రెస్క్యూలో సాయం చేస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది. అత్యంత లోతుకు వెళ్లగలిగే అటలాంటే (Atalante) రోబో లను పంపుతామని చెప్పింది. అదే రోజు సముద్ర గర్భంలో కొన్ని శబ్దాలను కెనడా ఎయిర్ క్రాఫ్ట్ గుర్తించింది. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఇవి వినిపిస్తున్నట్లు చెప్పింది. బుధవారం రెస్క్యూ ఆపరేషన్ మరింత ముమ్మరమైంది.
అమెరికా కోస్ట్ గార్డుతో పాటు యూఎస్ నేవీ, కెనడా కోస్ట్ గార్డ్, ఓషనేట్ సిబ్బంది కూడా ఆపరేషన్ పై పట్టుసాధించాయి. అదేరోజు సముద్రగర్భంలో మళ్లీ కొన్ని శబ్దాలు వినిపిస్తున్నట్లు గుర్తించారు.ఆ ప్రాంతానికి రీమోట్లీ ఆపరేటెడ్ వెహికిల్ (rgv )ను పంపించి గాలింపు చేపట్టారు. అదేరోజు సాయంత్రం ఫ్రాన్స్ రోబో కూడా రెస్క్యూ ప్రదేశానికి వచ్చింది.
గురువారం ఉదయానికి రెస్క్యూ ఆపరేషన్ కీలక ఘట్టానికి చేరుకుంది. మినీ జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ కొన్ని గంటలకే సరిపడా ఉంది. ఈ క్రమంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలకు రెండు rgv లను రంగంలోకి దించారు.కొంత సేపటికి రెస్క్యూ ప్రాంతానికి వైద్యుల బృందంతో కూడిన కెనడా నేవీ నౌక చేరుకుంది.
సెర్చ్ చేస్తున్న ప్రాంతంలోనే శకలాలు కనుగొన్నామని 3.48 గంటలకు అమెరికా కోస్ట్ గార్డ్ వెల్లడించింది. మరికొన్ని గంటలకు మీడియా సమావేశం నిర్వహించి.. టైటాన్ విచ్ఛిన్నం కావడంతో అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని ప్రకటించింది. మినీ జలాంతర్గామి తోక భాగంతో పాటు ల్యాండింగ్ ఫ్రేమ్స్ దొరకడం తో టైటాన్ విచ్ఛిన్నమైందనే నిర్ధారణకు వచ్చారు.
అయితే, అందులో ఐదుగురి శరీర భాగాలకు సంబంధించి మాత్రం ఎటువంటి ఆచూకీ లభించలేదు.టైటాన్ మినీ జలాంతర్గామిలో ఓషనేట్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి స్టాక్టన్ రష్, ఆయనతో పాటు వెళ్లిన షెహ్ దావూద్, సులేమాన్ దావూద్, హమీష్ హర్డింగ్, పాల్ హెన్రీలు ప్రాణాలు కోల్పోయినట్లు ‘ఓషన్ గే ట్ ఎక్స్‌పెడిషన్స్ ‘ కూడా ప్రకటించింది.