ట్విటర్‌కు పోటీగా ‘థ్రెడ్స్‌’ !!

Sharing is Caring...

Competetion ………………………………..  

ఎలాన్‌ మస్క్‌ సారధ్యంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.దీని పేరే థ్రెడ్స్… టెక్ట్స్‌ ఆధారిత యాప్‌ గురువారం నుంచి ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చింది.

ఈ థ్రెడ్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. యాప్‌ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20లక్షల మంది ఇందులో ఖాతాలు తెరవగా.. ఆసంఖ్య క్రమంగా 50లక్షలకు పెరగడం విశేషం.అక్కడితో ఆగలేదు….  ఇంకా దూసుకుపోతోంది. .
ఈ స్పందన పట్ల మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంతోషంగా ఉన్నారు. ట్విటర్‌ తరహా ఫీచర్లతో ఉండే ఈ యాప్‌ను మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా తీసుకొచ్చారు. కొత్త యాప్‌పై ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు తమ యూజర్‌ నేమ్‌ కొనసాగించొచ్చు.

త్వరలోనే ట్విటర్‌ ఖాతాదారుల సంఖ్యను ‘థ్రెడ్స్‌’ మించిపోయే అవకాశాలున్నాయి. ఇక ఇన్‌స్టాలో అనుసరిస్తున్న ఖాతాలను, కొత్త యాప్‌పైనా అనుసరించే సౌలభ్యం ఉంది. టెక్ట్స్‌ రూపంలో ఉన్న పోస్టులను లైక్‌ చేయొచ్చు. కామెంట్‌ చేయడంతో పాటు ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది.

థ్రెడ్స్‌ను పరిచయం చేస్తూ మెటా సీఈఓ జుకర్‌బర్గ్‌.. ”సంభాషణలు జరిపేందుకు స్నేహపూర్వమైన పబ్లిక్‌ స్పేస్‌ ఇది. టెక్స్ట్‌ సంభాషణలు చేసుకునేవారికి ఇదో కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి ఇలాంటి స్నేహపూర్వక కమ్యూనిటీ అవసరం ఉంది. థ్రెడ్స్‌ ఆ సౌలభ్యాన్ని కల్పిస్తుంది” అంటున్నారు..

ఇక ఖాతాదారుల సంఖ్యలో ట్విటర్‌ను ‘థ్రెడ్స్‌’ మించిపోనుందనే వార్తలపై జుకర్‌బర్గ్‌ మాట్లాడుతూ . ”దీనికి కొంత సమయం పట్టొచ్చు. అయితే, వంద కోట్ల మంది ఖాతాదారులతో ఓ పబ్లిక్‌ కన్వర్జేషన్‌ యాప్‌ ఉండాలని నేను భావిస్తున్నా. ట్విటర్‌కు ఆ అవకాశం వచ్చినా.. అది సద్వినియోగం చేసుకోలేకపోయింది. మేం ఆ ఘనత సాధిస్తామని నమ్ముతున్నాం” అని చెబుతున్నారు.

ట్విటర్‌కు పోటీగా తీసుకొచ్చిన ఈ యాప్‌పై ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. పూర్తిగా ట్విటర్‌ను పోలినట్లుగా కాపీ ..పేస్ట్ యాప్‌ను తీసుకొచ్చారు అన్నట్టుగా మాట్లాడారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!