ఆఇద్దరు జైల్లో ఉండే ఎన్నికల్లో గెలిచారా?

Sharing is Caring...

They won the election but did not take oath………….

2024 లోకసభ ఎన్నికల్లో జైలు ఉండి  పోటీ చేసి విజయం సాధించిన వ్యక్తులు ఇద్దరున్నారు. వీరిద్దరూ ఇంకా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. వీరిలో  ఖలిస్తాన్‌ మద్దతుదారుడు ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్  అమృత్‌పాల్ సింగ్ ఒకరు .. కాగా మరొకరు అబ్దుల్ రషీద్ షేక్ అలియాస్ ఇంజినీర్ రషీద్.. వీరిద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు.

అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌ కి చెందినవారు. ఈయన ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి  ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి  విజయం సాధించారు.ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జిరా పై 1,97,120 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అమృత్‌పాల్ సింగ్ తరపున ఆయన సోదరుడు, తల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

గత ఏడాది జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు..ఇటీవలే మరో ఏడాది పాటు నిర్బంధాన్ని పొడిగించారు. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్ సింగ్  ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళలేదు. మధ్యంతర బెయిల్‌ పొందటానికి  ఈయనకు అర్హత ఉంది.. అయితే  జాతీయ భద్రతా చట్టం కారణంగా ఆయన బెయిల్‌ కోసం స్పెషల్ గా అప్పీల్ చేసుకోవాలి. కోర్టు అనుమతి ఇస్తే వెళ్లి ప్రత్యేక పోలీసుల పర్యవేక్షణలో లోకసభకు వెళ్లి ప్రమాణం చేయాలి.

ఇక అబ్దుల్ రషీద్ షేక్ అలియాస్ ఇంజినీర్ రషీద్ కశ్మీర్‌కి చెందినవారు. కశ్మీర్లో ని బారాముల్లా స్థానం నుంచి  ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. రషీద్  జైలునుంచి నామినేషన్ దాఖలు చేసారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

రషీద్  జైలులో ఉండడంతో ఆయన కుమారుడు అబ్రర్ రషీద్, స్నేహితులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. రషీద్ పై టెర్రరిస్ట్ కార్యకలాపాలకు నిధులు అందించారనే ఆరోపణలున్నాయి.ఇంజినీర్ రషీద్‌ను చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద 2019 లోనే  పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం రషీద్ తీహార్ జైలులో ఉన్నారు. ఎంపీగా ప్రమాణం చేయడానికి ఇంజినీర్ రషీద్ దిల్లీ కోర్టులో మధ్యంతర బెయిల్‌కి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

జైలులో ఉన్నఈ ఇద్దరు చట్ట సభలకు ఎంపికైనారు కాబట్టి  రాజ్యాంగం ప్రకారం ప్రమాణస్వీకారం చేసే హక్కు వారికి ఉంటుంది.  ఇతర చట్ట సభ్యుల మాదిరిగానే ఈ ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయవచ్చు.  జైలు అధికారుల ఎస్కార్ట్ తో పార్లమెంట్ కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలి.  ఆ తర్వాత మళ్ళీ  జైలుకు రావాల్సి ఉంటుంది. 

ఎంపీగా ప్రమాణం చేసినప్పటికీ కూడా కారాగారంలో  ఉన్న కారణంగా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉండదు. కోర్టు ప్రత్యేక అనుమతి ఇస్తే వెళ్ళవచ్చు.  ఒక వేళ నేర నిరూపణ జరిగి .. కోర్టు  వారికి శిక్ష విధించిన పక్షంలో.. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడితే మటుకు ఆ చట్ట సభ్యులు తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. పై కోర్టుకు వెళ్లే అవకాశం ఇస్తారు.  గతంలో జార్జి ఫెర్నాండెజ్ కూడా జైలులో ఉండే ఎన్నికల్లో గెలిచారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!