ఆ ఇద్దరూ పాత్రల్లో ఇమిడిపోయారు !

Sharing is Caring...

Thalaivi …………………………..

సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదలైన ‘తలైవి’ సినిమా  ఇప్పుడు  అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత  జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా డైరెక్టర్  ఎ.ఎల్‌. విజయ్‌ తీసిన సినిమా ఇది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్  నటించగా .. తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్‌ పాత్రను  అరవింద్‌ స్వామి పోషించారు. అరవింద్ స్వామి ఎంజీఆర్ గా బాగా సూట్ అయ్యారు. ఇద్దరు పోటాపోటీగా నటించారు. జయ పాత్రలో కంగనా ఒదిగిపోయింది.

జయ సినీ జీవితం ప్రారంభం ..ఇష్టం లేని  రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ? ఎంజీఆర్ తో ఏర్పడిన అనుబంధం …  ఎంజీ ఆర్ మరణం .. సీఎం అవకముందు  రాజకీయ పరిణామాల చుట్టూ కథ నడుస్తుంది. దర్శకుడు పాత్రలకు తగినట్టుగా నటులను ఎంపిక చేసుకున్నారు. జయ రాజకీయాలలోకి రావడానికి కారణమైన మధ్యాహ్నభోజనం పధకం అమలు అవుతున్నతీరుపై చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి. 

అలాగే పిల్లవాడు జయను అమ్మ అని పిలిచినప్పుడు ఎమోషనల్ గా ఫీలైన దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయి . ఎంజీఆర్ .. జయ ఇద్దరూ ఫోన్ రిసీవర్ ఎత్తుకుని మాట్లాడకుండా మూగగా నిలిచి పోయిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.  కంగనా రౌనత్ పలు సన్నివేశాల్లో భావోద్వేగాలను చక్కగా ప్రదర్శించారు. సినిమాలో అన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఎంజీఆర్ నమ్మిన బంటు వీరప్పన్ పాత్రలో సముద్రఖని తన సహజమైన చూపులతో బాగా నటించాడు. కరుణ పాత్రలో నాజర్ కూడా బాగానే చేసాడు.

ఇక ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్ స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంజీఆర్ .. జయ పాత్రలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ  విజయ్ కథను నడిపారు.  సొంత పార్టీ నేతలే కుట్ర చేయడం, జయను ను రాజ్య సభకి పంపడం..  అక్కడ జయ ఆంగ్లంలో మాట్లాడే సన్నివేశాలు ఆడియన్స్ ను హత్తుకుంటాయి. ఎంజీఆర్ అమెరికా లో ఉన్న సమయంలో ఎన్నికలు రావడం … జయ ప్రచారం .. పార్టీ గెలిచాక ఆమెను  విస్మరించడం వంటి సీన్స్ కూడా బాగా తీశారు. 

ఎంజీఆర్‌ మరణం తర్వాత చోటు చేసుకునే పరిణామాలు … అసెంబ్లీ లో జయకు జరిగిన అవమానం … ఆమె శపథం చేయడం వంటి సీన్స్ ను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.  ‘నమ్మి వస్తే అమ్మ.. లేదంటే ఆదిశక్తి’ అంటూ అమ్మలో ఉన్నరెండో కోణాన్ని కూడా చూపించిన తీరు బాగుంది. విశాల్ విట్టల్ కెమెరా పనితనం ప్రశంసనీయం.జీవి ప్రకాశ్ కుమార్ నేపధ్య సంగీతం ఆకట్టు కుంటుంది. ఎక్కడా అసభ్యం .. అశ్లీలం లేవు . కుటుంబంతో చూడవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!