India’s first cowboy …………
సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కౌబాయ్ ట్రెండ్‌ను పరిచయం చేసి సరికొత్త ఒరవడిని సృష్టించారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ వంటి చిత్రాలతో హాలీవుడ్ తరహా యాక్షన్ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసి వారిని మంత్రముగ్ధులను చేశారు. ఆ గెటప్‌లో ఆయన చూపించిన స్టైల్, మేనరిజమ్స్ అభిమానుల గుండెల్లో ఆయనకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాయి.
హాలీవుడ్ నటులు క్లింట్ ఈస్ట్‌వుడ్, గ్రెగొరీ పెక్ నటనా శైలిని స్ఫూర్తిగా తీసుకుని సూపర్ స్టార్ కృష్ణ తన కౌబాయ్ వేషధారణను రూపొందించుకున్నారు. ఆ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలను ఆయన ఎన్నోసార్లు చూసారు. అపుడే ఆయనకు కౌబాయ్ పాత్ర చేయాలన్న కోరిక కలిగింది. పాత్ర గెటప్ కూడా మైండ్ లో ఖరారు చేసుకున్నారు. ఆ సినిమానే ‘మోసగాళ్లకు మోసగాడు’. ఆయన అనుకున్నదే తడవుగా ఆ సినిమా పనులు చకచకా జరిగిపోయాయి.
ఆ సినిమాలో పొడవాటి బూట్లు, తలకు హ్యాట్, మెడ చుట్టూ ఒక రుమాల్, నడుముకు రెండు వైపులా తుపాకులు (రివాల్వర్లు) ఉన్నబెల్ట్ ఆయన ట్రేడ్‌మార్క్‌గా మారాయి. సరికొత్త గెటప్ లో కృష్ణ తెరపై మెరిశారు. కౌబాయ్ దుస్తుల కోసం ప్రత్యేకంగా లెదర్ జాకెట్లు, గరుకైన క్లోత్ ప్యాంట్లు వాడారు. ఆ కాలంలో తెలుగు సినిమాల్లో ఇలాంటి వెస్ట్రన్ లుక్ ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు.
అలాగే కృష్ణ రిస్క్ తీసుకుని, డూప్ లేకుండా వేగంగా గుర్రాన్ని నడుపుతూ షూటింగ్స్ చేసేవారు. ఆయన గుర్రం మీద కూర్చునే స్టైల్ చూసి అభిమానులు పరవశించిపోయేవారు..తుపాకీని తిప్పుతూ ఒరలో పెట్టే ఆయన వేగం, మేనరిజం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీని కోసం ఆయన గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసేవారు.
‘మోసగాళ్లకు మోసగాడు’ తర్వాత మార్కెట్లో ‘కృష్ణ హ్యాట్స్’ విపరీతమైన క్రేజ్ సంపాదించాయి. అప్పట్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలామంది ఆ టోపీలను కొనుగోలు చేసేవారు.
సూపర్ స్టార్ కృష్ణను కౌబాయ్‌గా వెండితెరపై ఆవిష్కరించడంలో ప్రముఖ దర్శకుడు కె.ఎస్.ఆర్. దాస్ అత్యంత కీలక పాత్ర పోషించారు. కృష్ణను కౌబాయ్‌గా ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు దాస్. హాలీవుడ్ శైలిలో కృష్ణ బాడీ లాంగ్వేజ్‌ను, రివాల్వర్ వాడే విధానాన్ని అద్భుతంగా డిజైన్ చేశారు.
‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి శక్తివంతమైన కథ , స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా, కృష్ణ పాత్ర చిత్రణ లో రచయిత ఆరుద్ర ఎంతో కృషి చేశారు. మోసగాళ్లకు మోసగాడు చిత్ర కథకు స్ఫూర్తి నిచ్చిన గుడ్ ,బ్యాడ్ అండ్ అగ్లీ. మెకన్నాస్ గోల్డ్, ఫ్యూ డాలర్స్ మోర్ హాలీవుడ్ సినిమాలను ఆరుద్ర తో కలసి కృష్ణ చూసారు.
తనకు ఏ విధమైన కథ కావాలో, తన గెటప్ ఎలా ఉండాలో తెలుగు నేటివిటీ కి ఎంత దగ్గరగా ఉండాలో అన్ని ఆరుద్రకు వివరించారు.నెలరోజుల లోపలే స్క్రిప్ట్ తయారైంది. నిజానికి కృష్ణ ఈ సినిమాకు ఆరుద్ర నే దర్శకత్వం వహించమని కోరారు, కానీ ఆయన నిరాకరించడంతో ఆ బాధ్యత కె.ఎస్.ఆర్. దాస్‌కు దక్కింది.
దాస్ రంగంలోకి దిగాక సన్నివేశాల మార్పు, చేర్పులు జరిగాయి. ఏ పాత్రకు ఎవరిని పెడితే బాగుంటుందో అంచనా వేసుకుని వారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఛాయాగ్రాహకులు వి.ఎస్.ఆర్. స్వామి తో కలసి హాలీవుడ్ సినిమాలను చూసారు.
వి.ఎస్.ఆర్. స్వామి కౌబాయ్ చిత్రాలకు కావలసిన భారీతనాన్ని,ఎడారి లోకేషన్లలో విజువల్స్‌ను అత్యంత ప్రతిభావంతంగా చిత్రీకరించారు. ఏ మాత్రం హాలీవుడ్ చిత్రాలకు తీసిపోకుండా అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు.
మేకప్ మ్యాన్ మాధవరావు,ఆయన టీమ్ కూడా గెటప్ కు తగినట్టు అందరికి మేకప్ చేశారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా షూటింగ్ సమయంలో ఎడారిలో కృష్ణ ముఖం ఎండకు కమిలిపోయినట్టు కనిపించడానికి అప్పట్లో మెటీరియల్ అందుబాటులో లేకపోయినా బఠానీ గింజల పొట్టును ఉపయోగించి మేకప్ వేసి ఆ గెటప్‌కు సహజత్వాన్ని తీసుకొచ్చారు.కౌబాయ్ చిత్రాలకు కావాల్సిన స్టైలిష్ లుక్‌ను కృష్ణ ముఖ కవళికలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
మోసగాళ్లకు మోసగాడు ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ కౌబాయ్ స్టైల్ ను మరెవరూ అనుకరించలేకపోయారు.


