ఈ మురుగేషన్ సామాన్యుడు కాదు !

Sharing is Caring...

రమణ కొంటికర్ల ………………………………………. 

సక్సెస్ స్టోరీలు వినే కొద్దీ విన బుద్ధి అవుతుంటాయేమో. కాలమాన పరిస్థితుల వల్ల అచేతనమైన మెదళ్లను.. హృదయాలను తట్టిలేపి స్ఫూర్తి రగిలిస్తాయేమో..?  అలా అని అవేమంత పెద్ద విజయాలు కాకపోవచ్చు… కానీ పట్టుదల ఉంటే ఏ జీవికి లేని జ్ఞానసంపదను సంతరించుకున్న మనిషి ఏదైనా చేయగలడు అనేందుకు మాత్రం నిదర్శనాలే. అదిగో అలాంటి కథే తమిళనాడుకు చెందిన ఈ పీఎం.మురుగేషన్ స్టోరీ.

ప్రధానమంతి నరేంద్రమోడీ మన్ కీ బాత్ ఉద్ధేశ్యంపై భిన్నవాదనలు వినిపించినా… ఆ మన్ కీ బాత్ లో వినిపించిన ఎన్నో అద్భుతమైన విజయ గాధల్లో ఇదిగో మధురై జిల్లాలోని మేలక్కల్ గ్రామానికి చెందిన మురుగేషన్ అనే రైతు కథ ఇది. 8వ తరగతి డ్రాపవుట్ కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడమంటే గ్రేటే కదా మరి..?!!  

అదీ ఎందుకు పనికిరాదని తీసిపారేసే అరటితొక్కలను రీసైక్లింగ్ చేసి!!  అదే విషయాన్ని తన మన్ కీ బాత్ లో చెప్పుకొచ్చారు మోడీ. పనికిరాదనుకున్న అరటితొక్కల వ్యర్థాల తొలగింపనే పరిష్కారం మాత్రమే చూపడం కాదు… పనికి రాని వ్యర్థాన్ని ఓ ప్రయోజనకారిగా మార్చి… దాన్నివల్ల ఇప్పుడెందరికో ఉపాధి కల్పించే పూర్తి వ్యవసాయాధారిత వ్యాపారాన్ని నెలకొల్పినందుకు మురుగేషన్ ను అభినందించారాయన.

అనుకూలించని ఆర్థిక పరిస్థితులతో కేవలం ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదివి…  ఆ తర్వాత తండ్రితో పొలంబాట పట్టిన మురుగేషన్… తమకున్న రెండున్నరెకరాల వ్యవసాయ భూమిలో వరితో పాటు… అరటితోటలను పెంచేవాడు. కానీ చాలాసార్లు పంటలతో లాభాల కంటే కూడా నష్టాలే చవిచూసిన పరిస్థితుల్లో… ఒక దశలో పెట్టుబడి పెట్టడమే తప్ప వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో వ్యవసాయం ఓ జూదంలా అనిపించినప్పటికీ కృంగిపోలేదు మురుగేషన్.

2008లో అరటితొక్కల పొరలను ఉపయోగకారిగా మార్చి.. వాటిని జనపనార నుంచి జనపతాడును తయారుచేసినట్టుగా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన తట్టింది మురుగేషన్ కి.  ఆ ఆలోచనపై భార్య, కావల్సిన వారందరితో చర్చించాడు. ఆలోచన సరే! కానీ ఆ ముడిపదార్థాన్ని తాననుకున్న రీతిలో ఎలా తయారుచేసేది…?  

అదిగో అక్కడే మురుగేషన్ లో మరో శాస్త్రవేత్త  బయటపడ్డాడు. సైకిల్ చక్రం రిమ్స్, పుల్లలతో ఓ స్పిన్నింగ్ మిషన్ ను తయారుచేసి… అరటితొక్కల నుంచి దారాల్లాంటి పోగులను తయారుచేసే ప్రక్రియ ప్రారంభించి.. దానికి ఏకంగా పేటెంట్ కూడా పొందాడు.  తయారుచేసే క్రమంలో ఎన్నో ప్రయత్నాలు, వైఫల్యాలూ ఎదురయ్యాయి.

ఆ యంత్రాన్ని తయారుచేశాక బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ను అప్రోచయ్యాడు. మరింత సాయం కోసం వారిని అభ్యర్థించాడు. ఆ కౌన్సిల్ ప్రతినిధులు ఆ యంత్రాన్ని చూసి తృప్తి చెందటమే కాకుండా… మురుగేషన్ స్పిన్నింగ్ యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చని ఎందరో రైతులకు సూచనలు కూడా చేశారు.

ఇప్పుడు మురుగేషన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో అరటితొక్కలతో చాపలు, చాటలు, బ్యాగులు, టోపీలు, బుట్టలు ఇలా ఎన్నో తయారవుతున్నాయి. సరిగ్గా దశాబ్దకాలం కింద కేవలం ఐదుగురితో ప్రారంభమైన మురుగేషన్ ఎంఎస్ రోప్స్ ప్రొడక్షన్ సెంటర్ ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వటవృక్షమై.. ఏడాదికి ఒక కోటి యాభైలక్షల రూపాయల టర్నోవర్ తో సుమారు 350 మందికిపైగా ఉపాధి కల్పనా కేంద్రమైంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!