ఈ ఫొటోలో కనిపించే జావెలిన్’ ఏటీజీఎం (యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్)కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ ఆయుధాలను ఎక్కువగా ఉక్రెయిన్ సైనికులు వినియోగిస్తున్నారు. అమెరికా ఈ ఆయుధాలను ఉక్రెయిన్ కి సరఫరా చేసింది. ఉక్రెయిన్ ప్రజలు ఈ ఆయుధాన్ని ‘సెయింట్ జావెలిన్’ అని పిలుస్తున్నారు. దానిపేరు చిరకాలం గుర్తుండిపోయేలా పిల్లలకు ‘జావెలిన్’, ‘జావెలినా’ అనే పేర్లు పెడుతున్నారట.
కొద్దీ రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ఆయుధ తయారీ కర్మాగారాన్నీ సందర్శించారు.ఆ సందర్భంగా పై విషయాల్ని అక్కడి సిబ్బందితో షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత వారిని అభినందించారు. ఈ జావెలిన్.. ట్యాంక్ విధ్వంసక క్షిపణి ని భుజంపై నుంచి శత్రువులకు చెందిన ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు.
దీనిలో ఒక 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంఛ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. ట్యాంక్ విధ్వంసక ఆయుధాన్ని ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ, వేడి వెలువడతాయి. ప్రత్యర్థులు హీట్ సెన్సర్లతో వాటిని గుర్తిస్తారు. కానీ, జావెలిన్లో తొలుత ట్యూబ్ నుంచి ఓ మోటార్ క్షిపణిని బయటకు కొంతదూరం విసురుతుంది. ఆ తర్వాత క్షిపణి మోటార్ పనిచేయడం మొదలుపెట్టి లక్ష్యం వైపు దూసుకెళుతుంది.
దీనిని కంప్యూటర్లో నియంత్రిస్తారు. దీంతో కచ్చితంగా జావెలిన్ ను ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువు గ్రహించలేడు. ఈ లోపు ప్రయోగించిన వారు సురక్షిత ప్రదేశంలో దాక్కోవచ్చు.
సాధారణంగా యుద్ధ ట్యాంకు చుట్టూ బలమైన ఉక్కు కవచాలు ఉంటాయి. దీంతో పాటు పేలుడు పదార్థాలను చిన్నచిన్న పాకెట్స్ లో ఉంచి రియాక్టివ్ ఆర్మర్ కవచాలను అమరుస్తారు.
ఏవైనా క్షిపణి వంటివి ట్యాంకు సమీపానికి వచ్చిన వెంటనే పేలి వాటిని ధ్వంసం చేస్తాయి. పై భాగం ఒక్కటే అతి తక్కువ రక్షణతో ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని జావెలిన్ రెండు రకాలుగా శత్రువుపై దాడి చేసేలా డిజైన్ చేశారు. నేరుగా రెండున్నర మైళ్లలోపు దూరంలోని ప్రత్యర్థి ట్యాంక్ పక్కభాగంపై లేదా పైభాగంపై దాడి చేసేలా ఏర్పాట్లు చేశారు.
పైభాగంపై దాడి చేస్తుంది కాబట్టే దీనికి జావెలిన్ అనే పేరు పెట్టారు. రియాక్టీవ్ఆర్మర్ రక్షణ కవచాలను ఛేదించి.. ట్యాంకును ధ్వంసం చేసేలా దీనిలో రెండు దశల్లో పేలుడు పదార్థాలను అమర్చారు. తొలిదశలో కవచాన్నీ ఛేదించి.. ఆ తర్వాతి దశలో వార్ హెడ్ ట్యాంక్ ను ధ్వంసం చేస్తుంది.
ఈ జావెలిన్ ఆయుధాలను అమెరికాకు చెందిన రక్షణ రంగ దిగ్గజాలు రేథియాన్, లాక్ హీడ్ మార్టిన్ సంస్థలు అభివృద్ధి చేశాయి. అత్యాధునిక సైన్యాల ట్యాంకులకు కూడా ఈ జావెలిన్ల టాప్ మోడ్ అటాక్ నుంచి తప్పించుకోవడం కష్టం. జావెలిన్ల ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువ.జావెలిన్ ఏటీజీఎంలు ఉత్పత్తి చాలా క్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం.
ఈ జావెలిన్ ధర 80వేల డాలర్ల నుంచి 2లక్షల డాలర్ల వరకు ఉంటుంది. అమెరికాలో దీనిని ఉత్పత్తిదారులు అత్యధికంగా ఏటా 6,500 తయారు చేయగలరు.కానీ, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టుల ప్రకారం 2,100 మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.
జావెలిన్ క్షిపణులకు ఉక్రెయిన్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కెనడాకు చెందిన క్రిస్టియన్ బోరిస్ ‘సెయింట్ జావెలిన్’ పేరిట ఓ చిత్రాన్ని సిద్ధం చేశారు. దీనిలో ఒక దేవదూత జావెలిన్ క్షిపణిని పట్టుకొని కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ బొమ్మ ఉన్న వివిధ రకాల వస్తువులను విక్రయించి మార్చి తొలి రెండు వారాల్లో దాదాపు మిలియన్ డాలర్లను సమీకరించారు. ఉక్రెయిన్ సేవా కార్యక్రమాలకు ఆ సొమ్మును వినియోగించనున్నారు. తాజాగా అమెరికా మరో 5వేల జావెలిన్లను ఉక్రెయిన్ పంపుతోంది.