Motupalli flourished in the Kakatiya Empire………………………..
ఏపీలోని బాపట్ల జిల్లా లో ఉన్న ‘మోటుపల్లి’ రెండువేల సంవత్సరాల క్రితమే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ ఓడరేవు పట్టణంగా విరాజిల్లింది. నాటి కాకతీయ సామ్రాజ్యంలో మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవుల ద్వారా సముద్ర వ్యాపారం ఎక్కువగా జరిగింది.
నిత్యం వచ్చీపోయే ఓడలతో మోటుపల్లి రేవు ఎప్పుడూ రద్దీగా ఉండేదని విదేశీ చరిత్రకారులు తమ రచనల్లో ప్రస్తావించారు.ఒక నాటి వాణిజ్య కల్పవల్లిగా విలసిల్లిన మోటు పల్లి ఈనాడు వెల వెల పోతోంది.
సహజ సిద్ధమైన ఓడరేవుగా ప్రసిద్ధి చెందిన మోటుపల్లి కేంద్రంగా అరబ్, చైనా దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు విస్తృతంగా జరిగేవని అంటారు. తూర్పు.. పశ్చిమ ప్రాంతాల నుంచీ నౌకల ద్వారా అనేక వస్తువులు కాకతీయ సామ్రాజ్యంలోకి వచ్చేవి. ఈ క్రమంలో గణపతిదేవ మహారాజు వివిధ ఖండాలు, ద్వీపాలనుంచి సముద్రం మీదుగా వచ్చే వర్తకుల భద్రతకు ఎంతో ప్రాధాన్యమిచ్చాడు.
సముద్రపు దొంగల బారినుంచి వ్యాపారులను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు దేశ, విదేశీ వర్తకులకు ప్రమాద బీమాను కల్పించాడు. అప్పట్లోనే ప్రమాద బీమాను కల్పించారంటే ఆయన ఎంత విజన్ తో పనిచేసారో అర్ధం చేసుకోవచ్చు.
గణపతి దేవుడు తన చిత్తశుద్ధి చాటుకోవడానికి అప్పట్లోనే మోటుపల్లి సముద్రతీరంలో ఉన్న వీరభద్రస్వామి ఆలయ మండపంలో తెలుగు,సంస్కృత భాషల్లో ‘అభయ శాసనం’ వేయించాడు.నాడు అదొక సంచలన విషయం.
మోటుపల్లి ఓడ రేవుద్వారా వారానికి కోటి వరహాల వర్తకం జరిగేదని విదేశీ చరిత్రకారులు తమ గ్రంధాల్లో రాశారు. ఇక్కడినుంచి శ్రీగంధం, పచ్చకర్పూరం,చీనీ కర్పూరం,రత్నాలు, ముత్యాలు, పన్నీరు, దంతాలు, కర్పూర తైలం, రాగి, సీసం, తగరం, పట్టు, పగడం, నార, సుగంధ ద్రవ్యాలు, సన్నని వస్త్రాలు, ధాన్యాలు.. ఇలా ఎన్నెన్నో వస్తువులు అరేబియా, ఈజిప్ట్, ఇటలీ, గ్రీసు, జర్మనీ, రొమేనియా, జపాన్, చీనా, బర్మా, సుమత్ర, జావా, బోర్నియో, సింహళం లాంటి దేశాలకు ఎగుమతి అయ్యేవి అంటారు.
అదే రీతిలో ఆయా దేశాల నుంచీ వస్తువులు దిగుమతి అయ్యేవి. వర్తకం బహుముఖంగా జరిగితేనే రాజ్యానికి ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని గణపతి దేవుడి నమ్మకం. ఆయన స్వయంగా ఎన్నోసార్లు మోటుపల్లి సందర్శించారని చెబుతారు. అలాగే రాణి రుద్రమదేవి కూడా పలు మార్లు ఇక్కడకొచ్చారని అంటారు.
మోటుపల్లి ఓడరేవు గురించి సుప్రసిద్ధ ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన రచనల్లో ప్రస్తావించాడు.13వ శతాబ్దంలో రాణి రుద్రమదేవి పాలనా కాలంలో ఆయన మోటుపల్లిని సందర్శించాడు. ఈ ఓడరేవునుండి తూర్పు పశ్చిమదేశాలకు వజ్రాలు,రత్నాలు,అతివిలువైన సన్నని వస్త్రాలు ఎగుమతి అయ్యేవి.
వీటిని ధరించని రాజుగానీ,రాణిగానీ, కుబేరులు కానీ ప్రపంచంలో ఉండరని కాకతీయకాలం నాటి వస్త్రాల ప్రత్యేకతను మార్కోపోలో కొనియాడారు. అప్పట్లో ఎన్నో దేవాలయాలు కలిగిన పట్టణంగా పేరొందిన మోటుపల్లి ప్రముఖ యాత్రాకేంద్రంగా ప్రసిద్ధి పొందిందని మార్కో పోలో తన రచనల్లో ప్రస్తావించారని అంటారు. ఇపుడు మోటుపల్లి ని చూస్తే … పైన రాసినవన్నీ అబద్దాలని అనుకుంటారు. అంత దుర్భర స్థితిలో ఉంది. పట్టించుకునే నాధుడే లేడు .