దిగ్గజ ఈతగాడు అంటే ఇతడే !

Sharing is Caring...

Martin strel Vs Amazon River…………………………………….

పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు మార్టిన్ స్ట్రెల్. మనం ఈతగాళ్లను … గజ ఈతగాళ్లను చూసి ఉంటాం. కానీ మార్టిన్ వాళ్ళను మించిన దిగ్గజ ఈతగాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అమెజాన్ నది మొత్తాన్ని 66 రోజులలో ఈది రికార్డు సృష్టించాడు. 3,274 మైళ్లు విస్తరించిన నదిలో నాన్‌స్టాప్‌గా ఈదడమంటే మాటలు కాదు .. మార్టిన్ ఆ లక్ష్యాన్నిసాధించాడు.

చాలామంది అమెజాన్ లో ఈత అంటే ప్రాణాలతో చెలగాటం అని హెచ్చరించినా మార్టిన్ వెనుకడుగు వేయలేదు. “ఎలాగైనా అమెజాన్‌ లో ఈదుతాను లేదా ప్రయత్నిస్తూ చనిపోతా”నని చెప్పి ధైర్యంగా “మందూ, మందీ,మార్బలం”తో బయలు దేరాడు. అమెజాన్ నదిలో భయంకరమైన పిరాన్హా చేపలు,మొసళ్ళు,అనకొండలు సంచరిస్తుంటాయి. నిరంతరం ముప్పు పొంచి ఉంటుంది. నదిలో ఈత కొట్టడం మొదలయ్యాక మార్టిన్ కు తీవ్రమైన వేడి గాలులు ఎదురైనాయి.

ఎండ వేడిమి తట్టుకోలేక శరీరంపై పొక్కులు వచ్చాయి. వడ దెబ్బతగిలింది. అడవుల్లో స్థానిక తెగలు వెంటబడిన సందర్భాలున్నాయి. మార్టిన్ రోజువారీ లక్ష్యం నిర్ణయించుకున్నాడు. దాని ప్రకారం అతగాడు ప్రతిరోజూ 10-12 గంటలపాటు ఈత కొడుతూ దాదాపు 90 కి.మీ చేరుకోవాలి. అంటే ఎక్కువ సేపు నీళ్లలోనే ఉండాలి. దాని వల్ల శరీరం అలసటకు గురయ్యేది. నీటి లో సంచరించే పరాన్న జీవులు అతని శరీరాన్ని ఇన్ఫెక్షన్ కి  గురి చేశాయి.డెంగ్యూ జ్వరంతో  ఒళ్ళు నొప్పులు వచ్చేవి. మెడ.. భుజాలు .. చేతులు నొప్పి పుట్టేవి. అయినా మెడిసిన్ వాడుతూనే రోజూ ఈదే వాడు. మార్టిన్ ఎస్కార్ట్ బోట్ కూడా అతని వెనుకనే వెళ్ళేది. అందులో మార్టిన్ కుమారుడు,మేనేజర్ బోరుట్ తో పాటు సెక్యూరిటీ గార్డులు ఉండేవారు. అమెజాన్ నదీ మార్గంలో దొంగలు ఉంటారు. వారి నుంచి రక్షణ కోసం గార్డులను కూడా నియమించుకున్నాడు.బోట్ లో ఆహరం .. రకరకాల మందులు, మద్యం నిల్వలను పెట్టుకున్నారు.

ఒకసారి మార్టిన్ పై కందిరీగలు దాడిచేశాయి. మరోసారి పక్షులు కిందగా ఎగురుతూ ముక్కుతో పొడిచాయి.దీంతో అతగాడు ముఖాన్ని కవర్ చేసుకునేందుకు పిల్లో కేస్ వాడాడు. మార్టిన్ కి వైన్ అంటే ప్రాణం. తాగకుండా ఉండలేడు. రోజూ టార్గెట్ పూర్తి అవగానే బోట్ లో కొచ్చి వైన్ తాగేవాడు. సరిపడా ఆహరం తీసుకునే  వాడు.  మనిషి వాసనను పసిగడితే  పిరాన్హా చేపలు గుంపులు గుంపులుగా దాడి చేస్తాయి. ఒకసారి  పిరాన్హా చేపలు మార్టిన్ కాలును కొరికాయి. వాటిని పక్క దారి మళ్లించేందుకు జంతువుల రక్తాన్ని నీటిలోకి వదిలారు.

ఆ రకం చేపలు వాసన పట్టకుండా  గ్యాసోలిన్ క్రీమ్ ను శరీరానికి పూసుకునే వాడు. స్విమ్మింగ్ జాకెట్,వెట్‌సూట్‌ ధరించి నప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించేవాడు. మార్గ మధ్యంలో పిశాచి చేపలు, సొరచేపలు కూడా ఎదురు పడేవి. వాటి నుంచి జాగ్రత్తగా తప్పించుకుంటూ ముందుకు పోయేవాడు. మార్టిన్  మార్గంలో పోర్పోయిస్ .. డాల్ఫిన్‌లు మాత్రమే ఏ హానీ చేయకుండా అతనితో కలిసి కొంత దూరం ఈదుకుంటూ వచ్చేవి.

మార్టిన్ ఈత ప్రారంభించే సమయంలో 114 కేజీల బరువు ఉన్నాడు. 66 రోజుల్లో దాదాపు 20 కేజీల బరువు తగ్గాడు.  శరీరానికి శక్తిని అందించడానికి 11,000 కేలరీల  ఆహారం రోజూ తీసుకునే వాడు.అందులో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉండేవి.  ఆ విధంగా 2007లో స్లోవేనియా కి చెందిన మార్టిన్ స్ట్రెల్ 52 సంవత్సరాల వయస్సులో అమెజాన్ నదిని ఈదిన మొదటి వ్యక్తిగా రికార్డుల్లో  కెక్కాడు. 

మొదటిసారిగా స్వదేశంలోని 65-మైళ్ల క్రకా నదిని 28 గంటల్లో ఈదాడు. ఆ తర్వాత అనేక నదులు .. సముద్రాలను  అవలీలగా ఈది చరిత్ర సృష్టించాడు. బిగ్ రివర్ మ్యాన్ పేరిట ఒక డాక్యుమెంటరీ ఫిలిం కూడా తీశారు. యూట్యూబ్ లో ఉంది. ఆసక్తి ఉన్నవాళ్లు చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!