రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ( వైజాగ్ స్టీల్) ప్రైవేటీకరణ కు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. 1991 ఆర్ధిక సంస్కరణలలో మనం అంగీకరించిన విధానాలలో భాగమే ఇదీనూ. ఇప్పటివరకూ ఎన్నో ప్రభుత్వ సంస్థలు అలా ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.అలా పోయినవాటిలో అత్యధికం కారు చవకగా పోయినవే. ఇప్పుడు వైజాగ్ స్టీల్ వంతు. దీని కథ ఎలా ముగుస్తుందో అని ఆంధ్ర ప్రజలలో ఆందోళన. మన విధానాలు ప్రైవేటీకరణ అనే ఆ ఒక్క కారణముతో మిగతా విషయాలను ఏమీ పట్టించుకోకూడదా? ప్రయివేటీకరణ ఎందుకు అవసరం, ప్రభుత్వ రంగములో ఉంటె ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే మార్గాలు లేవా .? ప్రయివేటీకరణ తప్పని సరి అయినప్పుడు అనుసరించవలసిన పారదర్శక విధానాలు ఎలా ఉండాలి వంటి వాటిపై ఒక సారి ఎందుకు సమీక్షించుకోకూడదు.
చట్టసభల లోపల, బయట కూడా దీనిపై చేర్చించవలసిన కీలమైన సందర్భమిది. ఇది ఒక్క వైజాగ్ స్టీల్ కు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఆర్థిక సంస్కరణల తరువాత దేశములో చోటుచేసుకున్న మంచి చెడులను సమగ్రంగా చర్చించుకోవటం, జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు, భవిష్యత్ బాగుకోసం అవసరమైన నూతన విధానాలను రూపొందించుకోవడం మంచిదే కదా. కానీ దేశ పురోగమన ప్రయాణానికి ఉపయోగపడే వాటిపై దృష్టిపెట్టే తీరిక, కోరిక ఆ వాతావరణం అటు చట్టసభ సభలలో గానీ, మీడియాలో గానీ పెద్దగా కనిపించటం లేదు. ప్రజలు వ్యక్తిగతముగా ఆర్థికంగా ఉన్నతులవుతున్నారు గానీ, కొందరు ప్రైవేటు వ్యాపారవేత్తలు దేశ ( ప్రజల) సహజ వనరులను అసంబద్ధంగా దక్కించుకొనో, లేక ప్రభుత్వ పక్షపాత విధానాల వల్లనో విపరీత సంపదను పోగేసుకుంటుంటున్నారు. ఫలితంగా ఒక సమాజంగా, దేశ పౌరులుగా మనం చాలా కోల్పోతున్నాం.
అలా అని ప్రైవేటీకరణ వద్దు అనేందుకు కూడా లేదు 1991 వరకు ఉన్న మన ఆర్ధిక వెనుకబాటే ఉదాహరణ. ఇక్కడ ప్రైవేటీకరణ ఉండాలి కానీ అది అసంబద్ధంగా ఉండకూడదు. ఒక రంగములో ప్రైవేటు వారికి అనుమతించారంటే ఆ రంగములో ప్రభుత్వ సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. దానికి ఉదాహరణే టెలికాం, ఎయిర్ లైన్స్ … ఇందుకు కారణాలు ప్రభుత్వం ప్రైవేటు వారికి ఊతమిచ్చే విధంగా పక్షపాత విధానాలను రూపొందించటం కావచ్చు , ప్రభుత్వ సంస్థలను నడిపే యాజమాన్య, ఉద్యోగులలో సహజంగా నెలకొనే అధిక నిర్లక్ష్యం, నిర్లిప్తత, తక్కువ పని సంస్కృతి, జవాబుధారితనం లేకపోవడం కావచ్చు. ఇది అందరికి వర్తించదు కానీ ఒకే విధానాలు ఉన్నచోట లేదా ఇంకా మెరుగైన విధానాలు ఉన్నచోట కూడా మంచి ఫలితాలను చూపలేని అన్ని సంస్థలు వీటికి ఉదాహరణే. డబ్బు లేక ప్రజలు ప్రభుత్వ సంస్థల సర్వీసులు పొందుతారేమో కానీ డబ్బుంటే మాత్రం ఖర్చు పెట్టుకోనైనా ప్రైవేటు సేవలకు మొగ్గుచూపడం మనకు తెలుసు. ఇక్కడ ఆయా ఉద్యోగులు నిజాయితీగా సమీక్షించుకోవాలి తమ ప్రవర్తన ఎంతవరకు సమంజసమని, అలాంటి సంస్థలు ప్రయివేటీకరణకు వెళ్ళినపుడు దానిని ప్రశ్నించే నైతిక హక్కు వారికి ఎలా ఉంటుంది.
వైజాగ్ స్టీల్ ఆర్థిక ఫలితాల ఆధారంగా ఇప్పుడు ఈ చర్చ జరుగుతుందేమో కానీ … అలా ఆర్థిక తక్కెడలో తూచలేని మన ప్రభుత్వ విద్యా సంస్థలు ముఖ్యంగా ప్రాథమిక విద్యాసంస్థలు, అక్కడి ఉపాధ్యాయులు ( అందరూ కాకపోయినా అత్యధికమంది) కలిగిస్తున్న నష్టం చాలా ఎక్కువ రెట్లు కాదా ?. విద్య ప్రభుత్వ బాధ్యతగా ఉండటం వీరికి వరంలాగా మారింది. లేకపోతే అదే డబ్బును ప్రైవేటు వారికి చెల్లించి విద్యను అందివ్వగలిగితే పన్ను చెల్లింపుదారులు కడుతున్న డబ్బుకు గరిష్ట ఫలితముంటుంది. అందుకు ప్రైవేటు బడులకు పంపుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులే పెద్ద ఉదాహరణ. వాళ్ళు కూడా ఒక సారి తమ పనితీరుపై, ప్రవర్తనపై నిజాయితీగా సమీక్షించుకోవటం మంచిది. లేకపోతే ఏ తిక్కల నాయకుడో వచ్చి దానిని కూడా ప్రైవేటుకు అప్పజెప్పి మెరుగైన విద్యనందిస్తామంటే ప్రజలు పెద్దగా స్పందించరేమో.
ఇలాంటివన్నీ ఒకవైపు అయితే .. ప్రభుత్వ విధానాల వల్ల కొందరు వ్యాపారవేత్తలు అంతులేని సంపద పోగేసుకొని దేశనాయకులను కూడా వారికి అనుకూలంగా ప్రభావితం చేస్తున్నారని ఇప్పటికే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కొంతమంది వ్యాపారవేత్తలు ఇంకా బలపడితే వారిని ఎదుర్కొనే శక్తి ఇప్పుడు మనం చూస్తున్న బలహీన వ్యక్తిత్వం గల వంటి నాయకులకు ఉండదు .. ఉండబోదు. ముందు ముందు తలెత్తే పరిస్థితులను వూహించుకొంటే దేశములోని అత్యధిక మంది అతి శక్తిమంతమైన, పెద్ద వ్యాపారసంస్థలకోసం ఒక మెరుగైన తరగతి బానిసలుగా మారిపోయే ప్రమాదముందనిపిస్తుంది. వారికి నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రాలు కూడా ఉండే అవకాశముండదు. కొందరి వ్యాపారవేత్తల సంపదపై ఆశను, దానికోసం వారు అనుసరిస్తున్న పద్ధతులను చూస్తే ఈ దేశమే తమదిగా మార్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారా అని అనిపిస్తుంది.
ప్రైవేటీకరణలో వైజాగ్ స్టీల్ మొదటిది కాదు చివరిదీ కాదు, ఇప్పుడు దీనితోపాటు ఎదురవ్వబోయే పెద్ద సమస్యలను కూడా చర్చించాలి. వీటన్నిటికీ సమాధానాల కొరకు, సవాళ్లకు పరిష్కారాల కొరకు అందరూ చర్చించవలసిన సందర్భం ఇది.