ఇతనొక మెగా’మాయ’గాడు !

Sharing is Caring...

Subbu Rv…………………………………………. 

కష్టంతో, కృషితో, పేదరికంతో, సంకల్పంతో ఎదిగిన వ్యక్తి అంటే ఎవరికైనా గౌరవమే. అలాంటి వారికి ఈ సమాజం ఇచ్చే గౌరవం చాలా గొప్పగా ఉంటుంది. వారిని హీరోలుగా చూస్తూ..  రోల్ మోడల్ గా భావిస్తూ సంకల్ప సాధనలో సాగేవారు కూడా వుంటారు. ఒక సినిమాకి ముందు కధ చెప్పేటప్పుడు ఆ స్టోరీ లైన్ వినే వాళ్లను అలా కట్టిపడెయ్యాలి.

అన్ని ఎమోషన్స్ ఉంటేనే ప్రేక్షకుడు సూపర్ హిట్ చేస్తాడు. దాని కోసం డైరెక్టర్లు, రైటర్లు అసలుకు కాస్త మసాలా కలిపి ప్రేక్షకుడి భావోద్వేగాలతో హిట్ కొడతారు. ఇదంతా జరగడానికి కథ, స్క్రీన్ ప్లే, యాక్షన్స్, బాక్గ్రౌండ్ ఫైనల్ గా డైరెక్షన్ అంతకుమించి యాక్టింగ్ కలిపి మార్కెటింగ్ ఇలా అనేకమంది కష్టపడాలి కానీ ఓకే ఒక్కడు ఇవన్నీ చేయగలిగితే వాడు మాములోడు ఎలా అవుతాడు చెప్పండి.  సరే విషయానికి వద్దాం..

‘ఒక పంతొమ్మిదదేళ్ల కుర్రాడు అంతర్జాతీయ స్థాయిలో దేశం పేరు నిలబెట్టి పతకం సాధించాడు. పుట్టుకతో పేద కుటుంబం, తండ్రి ఓ పేద రైతు, రెక్కాడితే డొక్కాడని కుటుంబం. పూట గడవని పరిస్థితుల్లో కష్టపడి చదువు, చదువుకుంటూ పని కెళ్ళి దాచుకున్న డబ్బుతో ఇంటర్నెట్ సెంటర్ కి  వెళ్ళి ఇస్రో, నాసా లాంటి సంస్థల గురించి శోదించేవాడు. అక్కడి సైంటిస్టులకు మెయిల్స్ రాసేవాడు. జవాబులు రాకపోయినా  నిరాశ పడే వాడు కాదు. 

ఎలక్ట్రానిక్స్ అంటే విపరీతమైన ప్రేమ అయినా పేదరికం కారణంగా Bsc లో జాయినయ్యి, హాస్టల్ ఫీజు కట్టలేక పోతే బయటకి తోసేశారు. బస్టాప్, పబ్లిక్ టాయిలెట్లో పనిచేసి కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకుని, ఆఫీసుల నుండి వచ్చే E- వేస్ట్ లోని వస్తువులు సేకరించి, రాత్రి పగలు కష్టపడి ఎనభై ప్రయత్నాల తర్వాత ఎగిరే డ్రోన్ తయారు చేశాడు. ఫ్రెండ్స్ మధ్య హీరో అయ్యాడు.

చాలా డ్రోన్ మోడల్ ప్లాన్స్ అతని మెదడులో ఉన్నాయి. ఇంతలో ఢిల్లీ డ్రోన్ కాంపిటీషన్స్ లో అతి కష్టం మీద జనరల్ బోగీలో ప్రయాణం చేసి పాల్గొన్నాడు. రెండవ బహుమతి పొందాడు. ఫలితంగా జపాన్ లో జరిగే ఇంటర్నేషనల్ డ్రోన్ కాంపిటీషన్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. అసలే పేదరికం జపాన్ అంటే మాటలా చెప్పండి చెన్నై లోని ఇంజనీరింగ్ కాలేజి ప్రొఫెసర్, మైసూరులోని ఒక దాత, కొందరు ఫ్రెండ్స్ ఆఖరిగా ఇతర ఖర్చుల కోసం తల్లి మంగళ సూత్రం, కమ్మలు అమ్మి అరవై వేలు తీసుకున్నాడు.

బుల్లెట్ ట్రైన్ ఎక్కే స్థోమత లేక మాములు రైళ్లలో గంటల కొద్దీ ప్రయాణించాడు. చివరికి ఆ పోటీలో ప్రధమ బహుమతి  గెలిచాడు. 127 దేశాల ప్రతినిధుల్లో ఇండియా తరపున ప్రధమ బహుమతి సాధించి .. ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చాడు.  వేదికపై మువ్వన్నెల పతకాన్ని హత్తుకున్నాడు. ఫ్రాన్స్ ఇతనికి నెలకి 16 లక్షల జీతం, రెండున్నర కోట్ల కారు, బంగ్లా ఇస్తాం అని ఉద్యోగం ఆఫర్ చేసింది. 

దేశం కోసమే ఇదంతా అని మాతృభూమి రుణం తీర్చుకోవడం కోసమే అన్నాడు. దేశాలన్నీ తిరిగి యువ శాస్త్రవేత్తగా DRDO లో నియమితుడయ్యాడు. ఈ క్రమంలోనే  600 డ్రోన్లు తయారు చేసే పనిలో పడ్డాడు. ఇదంతా విన్నా, చదివినా ఎక్కడో తెలియని భావోద్వేగం మనల్ని కమ్ముకుంటుంది. సభలు, సన్మానాలు, బిరుదులు, గౌరవ డాక్టరేట్ లు, ప్రసంగాలు ఇలా దేశం గర్వించే స్థాయిలో నిలబడ్డాడు మన డ్రోనాచార్య @ డ్రోన్ బాయ్ @ డ్రోన్ బాయ్ ఆఫ్ ఇండియా@ యూత్ ఐకాన్ @ MN ప్రతాప్ అలియాస్ డ్రోన్ ప్రతాప్.

ఒక్కసారిగా వచ్చిన గుర్తింపు యంగ్ సైంటిస్ట్, డ్రోన్ బాయ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గోల్డ్ మెడల్ అవార్డ్, వార్తా కధనాలు, సోషల్ మీడియా మోటివేషనల్ పోస్ట్స్, ఇంటర్వ్యూలు, టెలివిజన్ ప్రత్యేక కధనాలు, అవార్డులు, రివార్డులు, సెల్ఫీల కోసం, ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడిన జనాలు, పెద్ద పెద్ద కంపెనీల ఆహ్వానం, యూనివర్సిటీ ల పిలుపులు … సీఎం తో సహా అభినందనలు. 

స్వాములోర్లు, మినిస్టర్లు, నాయకులు, సినీ హీరోలు, రచయితలు, మేధావుల ప్రశంసలు , కలయికలు,విందులు, ప్రయాణాలు.. అతనొక ఐకాన్.. ఇళ్లల్లో తల్లిదండ్రులు అతన్ని చూపించి మిగతా పిల్లలని తిట్టే వారు, దేశానికి చూడండి ఎంత సేవ చేస్తున్నాడో .. ఎంతగా ఎదిగాడో అంటూ.  ఇలా గత ఏడాది జూన్ వరకు అనేక అనూహ్య కధనాలు అబ్బురపరిచే డ్రోన్ విన్యాసాల తో సాగింది ప్రతాప్ జీవితం. 

2021 జూన్ లోనే అసలు విషయం బయటకి వచ్చింది. అప్పటికి కానీ తెలియలేదు ఓ కనికట్టు గారడీ లో మూడేళ్ళు గడిచాయని. ఒక వెబ్సైట్ వెల్లడించిన కథనం ప్రకారం ఇతని విషయాలు అన్నీ ఆధారం లేని మాటలు అలాగే డ్రోన్ తయారీ కూడా అబద్ధం.వేరే కంపెనీల డ్రోన్స్ ఫొటోస్ పెట్టి  నిజం అనిపించే మాయలో అందరిని ఉంచాడని.  
నిజాన్ని చూపించే మీడియా..  విశ్లేషించే పెద్ద పెద్ద మేధావులు, ప్రభుత్వం, స్వాములు, సినీ ప్రముఖులు ఇలా ఒకరేమిటి మొత్తం వ్యవస్థ  ఈ 23 ఏళ్ళ కుర్రాడి కనికట్టును కళ్ళప్పగించి చూస్తూ ఉంది. మొదటగా ఇతని గురించి ప్రచారం చేసింది మీడియానే. అవేవో చిన్న ఛానెల్స్ కాదు అన్నీ టాప్ మోస్ట్ ఛానెల్స్. ప్రతాప్ మాయలో నిజాలు తెలుసుకోడానికి మూడేళ్ళు పట్టింది. ఈ మూడేళ్ళలో ప్రతాప్ ఏమేం చెయ్యాలో, ఎంత అనుభవించాలో అన్నీ చేశాడు. కొందరు ప్రతాప్ ఫేమ్ ని వాడుకోవాలని DRDO లో యంగ్ సైంటిస్ట్ గా పీఎం మోడీ నియమించారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఇక్కడి నుండే అతని గురించి నిజాలు తెలుసుకునే విచారణ మొదలై మోసాలు బయటకి వచ్చాయి. అప్పటికే సామాన్యులు చేరలేని, వీలుకాని స్థానాన్ని పొందాడు. ఎందుకలా చేశాడో కారణాలు తెలియవు. ఒకరిని మాయ చేస్తేనే మోసగాడు అంటాము మరి ప్రతాప్ ఒక వ్యవస్థనే తన మాయలో పెట్టాడు కాబట్టి  మెగా మోసగాడు అనాలా?

ఒక ఫేమస్ సాములోరు కూడా ఎనిమిది లక్షలు ప్రతాప్ కి ముట్టచెప్పాడు. హీరోని చేసిన మీడియా తరువాత విలన్ అనింది. ఇప్పుడు ప్రతాప్ ని మోసగాడు అనాలా లేక తెలివిగల వాడు అనాలా అనేది మీ ఇష్టం.దేశ విదేశాల్లో ఇంకా యథేచ్ఛగా ప్రతాప్ తిరుగుతున్నాడు.ప్రతాప్ మోసగాడు, చీటర్ ,420 అని అంటున్నప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో ఆకాశంలో విమానంలో ఎగురుతూ ఒక వీడియో పెట్టాడు.

దాని సారాంశం ” నేను ఓడిపోలేదు కొంతమంది కలిసి నన్ను ఓడించాలని ప్రయత్నించారు. ఈ ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా వున్నా, నన్ను ఆపాలని, ఓడించే ప్రయత్నం చేసినా , నేను ఆగను .. నా ప్రయత్నం చేస్తూనే ఉంటా. నేను ఓడిన రోజు నేను చచ్చినట్టే.. ఒక్కడినే అయినా నేను నా ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఒక రోజు వస్తుంది ఆరోజు నువ్వు గెలిచావా  లేక నేను గెలిచానా చూద్దాం.

STOP ME IF YOU CAN.. ” అంటూ అద్దంలో ఒక లాంటి నవ్వుతో హాలీవుడ్ సినిమా క్లైమాక్స్ లో హీరో మాయం అయినట్టు ఒక సవాలు విసిరి పోయాడు. ఇప్పటికైతే పట్టుకున్న దాఖలాలు లేవు. దొరకని డ్రోనా చార్య సక్సెస్ స్టోరీని సినిమాగా తీయాలని కూడా చూశారు కానీ ఇప్పుడు కూడా ఇదొక మంచి ట్రెండింగ్ స్టోరీనే. అతనొక కనికట్టు గారడీ మాయగాడు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!