ఎంతోమంది కలల రాణి ఈ నాట్య తార !

Sharing is Caring...

Siva Ram……………………….  A dancer who inspired many girls

హెలెన్‌……. భారత్ దేశం లో నెంబర్ 1 డాన్సర్. ఎంతోమంది డాన్సర్లకు స్ఫూర్తి నిచ్చిన నర్తకి. ఆమె సినిమాలో కనిపిస్తే చాలు కుర్రకారు ఊగిపోయేవారు. 60, 70 దశకాల్లో ఆమె లేని .. ఆమె డాన్స్‌ లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది కలల రాణిగా ప్రసిద్ధిగాంచిన హెలెన్ క్లబ్‌ డ్యాన్స్‌ స్పెషలిస్ట్..

హెలెన్‌ పేరు బాలీవుడ్‌లో వినని వారు వుండరు.. తన అందం .. అభినయంతో ప్రతి ఒక్కరిని కట్టిపడేసేది. క్లబ్‌ డ్యాన్స్‌లు చేయ్యాలంటే ఆమె తరువాతే అనేవారు .. ఆమె హొయల కోసమే ఆనాటి తరం థియేటర్లకు పరుగులు పెట్టేవారు. హెలెన్ వుందంటే చాలు సినిమా హిట్ అనే పేరు సంపాదించింది.. ఆమె యాక్టింగ్ చేసిన కూడా ఆ పాత్రకే జీవం వచ్చేది. అది క్యారక్టరా లేక ఆమె జీవితమా అని అనుకునేలా ఉండేది. ఇక క్లబ్‌ డ్యాన్స్‌ల్లో ఆమె కళ్లతోనే ప్రేక్షకుల మతి పోగెట్టేది.

అంతటి క్రేజ్ సంపాదించడానికి ఆమె పడిన కష్టాలు అన్ని ఇన్నీ కాదు. హెలెన్ సిల్వర్ స్పూన్ తో పుట్టిన వ్యక్తి కాదు. ఎన్నో కష్టాలు పడింది.. తండ్రి ఆంగ్లో ఇండియన్ .. తల్లి బర్మాదేశస్తురాలు .. నర్సుగా పనిచేసేది. హెలెన్ 1939లో జన్మించింది. హెలెన్ తండ్రి రెండవ ప్రపంచయుద్దంలో మరణించాడు. బర్మాపై జపాన్ దాడి చేయడంతో పొట్టచేతపట్టుకుని ఈమె కుటుంబం భారత్‌కు కాందిశీకులుగా వచ్చారు.

ఇక్కడివచ్చిన తరువాత తల్లి సంపాదన సరిపోకపోవడంతో చదువుకి స్వస్థి చెప్పింది. 1951లో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అడుగుపెట్టిన వెంటనే ఆమెకేమీ ఆఫర్లు రాలేదు. సైడ్ డ్యాన్స్‌ర్‌గా కెరియర్‌ మొదలుపెట్టింది. గుంపులో ఏదో మూల ఉంటే తనకు సరిపోదనుకుని గట్టి ప్రయత్నాలు చేసింది. సోలో డ్యాన్సర్‌గా 1954లో మొదటి అవకాశం వచ్చింది. చిన్న వేషాలు వేసినా ఆమెకి క్రేజ్ రాలేదు.

దాదాపు నాలుగు సంవత్సరాలు కష్టాలు పడ్డ తరువాత 1958లో తన 19వ ఏట శక్తిసామంత సినిమా హౌరాబ్రిడ్జిలో ఆమె చేసిన డాన్స్తో గుర్తింపు తెచ్చుకుంది .. “మేరా నామ్‌ చిన్‌ చిన్‌ చూ”తో బాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె వేసిన స్టెప్పులకు కాసుల వర్షం కురిసింది. అంతే ఇక హెలెన్‌ వెనుతిరిగి చూడలేదు.

ఆమె డాన్స్‌ లకు సింగర్‌ గీతా దత్‌ స్వరం మరింత క్రేజ్‌ తీసుకువచ్చింది.. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా హెలెన్‌ చేసింది. కొన్ని వ్యాంప్‌ పాత్రలు కూడా చేసింది. ఇక బాలీవుడ్‌ స్ప్రింగ్ మాస్టర్‌ షమ్మీకపూర్‌తో ఆమె చేసిన డాన్సులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇద్దరి జోడీ హిట్‌ పెయిర్‌ అన్నారు.

అంతేకాదు ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌ చేసి ప్రేక్షకులకి తనలో డ్యాన్సర్‌ మాత్రమే కాదు మంచి నటి కూడా వుందని నిరూపించింది. ఎన్ని క్యారెక్టర్స్‌ చేసిన కూడా ఆమెను డాన్సర్‌గానే ప్రేక్షకులు తమ గుండెల్లో ఉంచుకున్నారు . ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్రకి ప్రాణం పోయడమే కాదు. పాత్రకు తగ్గట్లు హావభావాలను పలికించడంలో ఆమెకి ఆమే సాటి.

ఆమె జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో నాలుగు సినిమాలు వచ్చాయంటే ఆమె ఎంతటి గొప్ప నటినో అర్దం చేసుకోవచ్చు. అంతేకాదు ది లైఫ్‌ అండ్ టైమ్స్‌ ఆఫ్ యాన్ హెచ్‌ బాంబ్‌ పేరిట బుక్ రిలీజ్ అయ్యింది కూడా ఆ బుక్‌కి నేషనల్ ఫిల్మ్‌ అవార్డ్ బుక్ ఆన్‌ సినిమా కైవసం చేసుకుంది. ఆమె నటనా కౌశలానికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని ప్రధానం చేసింది.

కెరియర్‌ ప్రారంభంలోనే అంటే1957లో సినీ రంగానికే చెందిన తనకంటే 27 సంవత్సరాలు పెద్దవాడైన ప్రేమ్‌ నారాయన్‌ అరోరాను వివాహం చేసుకుంది. ఆ బంధాన్ని 74 లో తెంచుకుంది. ఆ తరువాత 1981లో బాలీవుడ్ ఫేమస్‌ రైటర్‌ అప్పటికే వివాహం అయ నలుగురు పిల్లల తండ్రయిన సలీమ్‌ ఖాన్‌ను వివాహం చేసుకుంది.

ఈ సలీమ్‌ ఖాన్‌ ఎవరో కాదు .. హిందీ సూపర్ స్టార్ .. ఈనాటి యువత అభిమాన నటుడు ..అమ్మాయిల గుండెచప్పుడు… ఇప్పటకీ పెళ్ళి అంటే దూరంగా పారిపోయే సల్మాన్ ఖాన్ తండ్రి… . హెలెన్ .. ఖాన్‌ ఫ్యామిలీతో అన్యోన్యంగా హ్యాపీగా ముఖ్యంగా సలీమ్ మొదటి భార్య సల్మాతో కలివిడిగా వుంటూ ఉమ్మడి కుటుంబంలో కలిసిపోయింది. సల్మాన్‌ఖాన్‌తో పాటు మిగతా వారు కూడా హెలెన్‌ని ఎంతో ప్రేమతో చూసుకుంటారు.

తనకి పిల్లలు లేకపోయినా సలీంఖాన్‌ పిల్లల్ని తన పిల్లలుగానే చూసుకుంటుంది. మరోవైపు ఓ అమ్మాయిని దత్తత తీసుకుంది. ఆ అమ్మాయికి సల్మాన్ ఖాన్‌ హైదరాబాద్‌ ఫలక్‌నూమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించాడు ఈ వివాహానికి బాలీవుడ్ తరలి వచ్చింది. సల్మాన్‌తో మిగతా అన్నదమ్ములు కూడా అర్పితను దగ్గరుండి అత్తారింటికి పంపారంటే హెలెన్‌ ఎంతటి ప్రేమానురాగాలతో ఆ ఫ్యామిలీలో కలిసిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక హెలెన్‌ ఒక్క బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. ఇటు టాలీవుడ్‌లో కూడా తన చరిష్మా చూపించింది.తెలుగు లో 10కి పైగా చిత్రాల్లో నటించింది. హెలెన్ ‘హేమాహేమీలు’ .. ‘భోగిమంటలు’ చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ సరసన డాన్స్ సన్నివేశాల్లో నటించారు. మరోనర్తకి జ్యోతిలక్ష్మితో కలసి నటించింది. ఈ రోజుకీ కూడా హెలెన్‌ డ్యాన్స్‌ సాంగ్స్ టీవీలో వచ్చాయంటే ఎక్కడివారక్కడ అలెర్ట్ అవుతారు. అదండీ హెలెన్ కథ.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!