Stunning architecture……………………….
రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినా ఆనాటి రాచరికపు వైభవానికి చంద్రఘడ్ కోట ప్రతీకగా నిలిచింది. సంస్థానాల జిల్లాగా పేరు గాంచిన పాలమూరు జిల్లాలో శత్రు దుర్భేద్యంగా నిర్మితమై, గత చరిత్రను చాటుతోన్నఘనమైన కోట ఈ ‘చంద్రఘడ్’ కోట. కృష్ణానదికి 4 కి.మీ. దూరంలో ఎత్తయిన కొండపై ఈ కోట ను నిర్మించారు.
అమరచింత, వడ్డేమాన్ గ్రామాల నుంచి పన్నులు వసూలు చేసేందుకు రాజా తిమ్మారెడ్డి చంద్రసేన యాదవుడనే సైనికాధికారిని నియమించినట్లు, అతడే తన పేర ఈ చంద్రఘడ్ కోటను, తన భార్య పేరున ధర్మాపురం గ్రామాన్నినిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఐదు వందల అడుగుల ఎత్తున్న కొండపై ఉన్న ఈ కోట నిర్మాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆనాటి నిర్మాణశైలి పర్యాటకులను అబ్బుర పరుస్తుంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ చంద్రఘడ్ కోటకు సరైన గుర్తింపులేక మరుగున పడిపోయింది. శత్రువుల బారి నుండి రక్షించుకోవడానికి దుర్భేద్యమైన కోట గోడలు నిర్మించారు ప్రహరీ గోడలు చాలా ఎత్తుగా ఉండడంతో శత్రువులు లోనికి వచ్చే అవకాశం లేదు. కోట ప్రధాన ద్వారం ఈనాటికి చెక్కుచెదరలేదు.
ఇరువైపుల అరుగులు .. ఎత్తైన తలుపులు, కోట పై భాగంలో అక్కడక్కడ పిరంగుల కోసం గదులు నిర్మించారు. శత్రువులు దాడికి వస్తే ప్రత్యేక దర్పణాలతో పసిగట్టి ఫిరంగుల ద్వారా మట్టికరిపించే నిర్మాణాలు ఉన్నాయి కోటపై నీటి ఎద్దడి తలెత్తకుండా 12 చలమలు తవ్వించారు. రాయిపై నిర్మించిన ఈ చలమలలో నిత్యం నీరు ఊరుతుండటం ఇక్కడి ప్రత్యేకత.
రాతితో కట్టిన ఈ కోటపై నుంచి చూస్తే చుట్టుపక్కల మొత్తం పది కిలోమీటర్ల మేరకు కనిపిస్తుంది. పచ్చని పొలాలు ప్రకృతి సౌందర్యానికి దర్పణం పడతాయి. సుదూరంగా కనిపించే గ్రామాలు, చెరువులు, కుంటలు కనువిందు చేస్తాయి. కోట లోపల చంద్రసేనుడు తన ఇష్టదైవమైన రామలింగేశ్వర స్వామి ఆలయం కట్టించాడు. ఈ కోటలో ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే రాఖీపౌర్ణమి, మహాశివరాత్రి సందర్భంగా జాతరలు జరుగుతాయి.
ఈ జాతరలలో భాగంగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యువకులు ఈ పోటీలలో పాల్గొంటారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ చంద్రఘడ్ కోట పరిరక్షణ పై పర్యాటక శాఖ దృష్టి సారించలేదు. చంద్రఘడ్ కోటకు చేరుకొనేందుకు సరైన రవాణా సౌకర్యం లేదు.ఎలాగోలా కష్టపడి ఇక్కడికి చేరుకున్న సందర్శకులకు ఈ ప్రాంతంలో నిలువ నీడ కూడా లేదు. సరైన పర్యవేక్షణ కొరవడటంతో గుప్తనిధుల కోసం కోటను ధ్వంసం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చంద్రఘడ్ కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని నాయకులు హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇంకా ఆ దిశగా చర్యలు చేపట్టలేదని స్థానికులు అంటున్నారు. ఈ కోటను చేరుకోవాలంటే గద్వాల నుంచి 25 కిలోమీటర్లు .. మహబూబ్‌నగర్ నుంచి యాభై కిలోమీటర్లు ప్రయాణించాలి.
హైదరాబాద్‌కు 170 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. కోట వద్దకు రవాణా సదుపాయం లేదు. అక్కడ హోటల్స్ కూడా లేవు. అన్ని సమకూర్చుకుని సొంత వాహనంలో వెళ్ళాలి. అక్కడికి దగ్గర్లోనే ఉన్న జూరాల డ్యామ్నుకూడా చూడవచ్చు. అబ్బురపరిచే ఆనాటి ఇంజినీరింగ్ ప్రతిభను చూడాలంటే ఒక సారి కోటను సందర్శించాల్సిందే.
photo couresy…….. Naidugari Jayanna