ఈ ప్రముఖులంతా………..

Sharing is Caring...

Accidents vs lives……………………………………… 

హెలికాప్టర్ ప్రమాదాలు మన దేశంలో ఎన్నో జరిగాయి. ఇలాంటి ప్రమాదాలలో ఎందరో రాజకీయ ప్రముఖులు … ఆర్మీ అధికారులు మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి .. అంతకు ముందు లోకసభ స్పీకర్ గా చేసిన బాలయోగి, మరెందరో నాయకులు ఇలాంటి ప్రమాదాల్లోనే  ప్రాణాలు కోల్పోయారు.

2009 లో సెప్టెంబరు 2న హైదరాబాద్ నుండి బయలుదేరిన అప్పటి సీఎం వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్  కర్నూలుకు 49 మైళ్ల దూరంలో ఉన్న పావురాళ్ళ గుట్టపై కూలిపోయింది. ఈ ఘటనలో వైఎస్ రాజశేఖర రెడ్డి తో పాటు మరో నలుగురు మరణించారు. ఆ రోజున భారీ వర్షం ఉన్నప్పటికీ  వైఎస్ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యంలోనే వాతావరణం అనుకూలించక హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది.

ఆరోజు వైఎస్ హెలికాప్టర్ ఎక్కే ముందు ఎయిర్‌పోర్టు స్టాఫ్, పైలట్లు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆయన తో ఫొటోలు తీసుకున్నారట. హెలికాప్టర్ 10 గంటల 35 నిమిషాలకు దిగాల్సి ఉండగా … 9 గంటల 34 నిమిషాల నుంచి తిరుపతి ఏటీసీకి సిగ్నల్ లేదు. 9 గంటల 35 నిమిషాల నుంచి శంషాబాద్ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.ఇక ఆ తర్వాత సంగతి తెలిసిందే. 

2002 లో మార్చి 3న ఏపీ లోని  పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుండి అప్పటి స్పీకర్ జీఎంసీ బాలయోగి ప్రయాణిస్తున్నహెలికాప్టర్ కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని చేపల చెరువులో కూలిపోయింది. ఈ ఘటనలో బాలయోగి మరణించారు. బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఆ ప్రైవేట్ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. కొవ్వాడ లంక గ్రామ సమీపంలోని చెరువులో కూలిపోయే ముందు కొబ్బరి చెట్టును ఢీకొట్టింది. పైలట్, స్పీకర్ వ్యక్తిగత కార్యదర్శి డి.రాజు కూడా మృతి చెందారు. 

అలాగే  2011 ఏప్రిల్ 30న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ మరో నలుగురు వ్యక్తులు పశ్చిమ కమెంగ్ జిల్లాలో తవాంగ్ నుండి ఇటానగర్‌కు వెళుతుండగా హెలికాప్టర్ కూలిపోయింది. ఆరోజు కూడా వాతావరణం అనుకూలించక హెలికాఫ్టర్ ప్రమాదంలో చిక్కుకుంది. నాలుగురోజుల తర్వాత కూలిపోయిన హెలికాఫ్టర్ ఆచూకీ.. మృతదేహాలు లభించాయి. 

2005 లో మార్చి 31 న  హర్యానా మంత్రులు సురేందర్ సింగ్,ఓపీ జిందాల్ (ప్రముఖ పారిశ్రామికవేత్త)  యూపీ లోని  సహరాన్‌పూర్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో మృతి చెందారు.  2004  లో సెప్టెంబర్ 22 న  మేఘాలయ మంత్రి సైప్రియన్ సంగ్మా హెలికాప్టర్‌లో గౌహతి నుండి షిల్లాంగ్‌కు వెళుతుండగా  బరాపాని సరస్సు సమీపంలో చాపర్ కూలిపోయి మరణించారు. ఈ దుర్ఘటనలో మరో తొమ్మిది మంది వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 

2001 లో మే 8న అరుణాచల్ ప్రదేశ్ మంత్రి డేరా నతుంగ్ ఇటానగర్ నుండి వెస్ట్ కమెంగ్‌కు వెళుతుండగా హెలికాప్టర్ కుప్పకూలి దుర్మరణం పాలయ్యారు. 1997లో నవంబర్ 14 న అరుణాచల్ ప్రదేశ్‌లో పర్వతాలపై హెలికాప్టర్ కూలిపోవడంతో రక్షణ శాఖ సహాయ మంత్రి సోము మరణించారు. అలాగే 2001 లో కాంగ్రెస్ నాయకుడు, గ్వాలియర్ రాజకుటుంబ వారసుడు మాధవరావు సింధియా ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఆయనతోపాటు ఎనిమిది మంది వ్యక్తులు మరణించారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!