ఇవిగో ఆదిమానవులు నిప్పు వెలిగించిన ఆనవాళ్లు !

Sharing is Caring...

ఆదిమానవులు మధ్య రాతి యుగంలోనే నిప్పును కనుగొన్నారు. చెకుముకి రాయి రాపిడితో నిప్పు పుట్టింది. ఆ నిప్పు చలికాలంలో వెచ్చదనం ఇస్తుందని మానవుడు గ్రహించాడు. మెల్లగా కట్టెలు పోగేసి వాటిని వెలిగించడం అలవాటు చేసుకున్నాడు. నిప్పు నెగడు ఉంటే జంతువులు తమ వద్దకు రావని తెలుసుకున్నాడు. చీకట్లో నిప్పు వెలుతురును ఇస్తుందని అర్ధం చేసుకున్నాడు. నిప్పుల్లో మాంసం, దుంపలు కాల్చుకొని తినడం ప్రారంభించారు.

అదే సమయంలో కొన్నిపశువులను కూడా మచ్చిక చేసుకున్నారు. వాటి పెంపకం ప్రారంభించారు. ప్రముఖ పరిశోధకుడు రాబర్ట్ బ్రూస్‌ ఫూట్ నిప్పును వెలిగించిన ఆనవాళ్లను తెలంగాణ ప్రాంతంలోనే కనుగొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉట్నూరులో నిప్పును మండించిన తర్వాత మిగిలిన బూడిద రాశులు పురావస్తు తవ్వకాల్లో కనిపించాయి. కర్రలను లేదంటే రాళ్లను రాపాడించి నిప్పును కనుగొన్నది తెలంగాణలోని తొలి మానవుడే కావడం విశేషం.

రాబర్ట్ బ్రూస్‌ఫూట్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఉట్నూరులోని బూడిద రాశులన్నీ పేడ కుప్పలు. వాటికి నిప్పు అంటించగా అవి బూడిద రాశులుగా మిగిలాయి. అప్పట్లో బ్రిటిష్ మ్యూజియం అధికారులు వీటికి రసాయన పరీక్షలు కూడా చేశారు.  ఈ బయటపడిన బూడిద రాశులపై మరో బ్రిటిష్ శాస్త్రవేత్త ఎఫ్.ఆర్.ఆల్చిన్ కూడా పరిశోధన చేశారు. ఈ బూడిద రాశులు ఉన్న ప్రదేశాల్లో మొదట్లో పశువులను కట్టి ఉంచారు.వాటి పేడను ఒక చోట కుప్పగా  వేసేవారు.

ఆది మానవులు అక్కడ నుంచి వెళ్లేటప్పుడు పేడ కుప్పలను  తగలబెట్టేవారు. ఆ పెంట కుప్పలే కాలి బూడిద రాశులు గా మారి తవ్వకాల్లో బయటపడ్డాయి. అలాగే జనగామ సమీపంలో వడ్లకొండ చీటకోడూరు గ్రామశివార్లలో మైసమ్మ గుట్ట, పొట్టి గుట్ట, కోట గుట్టల్లో బూడిద రాశులు.. నిలువు రాళ్లతోపాటు అనేక రాకాసి గూళ్లున్నట్లు గుర్తించారు. ఆ మధ్య చరిత్ర పరిశోధకులు రత్నాకర్ రెడ్డి ఈ విషయం మీడియా కు తెలియజేశారు. 

కోట గుట్ట మైసమ్మ గుట్టల మద్య డ్యాం నిర్మాణంలో భాగంగా భూమి తవ్వకాలు జరిగినప్పుడు బూడిద రాశి కుప్ప బయట పడింది. అక్కడే పెద్ద పొడవాటి కుండలో ఎముకలను కూడా కనుగొన్నారు. ఈ ఎముకలు ఏడడుగుల ఎత్తున్న మనిషివి అయి ఉండొచ్చని అంచనా వేశారు. ఆది మానవుడు పేడ కుప్పలను  కాల్చడం, తర్వాత ఆ ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి తరలి వెళ్లడం వంటి అంశాలను పరిశీలిస్తే రుతువులు మారే సమయంలో పశువులతో సహా మరో సురక్షిత ప్రదేశానికి మారే వారని పరిశోధకులు అంచనా వేశారు. 

మధ్య రాతియుగంలో మానవుడు చిన్న చిన్న రాతి పనిముట్లు ఎక్కువగా ఉపయోగించాడు. వీటిని తమతో తీసుకెళ్లేవారు. పలు చోట్ల తవ్వకాలలో ఇలాంటి పనిముట్లు బయటపడ్డాయి. తెలంగాణలో నవీన శిలాయుగానికి చెందిన చాలా ప్రదేశాలు కనిపిస్తాయి. వీటిలో మౌలాలి, హఫీజ్‌పేట  వంటి ప్రదేశాలున్నాయి. ఈ ప్రాంతాల్లో నాటి రాతి పనిముట్లు, మంటల్లో కాల్చిన మట్టిపాత్రలు లభ్యమైనాయి. 

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. margayya malgudi October 10, 2021
error: Content is protected !!