చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి !

Sharing is Caring...

అలనాటి విలక్షణ నటి షావుకారు జానకిని ప్రభుత్వం లేటుగా అయినా గుర్తించి పద్మశ్రీ ప్రకటించడం గొప్పవిషయమే. 90 ఏళ్ళ వయసులో పద్మశ్రీ పురస్కారం పొందిన జానకి పేరును తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేయడం విశేషం.18 ఏళ్ల వయసులో చిత్ర సీమలో అడుగుపెట్టిన జానకి ఇంకా నటిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆమెలో ఆ చలాకి తనం తగ్గలేదు.

వయసు తన శరీరానికే కానీ మనసుకు కాదని చెప్పే జానకి తెలుగు, తమిళ ,కన్నడ భాషల్లో దాదాపు 500 చిత్రాల్లో నటించారు.టేకుమళ్ళ జానకి గా డిసెంబర్ -12- 1931 లో రాజమండ్రి లోపుట్టారు. నటి కృష్ణ కుమారి జానకి సొంత చెల్లెలే. ఇద్దరూ తెలుగు సినిమా కథానాయికలుగా నటించడం చెప్పుకోదగిన విషయమే.

1947 లో శంకరమంచి శ్రీనివాసరావు గారితో జానకి వివాహం జరిగింది..తర్వాత ఆకాశవాణిలో రేడియో ఆరిస్ట్ గా ఉద్యోగం చేశారు. ఆ సమయంలో ఎన్నో రేడియో నాటికల్లో నటించారు. 1949 లో షావుకారు మూవీ లో నటించిన దరిమిలా ఆ సినిమా పేరే ఇంటి పేరు గా మారిపోయింది.

చిత్ర పరిశ్రమలో జానకి కూడా చేదు అనుభవాలను చవిచూశారు. వాటి గురించి ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో వివరించారు. అక్కినేని దేవదాసు సినిమాలో తొలుత జానకినే తీసుకున్నారు ..కాస్ట్యూముల ఎంపిక.. ఓ పాట రిహార్సల్స్ జరిగాక షూటింగ్ మొదలయ్యే ముందు రోజు ఆమెను తొలగించారు.

ఈ ఘటనతో జానకి చాలా బాధపడ్డారు. అదే దేవదాసు నిర్మాత డి.ఎల్.నారాయణ కన్యాశుల్కం లో బుచ్చెమ్మ పాత్రకు జానకినే ఎంపిక చేసుకున్నారు. ఈమె కూడా కాదనలేదు. ఆ పాత్ర జానకికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ సమయంలోనే సావిత్రి అంటే జానకి కి జెలసీ అని ప్రచారం చేశారు …ఇప్పటికీ అది అలాగే ఉందని ఒక యూట్యూబ్ ఛానల్ కథనమొకటి ప్రచారంలోకి వచ్చింది. దాని గురించి జానకి మాట్లాడుతూ ఇలాంటివి ఎలా తయారుచేస్తారో అర్థం కాదు. నిజానికి సావిత్రి తనతో ఎంతో క్లోజ్ గా ఉండేదని .. చిన్నపిల్ల లాగా నాతో అన్ని విషయాలూ చెప్పేదని జానకి చెప్పుకొచ్చారు.

సావిత్రి మంచి నటి. ఆమెది ఫొటో జెనిక్ ఫేస్. ఉత్తమ నటి…ఆమె జీవితం అలా అయిపోయిందే…అని బాధే కానీ…జెలసీ ఎందుకు? అయినా నా పాత్రలు వేరు. ఆవిడ పాత్రలు వేరు.నిజానికి తను ఏపాత్రైన చేయగల సమర్ధురాలు అని కితాబు ఇచ్చారు జానకి. లెజెండ్స్ కు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. అది పబ్లిక్ చేయ వలసిన పనేముంది?అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగానే నిజానికి తెలుగు కంటే….తమిళ చిత్రసీమే నన్ను ఆదరించినదని వివరించారు. అన్నట్టు జయలలిత కు నాకూ కూడా పడదు….అంటూ యు- ట్యూబ్ లో ప్రచారం జరిగింది. ఇందులో కొంతే నిజముంది. ఎందుకంటే తను…..నాకంటే చాలా చిన్నది. వాళ్ళ అమ్మ సంధ్య షూటింగ్స్ కి వెళ్లేప్పుడు జయ ను మా ఇంట్లో వదిలి వెళ్ళేది.

మా పెద్దమ్మాయి .. జయ… ఒకే స్కూల్ లో చదువుకున్నారు. మా అమ్మాయి అనేది జయ….స్కూల్ టాపర్…సూపర్ ఇంటలిజెంట్ అని.ఆ తర్వాత జయలలిత స్టార్ అయింది. ఫూల్ ఔర్ పత్తర్ రీమేక్( ఒళి విళక్కు.)…తమిళం లో ఎం.జి.ఆర్ తో తీశారు. అందులో హీరోయిన్ మీనాకుమారి రోల్ నాకిచ్చారు. సైడ్ హీరోయిన్ పాత్ర జయలలిత ది.

సినిమా పూర్తయ్యాక…ఎం.జి.ఆర్. మీద ఒత్తిడి తెచ్చి…టైటిల్స్ లో ఆయన పేరు తరువాత…జయ తన పేరు పెట్టించుకుంది. మూడవ పేరు గా నా పేరు వేశారు. నిర్మాత..దర్శకులను అడిగితే….జరిగింది చెప్పి సారీ అన్నారు. ఆ తర్వాత కూడా కాస్త డిఫరెంట్ గా బిహేవ్ చేసేది జయ. నాకు అభిమానం ఎక్కువే. అందుకే….40 సంవత్సరాలు….మేము అసలు మాట్లాడుకోలేదు. ఒకసారి కొంతమంది నటీమణులతో లంచ్ కు ఆహ్వానించింది.

అయినా…ఓ ఇంటర్వ్యూ లో జయ గురించి… నా అభిప్రాయం అడిగితే ఒక్కటే చెప్పాను. “షి ఈజ్ ఎ స్ట్రాంగ్ లేడి. షి డిడ్ గుడ్ సర్వీస్ టు ద పీపుల్ ఆఫ్ తమిళ్ నాడు. షి విల్ రైజ్ టు ద పవర్ అగెయిన్” ఆ మాటలు జయను బాగా కదిలించాయి. తాను ఓ లెటర్ రాసింది. అది ఇప్పటికీ దాచుకున్నాను. “ఎంత చక్కగా చెప్పారమ్మా…మిమ్మల్ని వేరేగా అర్థం చేసుకున్నాను.”అంటూ అందమైన ఇంగ్లీష్ లో రాసింది . తరువాత సి.ఎం. అయ్యింది కూడా.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!