అవును నిజమే .. ఆ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వయసుకు అతీతంగా స్నేహితులు. స్నేహానికి వయసు పరిమితులు లేవు కదా. ఇండియాలోనే అతి పెద్ద వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి టాటా పక్కనున్న కుర్రోడు ఆయనకు అత్యంత సన్నిహితుడు.
టాటా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడేంత చనువు అతనికి ఉంది. అసలు ఎవరీ కుర్రోడు ? బంధువా ? కాదు . ఒక సామాజిక సేవా కార్యక్రమం ద్వారా వీరిద్దరు ఒకరికొకరు పరిచయమైనారు.ఇక ఆ కుర్రోడి గురించి చెప్పుకోవాలంటే…. అతగాడి పేరు శంతన్ నాయుడు. పూణే యూనివర్శిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. ఆతర్వాత టాటా ఎల్క్సీలో జూనియర్ డిజైన్ ఇంజనీర్‌గా చేరాడు.
రాత్రిళ్ళు ఇంటికి వెళుతూ కుక్కలు యాక్సిడెంట్ లో చనిపోవడాన్నిగమనించాడు. కొంతమంది డ్రైవర్లతో మాట్లాడాడు. చీకట్లో అవి తమకు కనిపించవని డ్రైవర్లు చెప్పారు. ఒకటి రెండు రోజులు కుక్కలను సేవ్ చేయడం ఎలా అని ఆలోచించాడు. అపుడతనికి ఒక ఆలోచన వచ్చింది.
కుక్కలు దూరం నుండి కనిపించేలా చేయడానికి, డ్రైవర్ వేగాన్ని తగ్గించడానికి లేదా లేన్ మార్చడానికి ‘గ్లో-ఇన్-ది-డార్క్’ కాలర్‌లు కుక్కల మేడలో వేసే ప్రయత్నానికి నాంది పలికాడు.‘మోటోపాస్’ అనే సంస్థను స్థాపించాడు. వలంటీర్ల సహాయంతో పాత డెనిమ్ ప్యాంట్లు సేకరించి రిఫ్లెక్టివ్ కాలర్‌లను తయారు చేసి 500 కుక్కలకు వాటిని వేశారు. ఆ ప్రయోగం విజయవంతం అయింది.
ఇదంతా టాటా గ్రూప్ న్యూస్ లెటర్ లో పబ్లిష్ అయి ..టాటా దృష్టికి వెళ్ళింది. ఆయన శంతన్ నాయుడిని ముంబై కి ఆహ్వానించారు. అలా ఆ ఇద్దరికీ పరిచయం అయింది.కాగా 2016లో శంతన్ అమెరికా వెళ్లి ఎంబీఎ పూర్తి చేసి వచ్చాడు.తర్వాత టాటా ట్రస్ట్‌లో ఛైర్మన్ కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా చేరాడు.
టాటా ఇండస్ట్రీలో శంతన్ ఐదో తరం ఉద్యోగి కావడం మరో విశేషం. రతన్ టాటా చేపడుతున్న సేవా కార్యక్రమాలను శంతన్ పర్య వేక్షణలో జరుగుతుంటాయి.అలాగే టాటా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల వెనుక కూడా శంతన్ ఉన్నాడు. సామాజిక మాధ్యమాలను ఎలా వాడుకోవాలో రతన్ టాటాకు అతగాడు నేర్పించాడు. 2017 లో పీపుల్ ఫర్ యానిమల్ అనే సంస్థ స్థాపన లో టాటా కు సహాయంగా నిలిచాడు శంతన్. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల వ్యయంతో టాటా ట్రస్ట్ ఓ హాస్పిటల్ నిర్మాణాన్నిచేపట్టింది.
అమెరికాలో శంతన్ చదివేటపుడు కార్నెల్ విశ్వవిద్యాలయ వార్షికోత్సవ వేడుకలకు రతన్ టాటా వెళ్లి వచ్చారంటే …శంతన్ ను ఆయన ఎంతగా అభిమానిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. శంతన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగంలోకి ప్రవేశించడానికి భయపడే విద్యార్థులకు కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాడు. అలాగే గుడ్ ఫెలోస్ అనే సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు. ఇవన్నీ చేస్తూనే రతన్ టాటా కు అన్ని విధాలా సహాయ పడుతుంటాడు. అది వాళ్ళ మధ్య స్నేహం.