పై ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు సయ్యద్ అహ్మద్ షా సాదత్ .. ఒకప్పుడు ఆయన ఆఫ్ఘనిస్థాన్ లో కమ్యూనికేషన్ శాఖా మంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం జర్మనీలో ఫుడ్ డెలివరీ చేసే మ్యాన్ గా పనిచేస్తున్నాడు. ఓడలు బండ్లు .. బండ్లు ఓడలు అవుతాయి అన్న చందాన సాదత్ కాలం కలిసి రాక జర్మనీలో చిన్న ఉద్యోగం చేస్తూ గౌరవ ప్రదం గా బతుకుతున్నాడు.
జర్మనీలో సాదత్ లీప్‌జిగ్ సిటీలో మీడియా కంట పడటంతో ఈ విషయాలన్నీ బయటకొచ్చాయి. సైకిల్‌పై వెళ్లి పిజ్జా డెలివరీలు ఇస్తున్న ఆయన్ను మీడియా కదలించగా తాను ఈ స్థితికి ఎలా వచ్చింది వివరించారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ కి .. సాదత్ కి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయట.ఈ క్రమంలోనే సాదత్ మంత్రి పదవికి రాజీనామా చేసాడు.
2018 వరకు ఆఫ్ఘన్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన సాదత్ తర్వాత జర్మనీకి వెళ్లాడు. కొన్నినెలల వరకు బాగా గడిచింది. తర్వాత సమస్యలు మొదలైనాయి. దాంతో జీవనోపాధి కోసం ఉద్యోగం వెతుక్కోవడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. వెంటనే ఫుడ్ పంపిణీ చేసే ఉద్యోగం లో చేరాడు. ప్రస్తుతం తాను సరళమైన జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉన్నానని సాదత్ అంటున్నారు.
జర్మనీలో లీప్‌జిగ్‌లో నా కుటుంబంతో ఉంటూ ఆనందంగా ఉన్నానని.. డబ్బు ఆదా చేసి మరిన్ని జర్మన్ కోర్సులు చదవాలనుకుంటున్నట్టు మీడియాకు వివరించారు. “నేను చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసాను.. కానీ ఎలాంటి స్పందన రాలేదు. నా కల జర్మన్ టెలికాం కంపెనీలో పనిచేయడం” అంటూ చెప్పుకొచ్చారు.
ఈ ఆఫ్ఘనిస్తాన్ మాజీ కమ్యూనికేషన్ మంత్రి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లో రెండు మాస్టర్స్ డిగ్రీ కోర్సులు చేశారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ .. కమ్యూనికేషన్స్ రంగాల్లో సాదత్ దిట్ట. గతంలో 13 దేశాలలో 20 కి పైగా కమ్యూనికేషన్ సంబంధిత రంగాలలో ఆయన పనిచేశాడు. కమ్యూనికేషన్ రంగంలో 23 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం సాదత్ తన సైకిల్‌పై తిరుగుతూ ఇంటింటికీ ఆహారం అందించే చిత్రాలు నెట్లో వైరల్ అయ్యాయి.