టార్గెట్ తెలంగాణయే !

Sharing is Caring...

తెలంగాణా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహపడుతుంటే .. అదే సమయంలో జాతీయ పార్టీలు తెలంగాణా లో పట్టు బిగించాలని ఉవ్విళూరుతున్నాయి. వరుసగా తెలంగాణకు అమిత్ షా ,రాహుల్,కేజ్రీవాల్,ఆ తర్వాత మోడీ పర్యటనలకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి తెలంగాణ భూమి రణక్షేత్రం గా మారే సూచనలున్నాయి.

ఇప్పటికే తెలంగాణాలో  బీజేపీ మాంచి దూకుడు మీదున్నది. ఉప ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహానికి మొన్నటి నాలుగు రాష్ట్రాల్లో గెలుపు తోడు కావడంతో ఆ పార్టీ శ్రేణులన్నీ జోష్ మీదున్నాయి.వరుసగా రెండు దఫాలు గెలిచి ముఖ్యమంత్రిగా చేస్తున్న కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు వెగటు పుట్టిందని.. ఆయన పాలనపై వ్యతిరేకత ఎక్కువైందని.. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలిగితే.. తెలంగాణలో అధికారంలోకి రావటం ఖాయమన్న భావనలో బీజేపీ నేతలున్నారు.

ఉత్తర ప్రదేశ్ తరహా ‘డబుల్ ఇంజన్’ నినాదంతో తెలంగాణ లో దూసుకు వెళ్లాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో ఉన్నపార్టీ  ప్రభుత్వమే రాష్ట్రాల్లో ఉంటేనే అభివృద్ధి సాధ్యం అన్న నినాదాన్ని మెల్లగా జనంలోకి తీసుకెళుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ సర్కార్ ను ఎండగట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.ఇందుకోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇప్పటికే పెరిగిన ఆర్టీసీ చార్జీలు , కరెంట్ చార్జీలపై  రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి సర్కార్ పై విరుచుకుపడుతోంది.  

కాంగ్రెస్ కూడా తెలంగాణలో అధికారమే లక్ష్యం కావాలని, తెరాస తో  అమీ తుమీ తేల్చుకునే దిశగా ముందుకు సాగాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. ఇందుకోసం రైతాంగ ఉద్యమంతో మొదలుపెట్టి.. ప్రజాందోళనలు తీవ్రతరం చేయాలని  తెలంగాణ  కాంగ్రెస్‌ నేతలకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ దిశానిర్దేశం చేశారు. రాహుల్ సూచనల మేరకు నీళ్లు, నిధులు, నియామకాలపై ఉధృతంగా ఉద్యమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఏప్రిల్‌ చివరిలో లక్షలాది మంది రైతులతో వరంగల్‌లో భారీ బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నారు.  ఈ సభకు రాహుల్‌గాంధీ హాజరై ప్రసంగించనున్నారు. రైతుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నేతృత్వంలోకమిటీ వేయబోతున్నారు. ఈ కమిటీ రైతులతో మాట్లాడి మరింత సమాచారం సేకరిస్తుంది. రైతుల సభ తరవాత నిరుద్యోగ సమస్యపై యువగర్జనను పార్టీ నిర్వహించబోతోంది. ఈ సభలో ప్రియాంకాగాంధీ పాల్గొనవచ్చు.

ఇక రేవంత్ ఒంటెత్తు పోకడలకు పోతున్నారని.. సీనియర్లను అస్సలు పట్టించుకోవట్లేదంటూ కొందరు నేతలు అసమ్మతి రాగం వినిపించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే వారు వరస భేటీలు నిర్వహించి టీకాంగ్రెస్‌లో అలజడి రేపారు.

దీంతో అలెర్టయిన అధిష్టానం అటువంటి సమావేశాలేవి నిర్వహించొద్దంటూ ఆదేశాలిచ్చింది..ఢిల్లీకి వెళ్లిన సీనియర్‌ నేతలకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి నిరాకరించారు.. దాంతో సీనియర్లు నిరాశగా వెనుదిరిగారు. రేవంత్ కు కూడా అందరిని కలుపుకు పోవాలని రాహుల్ సూచించినట్టు చెబుతున్నారు.

ఇక పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి జోష్‌ మీద ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌.. పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. జాతీయ పార్టీగా ఆప్‌ను మార్చి, కేంద్రంలో ప్రత్యామ్నాయ వేదికగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కేజ్రీవాల్‌ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్  తెలంగాణపై దృష్టి పెట్టారు.

ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని  అరవింద్  కేజ్రీవాల్ తెలంగాణాలో పాదయాత్ర చేయబోతున్నారు. 119 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ నేతలు పాదయాత్రలు చేస్తారు. కొంతో గొప్ప ఇమేజ్ ఉన్న నేతలు ఈ పార్టీలో చేరితే కొంత మేరకు ఫలితాలు సాధించవచ్చు. లేకుంటే అది ప్రయోగమే అవుతుందేమో. కొంత కాలం పోతే కానీ ఏమి చెప్పలేం. 

ఇప్పటికే తెలంగాణలో వివిధ రాజకీయపార్టీల నేతలు ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిళ పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మొదటి విడత పాదయాత్ర ముగిసింది. ఏప్రిల్ లో రెండో విడత యాత్ర చేపడతారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్రకు సిద్ధంకావడం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!