వారి పెళ్లిళ్లు భిన్నంగా ఉంటాయి !

Sharing is Caring...

Tribals Life style…………………………

అడవి తల్లి ఒడిలో..కొండల్లో కోనల్లో నివసించే కొండరెడ్ల గిరిజనుల జీవనశైలి ప్రత్యేకంగా ఉంటుంది. తరతరాలుగా వారు అనుసరించే  సంప్రదాయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వారి పెళ్లిళ్లు విభిన్నంగా జరుగుతాయి. కొండరెడ్ల వివాహలను కుటుంబ పెద్దలే దగ్గరుండి చేయిస్తారు. ప్రత్యేకంగా పురోహితులంటూ ఎవరూ ఉండరు. పెళ్లి మంత్రాలు కూడా ఉండవు.

ఈ కొండ రెడ్ల పెళ్లిళ్లకు పిలుపులు అంటూ కూడా ఉండవు. బొట్టు పెట్టి పిలవలేదు కదా అని పెళ్లిళ్లకు వెళ్లకుండా ఉండరు. గ్రామస్తులంతా పెళ్ళికి వెళతారు. పెళ్లి పనుల్లో కూడా గ్రామస్తులంతా తప్పనిసరిగా పాల్గొని చేతనైనవి చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు 1.25 లక్షల మంది గిరిజనులు ఉన్నారు.వీరిలో 10 వేల మంది కొండరెడ్డి తెగకు చెందిన వారు ఉంటారు. అలాగే ఖమ్మం,తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా నివసిస్తున్నారు. 

ఈ తెగ గిరిజనుల్లో అత్యధికులు బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ఎత్తైన కొండల నడుమ ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నారు. కొండరెడ్డి గిరిజనుల వివాహాల విషయంలో క్రమేణా పద్ధతులు మారుతున్నాయి. అయితే పాత ఆచారాలను పాటిస్తూనే నయా జీవన విధానానికి మెల్లగా మారుతున్నారు.1980వ సంవత్సరానికి ముందు ఏ యువకుడైనా ఒక యువతిని ఇష్టపడితే.. ఆ విషయం ముందుగా పెద్దలకు చెప్పేవారు.

అనంతరం  ఆ అమ్మాయి బయటకు వెళ్లినప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని తాను ఆ యువతిని పెళ్లాడుతున్నట్టు బహిరంగంగా ప్రకటించేవాడు. అతడిని పెళ్లాడటం ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఊరి పెద్దలు వారిద్దరికీ వివాహం జరిపించేవారు. ఈ పద్దతిలో చాలా చోట్ల మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఒక మగాడు ఇద్దరు, ముగ్గురు మహిళలను చేసుకునే ఆచారం కూడా ఉండేది. ఇప్పుడది తగ్గిపోయింది. 

ఇక పెళ్ళిలో ముందుగా గ్రామ పెద్దలు వరుడు, వధువు తలపై నీళ్లు పోస్తారు.ఆ తర్వాత వరుడు ఆ యువతి మెడలో నల్ల పూసల దండ వేస్తాడు. అంతే పెళ్లి అయిపోనట్లే. ఈ సందర్భంగా పెద్దలు వారిద్దరికి  సఖ్యతగా ఉంటూ కాపురం ఎలా చేసు కోవాలో వివరిస్తారు. ఇటీవల కాలంలో ఈ పద్ధతుల్లో కొన్ని మార్పులు వచ్చాయి. ఏ యువకుడైనా యువతిని ఇష్టపడితే తన ఇంటి పెద్దలకు చెప్పాలి.

వారు అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధం నిశ్చయిస్తారు. ఇటీవల తాళి కట్టే పద్ధతి కూడా మొదలైంది. అమ్మాయి, అబ్బాయి పెళ్లి తర్వాత కుల దేవతల దీవెనలు తీసుకుంటారు. ఇరు కుటుంబాలు గ్రామస్తులకు భోజనాలు పెట్టాలి. ఐదు రోజులపాటు పెళ్లి సంబరాలు జరుగుతాయి. కాలక్రమంలో వీరి జీవన శైలిలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. మాట తీరు .. కట్టు బొట్టు వంటి వ్యవహారాల్లో మార్పులు వస్తున్నాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!