The young man who defeated the former CM in Yanam …………. ఏ పార్టీ మద్దతు లేకుండా 29 ఏళ్ళ ఆ నవ యువకుడు యానాం లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల మాజీ ముఖ్యమంత్రి, ఎన్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామిని ఓడించాడు. అతడే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్.
రంగస్వామి ఎన్డీయే భాగస్వామి పార్టీ అభ్యర్థిగా యానాం లో పోటీ చేశారు. ఆయనకు సీనియర్ పొలిటీషియన్ మల్లాడి కృష్ణారావు అండగా నిలిచారు. అయిదు సార్లు యానాం నుంచి గెలిచి రాజకీయాల్లో చక్రం తిప్పిన మల్లాడి కృష్ణారావు అన్ని తానై రంగస్వామి తరపున ప్రచారం చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది.
మల్లాడికి యానాం నియోజకవర్గంలో మంచి పేరుంది. దేశంలోనే బెస్ట్ ఎమ్మెల్యే గా సెలెక్ట్ అయ్యారు. ఎన్నో మంత్రి పదవులు చేపట్టారు. సేవాకార్యక్రమాలు నిర్వహించారు. యానాం అనగానే మల్లాడి పేరే ముందు గుర్తుకొస్తుంది. తిరుగులేని రాజకీయ వేత్తగా మల్లాడి చలామణి అయ్యారు. ఆయన మద్దతు ఉందంటే ఖచ్చితంగా రంగస్వామి గెలవాలి.
కానీ చిత్రంగా ఓడిపోయారు.మల్లాడి ఈ సారి ఎందుకో పోటీ నుంచి తప్పుకున్నారు. రాజకీయ వాతావరణం అనుకూలంగా లేదని తెలుసు ఏమో ? మొత్తానికి రంగస్వామి రంగంలోకి దిగారు. బీజేపీ కూడా మద్దతు పలికింది. తెర వెనుక నుంచి వైసీపీ మద్దతు కూడా ఉందంటారు.
ఇక గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మొదటి సారే ఎన్నికల బరిలోకి దిగారు.
అతడు ఏ పార్టీని నమ్ముకోలేదు. స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేశారు. గతంలో ఒకసారి అశోక్ తండ్రి గంగాధర్ ప్రతాప్ మల్లాడిపై పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే బలమైన సామాజిక వర్గం అశోక్ కు అండగా నిలిచింది.
రంగస్వామి తమిళుడు కావడం, యానాం లో ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉండటం … గత ఐదేళ్లలో మల్లాడి నియోజకవర్గం పై అంత శ్రద్ధ చూపకపోవడం వంటి కారణాలు అశోక్ కు ప్లస్ అయ్యాయి. రంగస్వామి పూర్తిగా మల్లాడి బలంపై ఆధారపడి పోటీకి దిగడం … వాస్తవ పరిస్థితులను అంచనా వేయకపోవడం తో ఓటమి పాలయ్యారు.
రంగస్వామి కి 16477 ఓట్లు రాగా శ్రీనివాస్ అశోక్ కు 17132 ఓట్లు వచ్చాయి. 655 ఓట్ల మెజారిటీ తో శ్రీనివాస్ అశోక్ విజయం సాధించారు. మెజారిటీ తక్కువయినా రంగస్వామి ని ఆయన వెనుక నిలిచిన మల్లాడిని ఓడించడం చెప్పుకోదగిన విషయం. శ్రీనివాస్ విజయం తో మల్లాడి కోట బీటలు వారినట్టే. ఈ విజయం ప్రజలది అని … తాను ఇచ్చిన హామీల అమలు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శ్రీనివాస్ అశోక్ అంటున్నారు.

