ఆ గ్రామ మహిళలు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామం లోకి ఎవరూ రాకుండా .. ఉన్న వాళ్ళు బయటకు పోకుండా లాక్ డౌన్ పెట్టేసారు. ఆనిర్ణయం అమలు కావడానికి గ్రామ సరిహద్దులలో కాపలా కాస్తున్నారు. ఫలితంగా ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఆ గ్రామం మధ్యప్రదేశ్ లోని బేతుల్ నగరానికి దగ్గరలో ఉన్న చిఖలాపూర్. మద్యం అమ్మకాలకు ప్రసిద్ధి గాంచిన ఊరు ఇది. బయట వాళ్ళు రావడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ముందు చూపుతో గ్రామ మహిళలు అంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. పది రోజులనుంచి ఈ నిబంధనలు అమలులో పెట్టారు.
గ్రామం లోకి ఎవరూ ప్రవేశించకుండా సరిహద్దుల వద్ద కర్రలు పట్టుకుని కాపలా కాస్తున్నారు. ఆ చిత్రాలే ఇపుడు సామజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. బయట వ్యక్తుల ప్రవేశాన్ని నిషేదించిన విషయాన్ని తెలియ జేస్తూ మినీ బ్యానర్స్ రాయించి వెదురు బొంగులకు తగిలించారు.పగలు, రాత్రి డ్యూటీలు వేసుకుని మగవారి సహాయంతో కాపలా కాస్తున్నారు. గ్రామ ప్రజలకు బయటకు వెళ్లడం లేదు. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే.. వాటిని చేసేందుకు ఇద్దరు యువకులను పెట్టుకున్నారు. వీరు కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ బయటికి వెళ్లి వస్తారు. గ్రామస్తులకు అవసరమైన సరుకులను, ఇతర వస్తువులను కూడా వారే తెచ్చి పెడుతున్నారు. ఈ గ్రామాన్ని అనుకుని ఉన్న హైవే పై వెళుతున్నవారిని కూడా ఓ కంట గమనిస్తూ మహిళలు జాగ్రత్త తీసుకుంటున్నారు.
కరోనా నుంచి గ్రామాన్ని రక్షించుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని మహిళలు ముక్తకంఠంతో చెబుతున్నారు. వీరి కృషి ఫలించి ప్రస్తుతం గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు కాబట్టి ఆ గ్రామం ఇపుడు వార్తల్లో కెక్కింది.
అలాగే గుజరాత్ లోని షియాల్ బెట్ గ్రామంలో కూడా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. ఈ గ్రామం అరేబియా సముద్రం మధ్యలోఉన్న చిన్న దీవిలో ఉంది.దాదాపు 900 ఇళ్లు .. ఐదువేల జనాభా ఉన్నారు. అన్ని జాలర్ల కుటుంబాలే. రాకపోకలు తక్కువగా ఉండటంతో కరోనా ఫ్రీ గ్రామంగా ఉంది. ఊరి ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సముద్రం మధ్యలో ఉండటం మూలాన వీళ్లకు కలసి వచ్చింది.